టిడిపిలో వైసిపి కోవర్టులపై చంద్రబాబు అప్రమత్తం!

Wednesday, January 22, 2025

మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరుగనున్న ఆంధ్రప్రదేశ్ లో గెలుపు జీవన్మరణ సమస్యగా భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగా తన పార్టీలో అధికార పక్షంతో స్నేహంగా వ్యవహరిస్తున్న నాయకుల సంగతి తేల్చుకునే పనిలో పడ్డారని తెలుస్తున్నది.  వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని పదే పదే అనేక సందర్భాల్లో చెబుతున్న చంద్రబాబు పార్టీ పట్ల వారి అంకితభావం కూడా పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు.

అధికారం కోల్పోయిన తర్వాత నాలుగేళ్లుగా టిడిపిలో పెద్దగా క్రియాశీలకంగా లేకుండా, అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సాగించిన దమనకాండపై పోరాటాలు జరుపకుండా మీడియా సమావేశాలకు పరిమితమైన నేతల వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. అటువంటి నాయకులు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 

అయితే వారిపై నేతలతో వారికున్న సాన్నిహిత్యం ఎన్నికల అనంతరం పార్టీకి చేటు తెచ్చే అవకాశం లేకుండా ముందే జాగ్రత్త పడేందుకు సమాయత్తమవుతున్నారు.  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు గత కొన్ని నెలలుగా టిడిపి పలు కార్యక్రమాలు చేబడుతున్నది. ఈ కార్యక్రమాలలో కొందరు నేతలు ఆసక్తి చూపకుండా ఉండటాన్ని చంద్రబాబు నిశితంగా గమనిస్తున్నట్లు తెలుస్తున్నది.

ఎవ్వరు మీడియా సమావేశాలకు పరిమితం అవుతున్నారు? ఎవ్వరు ప్రజలలోకి వెడుతున్నారు? వంటి అంశాలపై క్షేత్రస్థాయి నుండి ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్నారు. సమీక్షా సమావేశాలలో ఈ విషయమై పలువురు నేతలను నిలదీస్తున్నారు కూడా. కేవలం టీడీపీ పట్ల ప్రజలలో గల ఆదరణ, అధికార పక్షం పట్ల గల వ్యతిరేకతను గురించి తెలుసుకోవడం కోసమే కాకుండా, టిడిపి నాయకుల పట్ల ప్రజలలో నెలకొన్న అభిప్రాయాలపై కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నా రు. 

కేవలం ఐటీడీపీ ఇస్తున్న సర్వేలపైననే ఆధార పడకుండా, క్షేత్రస్థాయిలో నాయకుల వ్యక్తిగత రాజకీయాలు, వైసీపీతో వారికి గల సాన్నిహిత్యం వంటి అంశాలపై విడిగా సర్వేలు చేయిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో జన్మభూమి కమిటీల్లో పనిచేసినవారితో క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తున్నది. 

ఐతే వారంతా స్థానిక టీడీపీ నేతలతో సాన్నిహిత్యం గలవారే కావడంతో వారిని ప్రలోభాలకు గురిచేసి, తమకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేటట్లు చేస్తున్నట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది. దానితో అప్రమత్తమైన చంద్రబాబు ఎవరికీ తెలియకుండా అత్యంత గోప్యంగా మరో సర్వే కూడా చేయిస్తున్నట్లు చెబుతున్నారు.  మొత్తంగా మూడు రకాలుగా వడపోత కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని తమ్ముళ్లు చెబుతున్నారు. ఈ మూడు సర్వేలు కాకుండా వివిధ బృందాలు, ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా వివిధ నియోజకవర్గాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఎవ్వరికీ వారుగా ఆరా తీస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles