ఆ విషయంలో ఏపీ కంటె మొనగాళ్లు లేరు!

Friday, May 17, 2024

మొదటి రెండో ర్యాంకులకు సాధారణంగా తేడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ మొదటి ర్యాంకు 100 మార్కులు అయితే రెండో ర్యాంకు 50 మార్కుల దగ్గరే ఆగిపోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.ఎంతో అసాధారణమైన ప్రతిభాపాటవాలు ఉంటే తప్ప.. ఈ స్థాయిలో టాప్ టూ ర్యాంకుల మధ్య వ్యత్యాసం ఉండడం అనేది అసాధ్యం. ఆ మొదటి ర్యాంకులో ఉన్నది మన రాష్ట్రమే! ఆహా.. ఫస్ట్ ర్యాంక్ మనదే కదా అని మురిసిపోయే సంగతి కాదు ఇది. కోర్టు ధిక్కరణ కేసుల్లో టాప్ గ్రేడ్ సాధించిన వ్యవహారం. 

దేశవ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో ఎక్కువ కోర్టు ధిక్కరణ కేసులు నమోదై ఉన్నాయో లెక్క తీస్తే.. కళ్లు తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. గతంలో ఈ రికార్డు బిహార్ పేరిట ఉండేది. దాన్నికాస్తా బద్దలు చేసేసి ఏపీ వెనక్కు నెట్టేసింది. దేశంలో కోర్టు ధిక్కార కేసులు ఎన్ని ఉన్నాయంటూ ఓ ఎంపీ అడిగితే.. మంత్రి పార్లమెంటులో చాలా విపులంగా జవాబిచ్చారు. దేశం మొత్తం 28469 కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయట. ఇందులో ఒక్క ఆంద్రప్రదేశ్ లోనే 11348 కేసులు పెండింగులో ఉన్నాయి. ఇదే ఫస్ట్ ర్యాంకు. తర్వాతి ర్యాంకు బీహార్ ది. అక్కడ ఎన్ని ధిక్కార కేసులున్నాయో తెలుసా.. కేవలం 6554! ఈ రెండు రాష్ట్రాలకు మధ్య ఇంచుమించు 5వేల కేసుల తేడా ఉంది. ఈ గణాంకాలు విన్నవారు.. ఆంద్రప్రదేశ్ లో మాత్రం ఇన్ని వేల సంఖ్యలో కోర్టు ధిక్కార కేసులు ఎలా నమోదు అవుతున్నాయి అని విస్తుపోతున్నారట. 

ఏపీలో పరిస్థితి ఇక్కడి ప్రజలకు చాలా బాగా తెలుసు. చట్టానికి, రాజ్యాంగ నిబంధనలకు లొంగకుండా.. ఏమీ పట్టించుకోకుండా.. విచ్చలవిడిగా యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం, వాటినేచట్టాలుగా మార్చేయడం.. ఆ తర్వాత కోర్టుకేసుల రూపేణా పెద్ద పెద్ద లాయర్లకు కోట్లరూపాయలు తగలేయడం.. చివరికి కోర్టులు అక్షింతలు వేసిన తర్వాత వెనక్కు తగ్గడం అనేది ఏపీలో చాలా సాధారణమైన వ్యవహారం. అనేక కేసుల్లోకోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం అభాసుపాలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. కేవలం కోర్టు తీర్పులను అమలు చేయకపోయినందుకు ఐఏఎస్ అధికార్లకు జైలుశిక్ష విధించిన సందర్భాలున్నాయి. వారు బతిమాలిన పిమ్మటి.. జైలు రద్దుచేసి హాస్టళ్లలో సంఘసేవ చేయాలని ఆదేశించిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ కూడా.. ఇంకా కోర్టు ధిక్కరణ కేసుల విషయంలో ఏపీ రాష్ట్రమే దేశంలో టాప్ రేంజ్ లో ఉండడం గమనార్హం.

రాష్ట్రంలో విచ్చలవిడితనానికి నిదర్శనం ఇది. న్యాయస్థానం పట్ల, తీర్పుల పట్ల గౌరవం లేకపోవడానికి ఇది తార్కాణం. న్యాయమూర్తుల మీద చాలా నీచమైన నిందలు వేసి.. వారిని బజారుకీడ్చిన వాళ్లు కూడా హాయిగా తిరుగుతూ ఉన్న రాష్ట్రం ఇది. న్యాయమూర్తులను పలుచన చేసి చీప్ విమర్శలుచేస్తూ.. నీచంగాప్రవర్తించే వారు.. వారి మీద కేసులు కోర్టు ఆదేశాలతో నమోదు అయినా.. వాటిని ముందుకు తీసుకువెళ్లకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించే యంత్రాంగాలు చెలరేగే ఈ రాష్ట్రంలో కోర్టు తీర్పులను ధిక్కరించడంలో పెద్ద విషయం ఏముంది అని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles