రోడ్లపై రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలకు పోలీసుల నుంచి అనుమతి తప్పనిసరి చేస్తూ ఇటీవల జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై ఏపీలో దుమారం చెలరేగుతోంది. దీనిని `చీకటి జిఓ’గా పేర్కొంటూ, ప్రత్యర్థి పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు పెట్టుకోకుండా చేసే కుట్రలో భాగంగానే జీవో తెచ్చారనే విమర్శలు ప్రతిపక్ష, విపక్ష పార్టీల నుంచి వినిపిస్తోన్నాయి. ఈ జోవోను ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించాయి.
ఇప్పటికే దీని అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఏదో ఒక ప్రతిపక్షం అభ్యర్థిగా లేదా స్వతంత్ర అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న మాజీ సిబిఐ అధికారి జెడి లక్ష్మీనారాయణ ఈ జిఓను సమర్ధిస్తూ ప్రకటన ఇవ్వడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 సరైనదే అని, రోడ్ల మీద సభలు, రోడ్‌షోలు నిర్వహించే సందర్భాల్లో అనువైన స్థలాలను అంచనా వేసేందుకు పోలీసుల అనుమతిని తప్పనిసరి అన్నది మంది నిర్ణయం అని చెప్పడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలలో చైతన్యం తీసుకురావడం కోసం రాజకీయాలలోకి వచ్చానని చెపుతున్న ఆయన నిరంకుశ అధికారాలు చెలాయించే ఓ ఐపీఎస్ అధికారిగానే మాట్లాడారని విమర్శలు చెలరేగుతున్నాయి. తనకు తగు రాజకీయ వేదిక కల్పించడం కోసం ప్రధాన రాజకీయ పక్షాలు ఏవీ ఆసక్తి చూపకపోవడం, సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే సామర్ధ్యం లేకపోవడంతో నెలకొన్న నైరాశ్యం ఫలితంగా ఇటువంటి ప్రకటన చేశారనే అభిప్రాయం కూడా వినవస్తుంది.
కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని అక్రమార్జనలకు పాల్పడ్డారని నేరారోపణ చేస్తూ కేసు నమోదు చేయడమే కాకుండా, జగన్ ను అరెస్ట్ కూడా చేసి, 16 నెలలు జైలులో గడిపేటట్లు చేయగలిగారనే లక్ష్మీనారాయణ రెండు తెలుగు రాష్ట్రాలలో విశేషంగా తన ఇమేజ్ ను పెంచుకున్నారు. ఆ ఇమేజ్ ను ఉపయోగించుకొని రాజకీయంగా రాణించాలని ఐపీఎస్ కి రాజీనామా చేసి, వచ్చారు.
మొదటగా, బీజేపీలో చేరి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయాలి అనుకున్నారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర బిజెపి నేతలను, ఆర్ఎస్ఎస్ ప్రముఖులను అనేకసార్లు కలిశారు. అనేకమందితో మంతనాలు జరిపారు. అయితే వారు నుండి సానుకూల స్పందన లభించకపోవడంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడును కూడా కలిశారు. ఆయన నుండి కూడా పార్టీలో చేరమని ఆహ్వానం లభించలేదు.
దానితో చివరి క్షణాలలో 2019 ఎన్నికల ముందు జనసేనలో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా విశాఖపట్నం నుండి పోటీ చేశారు. అయితే ఆ పార్టీ ఎన్నికలలో ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ఆ పార్టీలో ఉంటె తనకు రాజకీయ భవిష్యత్ ఉండదనే ఉద్దేశ్యంతో ఎన్నికలు కాగానే ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ తర్వాత తిరిగి బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. మరోవంక టిడిపి నేతలకు రాయబారాలు పంపుతున్నా సానుకూలత లభించడం లేదు.
ఈ లోగా వచ్చే ఎన్నికలలో లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఏ పార్టీ ద్వారానో త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామన్నారు. చూస్తుంటే స్వతంత్రంగా పోటీచేసే సాహసం చేయలేకపోతున్నట్లు అనిపిస్తున్నది. జగన్ పాలన పట్ల సానుకూలంగా మాట్లాడి బిజెపి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నారా? ఖంగారుతో టీడీపీ వారు దగ్గరకు చేర్చుకొంటారని భావిస్తున్నారా? ఏదేమైనా ఇన్నిరోజులుగా ఏర్పర్చుకొంటున్న `ఇమేజ్’కు భంగం కలిగించే రీతిలో ఆయన వాఖ్యలు ఉన్నాయని మాత్రం స్పష్టం అవుతున్నది.