టిఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీకి పొంగులేటి, జూపల్లి వ్యూహం!

Sunday, December 22, 2024

బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయినా ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబుబూనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కలిసి టిఆర్ఎస్ పేరుతో `తెలంగాణ సెంటిమెంట్’తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపుగా కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై గత కొద్దీ నెలలుగా సన్నాహాలు చేస్తున్నారని, ఆ విషయం తెలిసే వారిద్దరిపై సీఎం కేసీఆర్ సస్పెండ్ వేటు వేశారని చెబుతున్నారు.

టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా చేస్తూ బిఆర్ఎస్ గా పేరు మార్చడంతో, ఆ పాత పేరును ఉపయోగించుకొనే రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్నట్లు తెలిసింది. బిఆర్ఎస్ తో పాటు బిజెపి, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న అసంతృప్తి నేతలను సహితం కలుపుకొని కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కోదండరాం, వైఎస్ షర్మిల వంటి వారు కొత్త పార్టీతో కలసి పనిచేసేందుకు ముందుకు రావచ్చని అంచనా వేస్తున్నారు.

బిఆర్ఎస్ లో అసంతృప్తి నేతలను ఆకర్షించాలని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు గత ఏడాదికాలంగా ఎంతగా ప్రత్నిస్తున్నా ఆశించిన స్పందన లభించడం లేదు. వారి రాష్ట్ర నాయకత్వ ధోరణి పట్ల అవిశ్వాసమే అందుకు కారణం. పైగా కాంగ్రెస్ లో సీనియర్లతో పాటు బీజేపీలో ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన ప్రముఖులు అనేకమంది రెండు పార్టీల రాష్త్ర అధ్యక్షుల వ్యవహార శైలి పట్ల బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ లో కోమటిరెడ్డి సోదరులు వంటి వారిని ఆకర్షింప గలమని పొంగులేటి, జూపల్లి ధీమాగా ఉన్నారు. అదే విధంగా బీజేపీలో ఈటెల రాజేందర్ వంటి నేతలతో కూడా ఇప్పటికే ప్రాధమికంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణాలో బిజెపికి భవిష్యత్ లేదని పలువురు సీనియర్ నాయకులు లేరుగా అమిత్ షా, జెపి నడ్డాలను కలిసి స్పష్టం చేసి వచ్చారు.

గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో నియోజవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తన తరపున అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.

ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో ఆయనకు విభేదాలు ఉండగా పలు మార్లు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. గత ముడేళ్లుగా బీఆర్ఎస్ అధినాయకత్వం తనను పట్టించుకోవటం లేదని, పార్టీలో తన సభ్యత్వాన్ని కూడా రెన్యూవల్ చేయలేదని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన పొంగులేటి ఆత్మీయ సమావేశానికి జూపల్లి తన అనుచరులతో కలిసి హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వంపై ఇద్దరు నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇద్దరు నాయకులు ముఖ‌్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ వ్యతిరేక శక్తులన్ని ఏకం అవుతాయని ప్రకటించడంతో వేటు వేసిన్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణలో మాటలు చెప్పి మభ్యపెట్టి మూడోసారి మఖ్యమంత్రి కావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. రోజులు ఎప్పుడు కేసీఆర్‌కు అనుకూలంగా ఉండవని, ప్రతి ఒక్కరు ఏకమవుతారని, దానికి బీజం పడిందని హెచ్చరించారు. మూడో సారి అధికారంలోకి రావాలనే తపనతో కేసీఆర్‌ చేస్తున్నారని వాటిని అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. 

ఇక మాజీ మంత్రి జూపల్లి మాట్లాడుతూ అసంపూర్తి పథకాలు, నెరవేరని హామీలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. తిండి లేకపోయినా ఫర్వాలేదని, కానీ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోందన్న జూపల్లి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇన్ని రోజులకు తనకు బిఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందని పొంగులేటి సంతోషం ప్రకటించారు. బిఆర్ఎస్ నుంచి తనను ఇప్పటికైనా సస్పెండ్ చేయడం సంతోషకరమని అంటూ దొరల గడీ నుంచి తనకు విముక్తి లభించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. టిఆర్ఎస్సో.. బీఆర్ఎస్సో ఆ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉందని  జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తనను సస్పెండ్ చేయడంతో తనకు స్వేచ్ఛ లభించిందని పంజరం నుండి బయటకు వచ్చిన చిలకలా అనిపించిందని ఆయన చెప్పారు. అసలు ఇన్నాళ్లు తాను పార్టీలో ఉన్నట్టా లేనట్టా చెప్పాలని ప్రశ్నించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles