సుప్రీం’ విచారణతో బిల్లులపై దిగొచ్చిన గవర్నర్ తమిళసై 

Friday, May 3, 2024

కేసీఆర్ ప్రభుత్వం తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరిస్తున్నదని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ గత ఆరేడు, నెలలుగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా వ్యవహరిస్తున్నది. ఈ విషయమై విసుగుచెందిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

సోమవారం ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న సమయంలో తన వద్ద పెండింగ్ లో ఉన్న పది బిల్లులతో మూడు బిల్లులకు గవర్నర్ హడావుడిగా ఆమోదం తెలిపారు. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ఇక రెండు బిల్లులను తిరస్కరించి తిరిగి ప్రభుత్వంకు పంపారు. మిగిలిన మూడు బిల్లులు పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. మొత్తానికి ఈ చర్యతో సుప్రీంకోర్టులో కేసు విచారణ రెండు వారాలపాటు వాయిదా పడింది.

గత సెప్టెంబర్‌లో అసెంబ్లీ అమోదించిన 7 బిల్లులుతో పాటు బడ్జెట్‌ సమావేశంలో 3 బిల్లులను శాసనసభ అమోదించింది. వీటిని రకరకాల కారణాలతో గవర్నర్ పెండింగ్‌లో ఉంచారు. రెండు బిల్లులను తిరిగి పంపడం పట్ల కేసీఆర్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, మొత్తానికి రాజ్ భవన్ లో బిల్లులతో కదలిక ఏర్పడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నది.

2022 సెప్టెంబర్ 14 నుంచి 2023 ఫిబ్రవరి 13 మధ్యకాలంలో 10 బిల్లులను రాష్ట్ర ప‌భుత్వం అధికారిక ఆమోదం కోసం గవర్నర్ కు పంపారు. అయితే ఆ బిల్లుల‌పై గ‌వ‌ర్న‌ర్ ఎటువంటి నిర్ణ‌యం తీస‌కోక‌పోవ‌డంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిని చేర్చారు. గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

మొత్తం 10 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌ లో ఉన్నాయని పిటిషన్ లో పేర్కొంది. దీనిపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటర్ జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో కొన్నింటిని అమోదించి రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు.

గవర్నర్ తీరు మంత్రి మండలి సలహాకు వ్యతిరేకంగా ఉందని కేసీఆర్ సర్కారు చెబుతోంది. ఇటువంటి విచక్షణాధికారాలు గవర్నర్‌కు ఉండవని ప్రభుత్వం అంటోంది. రాష్ట్రానికి సంబంధించిన ఆయా బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడానికి న్యాయమైన కారణాలు ఏవీ లేవని తెలిపింది.

గవర్నర్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఏడు నెలలుగా ఆపి, సుప్రీంకోర్టులో కేసు వేస్తే మూడు బిల్లులు పాస్ చేశారని ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రగతిని ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలు గమనించాలని కోరుతూ ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని రాష్ట్రపతి పరిశీలనకు పంపడం రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా? అని ప్రశ్నించారు.

కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఉద్యోగాలు ఇస్తామంటే 7నెలలు ఆపి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపారని అంటూ తమ పిల్లలకు చదువులు చెప్పే ప్రొఫెసర్లు వద్దా? అని అడిగారు.  1961 నుంచే బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అన్ని వర్సిటీలకు కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఉందని పేర్కొంటూ గవర్నర్ చర్యలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని హరీష్ రావు మండిపడ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles