వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తిరుగుబాటు జరుపుతూ, ఢిల్లీ నుండే ఆ పార్టీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నరసరాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. జగన్ పై తిరుగుబాటు తర్వాత ఆయన బిజెపి వైపు మొగ్గుచూపారు. తన కాంట్రాక్టు వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీల దృష్ట్యా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరడం మంచిదని అనుకున్నారు.
అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వంకు కొండంత అండగా ఉండటం, ఆ ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలకు సిద్ధపడక పోవడంతో ఒకింత అసంతృప్తికి లోనైన్నట్లు తెలుస్తున్నది. జగన్ ను వచ్చే ఎన్నికలలో ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని మొదటగా ప్రతిపాదించింది ఆయనే, ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పల్లవిని అందుకున్నారు.
అయితే, అందుకు బీజేపీ నాయకత్వం నుండి ఎటువంటి సుముఖత వ్యక్తం కావడం లేదు. పైగా, తనను ఏపీ సిఐడి అరెస్ట్ చేసిన్నప్పుడు తనని చిత్రహింసలకు గురిచేసిన సంఘటనపై లోక్ సభలో తానిచ్చిన సభాహక్కుల తీర్మానంపై ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. అదే, కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారంటే ఆఘమేఘాల మీద సభాహక్కుల నోటీసుకు స్పందించి సమన్లు జారీ చేశారు.
గతంతో టీడీపీలో ఉన్న ఆయన 2014 ఎన్నికలకు ముందు నరసాపురం సీట్ ను బిజెపికి ఇస్తారని తెలిసే ఆ పార్టీలో చేరారు. అయితే ఆ సీటును తనకు కాకుండా మరో వ్యక్తికి ఇవ్వడంతో ఆ 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. కానీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే సంబంధాలు వికటించాయి.
గత శనివారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికిన వారిలో రామకృష్ణంరాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తాను టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారని తెలుస్తున్నది. అందుకు చంద్రబాబు సహితం సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.
టిడిపితో పొత్తుకు బిజెపి సుముఖత వ్యక్తం చేయడంపై సందిగ్ధత నెలకొనడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు కుదిరినా నరసాపురం సీటు ఆ పార్టీకి వదిలేది లేదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత మూడేళ్లుగా రామకృష్ణంరాజును ఏపీలో అడుగు పెట్టనీయకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్నది. ఒకవేళ అడుగు పెడితే ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసేందుకు సిద్దపడుతున్నది.
మరోవంక, పవన్ కళ్యాణ్ సహితం రామకృష్ణంరాజు అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అవసరమైతే తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా ఆయన సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. పలువురు బిజెపి అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలున్న రఘురామకృష్ణంరాజుకు టిడిపి అభ్యర్థిగా పోటీచేయమని వారు సహితం సూచించారని తెలుస్తున్నది.