ప్రకంపనలు సృష్టిస్తున్న పెద్దిరెడ్డికి చంద్రబాబు హెచ్చరిక!

Friday, March 29, 2024

సంక్రాంత్రికి కుటుంభం సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడానికి సొంతఊరు వెళ్లిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వైఎస్ జగన్ మంత్రివర్గంలో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తీవ్ర పదజాలంతో హెచ్చరిక జారీచేయడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. వైసిపి వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

“వచ్చే పండగకు ఎక్కడ ఉంటావో చూసుకో..అన్ని లెక్కలు రాస్తున్న…. ఈసారి క్షమించే ప్రసక్తి లేదు” అని తీవ్ర పదజాలంతో హెచ్చరించడం  కలకలం రేపుతున్నది. రాజకీయ ప్రత్యర్థులను బహుశా మొదటిసారిగా ఇంతటి తీవ్ర పదజాలంతో చంద్రబాబు హెచ్చ్చరించడం గమనార్హం. ఒక విధంగా సీఎం జగన్ ను సహితం `బ్లాక్ మెయిల్’ చేస్తున్న మంత్రిగా పేరుంది.

‘‘పండగపూట మా కార్యకర్తలను జైల్లో పెట్టావ్.. భవిష్యత్‌లో నువ్వు ఎక్కడ ఉంటావో ఊహించుకో.. ఈ భూమిపై ఎక్కడున్నా తీసుకొస్తా.. వదలను.. ఇంతవరకు నా సున్నితత్వం చూశారు, ఇకపై కఠినాన్ని చూస్తారు.. వడ్డీతో సహా అంతా తీర్చుకుంటాం’’ అని చంద్రబాబు హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో ఇంత అరాచకాలను ఎప్పుడూ చూడలేదని పేర్కొంటూ పోలీసులను ఉపయోగించుకుని నేరాలు చేస్తున్నారని మండిపడ్డారు.

బహుశా చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఓ రాజకీయ నాయకుడిని, అదీ మంత్రి స్థాయిలో ఉన్న నాయకుడిని నేరుగా ఈ విధంగా హెచ్చరించిన సందర్భాలు ఉండకపోవచ్చు. అందుకనే ఇవి ఆషామాషీగా చేసిన హెచ్చరికలు కావని, రానున్న పరిణామాలను సూచిస్తున్నాయని టిడిపి శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
కేవలం రామచంద్రారెడ్డి వద్దంటున్నారనే తనకు వ్యక్తిగతంగా తన తండ్రి కాలం నుండి సన్నిహితులైన తిరుపతి, చంద్రగిరి ఎమ్యెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలకు మంత్రి పదవులు గాని, ఇతర కీలక పదవులు గాని ఇవ్వలేక వాపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పర్యాటక శాఖ మంత్రి రోజా ఉన్నప్పటికీ జిల్లా అధికారులు ఎవ్వరు వారిని లెక్క చేయరు.

రామచంద్రారెడ్డి సోదరులు ఎమ్యెల్యే, కుమారుడు ఎంపీ. జగన్ కుటుంభంలో సహితం అంతమందికి పదవులు లేవు. పుష్కలమైన ఆర్థిక వనరులతో ఎమ్యెల్యేలను సమీకరిస్తూ, అవసరమైనప్పుడు తిరుగుబాటు చేయగల సామర్ధ్యం ఉన్నవారినే రామచంద్రారెడ్డి అంటే జగన్ ఓ విధంగా జంకుతున్నారని పలువురు భావిస్తున్నారు.

విద్యార్థి రోజులనుండి చంద్రబాబునాయుడు, రామచంద్రారెడ్డి ప్రత్యర్థి వర్గాలకు నేతృత్వం వహిస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో ఇద్దరు రెండు ప్రధాన సామజిక వర్గాల నేతలుగా అప్పట్లో పేరొందారు. ఆ విరోధం రాజకీయాలలో కూడా కొనసాగుతూ వస్తున్నది. మొదటి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యర్థిగా పేరొందిన, జగన్ దగ్గర చేరి, రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలోని 2009లో స్థానం పొందారు.

రామచంద్రారెడ్డికి సంబంధించిన అక్రమ ఆర్హ్దిక మూలాల గురించిన సమాచారం ఉండడంతోనే చంద్రబాబు అంత కఠినంగా మాట్లాడి ఉండవచ్చని రాజకీయ వర్గాలలో భావిస్తున్నారు .ముఖ్యంగా శేషాచలం అడవులలో జగన్ పాలనలో రూ 40,000 కోట్లకు పైగా విలువైన గంధపు చెక్కలు అక్రమ రవాణాకు గురైనట్లు అంచనా వేస్తున్నారు. ఇక గనుల అక్రమ తవ్వకాలు, భూ అక్రమణలు వంటి అనేక ఆరోపణలను వైసీపీ నేతలు ఎదుర్కొంటున్నారు.

మరోవంక, కుప్పంలో చంద్రబాబును ఓడించే పనిని రామచంద్రారెడ్డికె జగన్ అప్పచెప్పారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో అడుగడుగునా పోలీసులతో అడ్డంకులు కల్పించడంతో పాటు పుంగనూరులో పది రోజుల్లో వందమంది టిడిపి వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడంతో చంద్రబాబు ఆగ్రహం అవధులు లేకుండా ఈ హెచ్చరికలతో వెల్లడైనట్లు అర్ధం అవుతుంది.

చంద్రబాబు హెచ్చరికలకు రామచంద్రారెడ్డి స్పందనలో అంతగా దూకుడుతనం కనిపించక పోవడం గమనార్హం. వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ లో రాజకీయాలు నడిపినా బహుశా రామచంద్రారెడ్డి రాజకీయ జీవితంలో ఇంత తీవ్రంగా ఎవ్వరి నుండి హెచ్చరికలు అందుకొని ఉండకపోవచ్చు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles