ఢిల్లీలో కేసీఆర్, బిఆర్ఎస్ లను పట్టించుకునే వారే లేరా!

Wednesday, December 18, 2024

జాతీయ రాజకీయాలలో ఇక చక్రం తిప్పబోతున్నానని పేర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో తన కొత్త జాతీయ పార్టీ బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించి, అక్కడ నాలుగు రోజులున్నప్పటికీ ఎవ్వరు పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండడంతో అన్ని పార్టీల నాయకులు అక్కడే ఉన్నారు. 

ఎన్నికల సమయంలో నిధులు సమకూరుస్తారనో, మరో కారణం చేతనో మాజీ ముఖ్యమంత్రులు హెచ్ డి కుమారస్వామి, అఖిలేష్ యాదవ్ కార్యాలయ పారరంభంకు వచ్చారు. మిగిలిన పార్టీల నాయకులు ఎవ్వరు కనీసం శుభాకాంక్షలు కూడా తెలిపిన దాఖలాలు లేవు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంతో సన్నిహితుడిగా భావిస్తారు. ఆయన పార్టీ వారెవ్వరూ కూడా కేసీఆర్ ను పలకరించిన దాఖలాలు లేవు. 

ఇక, గతంలో స్వయంగా వెళ్లి కేసీఆర్ పలకరించిన మమతా బెనర్జీ, శరద్ పవర్, నితీష్ కుమార్ వంటి నేతలు లేదా వారి ప్రతినిధులు కూడా కేసీఆర్ ను పట్టించుకోలేదు. నిత్యం ఆయనను కలవడం కోసం జనం క్యూ కడుతున్నారని ఆయనకు చెందిన మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారంతా హైదరాబాద్ నుండి రప్పించిన వారే కావడం గమనార్హం. 

గతంలో కేసీఆర్ వెళితే కలిసి, బాతాఖానీ చేస్తుంటే జాతీయ మీడియా ప్రతినిధులు ఎవరు కూడా కేసీఆర్ ను పలకరించే ప్రయత్నం చేయలేదు. దానితో శనివారం వరకు ఢిల్లీలో ఉంటానని వెళ్లిన కేసీఆర్ శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.

జాతీయ స్థాయిలో నాయకత్వం పొందేందుకు ఆయన పార్టీ సహచరులు తగిన కసరత్తు చేయలేదా? కేసీఆర్ ను ప్రతిపక్షాలు అనుమానాస్పదంగా చూస్తున్నాయా? అనే ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి. ఇతర పార్టీల నేతలతో నిత్యం సంబంధాలు ఏర్పాటు చేసుకొంటూ, అవసరమైనప్పుడు తీసుకు రాగాల నాయకత్వం ఇప్పుడు కేసీఆర్ బృందంలో ఉన్నట్లు కనిపించడం లేదు. 
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెడితే కనిపించే హడావుడి కేసీఆర్ విషయంలో కనిపించడం లేదు. సొంత పార్టీలోనే ఢిల్లీలో మంచి సంబంధాలున్న కేశవరావు వంటి వారి ప్రాతినిధ్యం తగ్గించడం ఒక కారణం కాగా, కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలో పార్లమెంట్ లో హడావుడి చేసి, తెలంగాణ అంశాలపై అలా దృష్టి ఆకట్టుకొనే ప్రయత్నం ఆయన పార్టీ ఎంపీలు కూడా చేయక పోవడం మరో కారణంగా కనిపిస్తుంది. 
ఇదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత పేరు తెరపైకి రావడం సహితం ఇతర పార్టీలు దగ్గర కావడానికి విముఖతకు కారణంగా తెలుస్తున్నది. ఈ కుంభకోణంలో కవిత పేరు సిబిఐ, ఈడీ రిపోర్టులలో రావడానికి కేజ్రీవాల్, ఆయన పార్టీ ఆప్ తో కేసీఆర్ ఏర్పర్చుకున్న సాన్నిహిత్యమే కారణం అని  అందరికి తెలిసిందే. 
అయితే ఇప్పుడు కనీసం కేజ్రీవాల్ సహితం కేసీఆర్ కు సంఘీభావం తెలిపే ప్రయత్నం చేయక పోవడం గమనార్హం. కేసీఆర్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా కవిత పేరున్నట్లు వెలుగులోకి రావడం గమనార్హం. జాతీయ మీడియా సహితం కేసీఆర్ ను ఓ ప్రాంతీయ నాయకుడిగానే చూస్తున్నది. జాతీయ పార్టీ అంటూ బిఆర్ఎస్ స్థాపించిన దానికి నిర్దుష్టమైన విధానాలు, రాజకీయ వ్యూహాలు వ్యక్తం కాకపోవడంతో ఎవ్వరి దృష్టిని ఆకట్టుకోవడం లేదు. 
పైగా, తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండటం, పలు ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తుకు ప్రాధాన్యత ఇస్తూ ఉండటం, కాంగ్రెస్ లేని ప్రతిపక్ష కూటమి అర్ధం లేదని అంటూ బహిరంగంగానే ప్రకటనలు చేస్తూ ఉండడంతో కేసీఆర్ తో చేతులు కలపడానికి ఎవ్వరు సిద్ధంగా ఉన్నట్లు కనబడటం లేదు. 
ఇటువంటి పరిస్థితులలో `దేశ్ కా నేత కేసీఆర్’ అంటూ ఢిల్లీలో బోర్డులు పెట్టుకోవడం ఇతర ప్రతిపక్షాలలో చులకన కావడానికే దారితీస్తుంది. గతంలో ప్రగతి భవన్ కు పలుమార్లు ఆహ్వానించి, సమాలోచనలు జరిపిన ప్రముఖ రైతు నాయకులు రాకేశ్‌ తికాయత్‌ తదితరులు సహితం ఈ సారి ముఖం చాటేశారు.  
జాతీయ టీవీ చానళ్లు, మీడియా ఈ పరిణామం గురించి పట్టించుకోలేదు. కనీసం తెలుగు మీడియా సహితం అంతగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ  ప్రారంభోత్సవంకు హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లిన పలువురు పార్టీ నేతలు తిరిగి రావడానికి ఇబ్బంది పడ్డారు. ఒకేసారి విమానం టికెట్ ధరలు పెరిగి పోవడంతో, తగ్గేవరకూ అంటూ అక్కడే ఆగిపోయారు. ఒకొక్క టికెట్ ధర  రూ 35,000 నుండి రూ 45,000కు పెరగడంతో గుండెలు బాదుకున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles