అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీ.. పరిపాలన ఐదేళ్లు పూర్తవుతున్న ప్రస్తుత సమయానికి కూడా ఆచరణ రూపం దాల్చకపోవడం జగన్ ప్రభుత్వానికి పెద్ద గండంగా మారుతోంది. పాత పెన్షన్ విధానాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ తిరిగి పునరుద్ధరించే ఆర్థిక వెసులుబాటులేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, ఉద్యోగులను మాయ చేయడానికి తాను ప్రతిపాదించిన జిపిఎస్ అనే గ్యారంటీ పెన్షన్ స్కీము ను ఒప్పుకోవాల్సిందిగా ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నారు. తమాషా ఏమిటంటే జిపిఎస్ విధానం లో ఎలాంటి అంశాలు విధివిధానాలు ఉంటాయో ఇప్పటికీ ఉద్యోగులకు స్పష్టంగా చెప్పడం లేదు. జిపిఎస్ బిల్లు ముసాయిదా ప్రతిని కనీసం ఉద్యోగ సంఘాల నాయకులకు చూపించడం కూడా లేదు. అందులోని అంశాలు ఏమిటో చెప్పకుండానే వారిని చర్చలకు పిలవడం, దానికి అంగీకారం తెలపాల్సిందిగా ఒత్తిడి చేయడం జరుగుతోంది. ఇలాంటి మాయలో పడకుండా ఉద్యోగ సంఘాల వారు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. మడమ తిప్పకుండా పోరుబాటలోకి వెళ్లడానికి ఉద్ద్యుక్తులవుతున్నారు.
సిపిఎస్ రద్దు అనే హామీ జగన్ ప్రభుత్వం మెడకు గుదిబండలాగా తయారవుతోంది. జిపిఎస్ అనేదానిని ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు. ఏయే ఉద్యోగ సంఘాల నాయకులైతే జిపిఎస్ విధానానికి ఆమోదం తెలియజేశారో వాళ్ళందరూ ఉద్యోగుల వర్గానికి ద్రోహులుగా ముద్రపడ్డారు. సిపిఎస్ రద్దు కోరుతున్న సంఘాల వాళ్ళందరూ, అంగీకరించిన తమ ప్రతినిధులను తూర్పారబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రుల బృందం ఉద్యోగ సంఘాలతో జరుపుతున్న చర్చలు ఎక్కడికక్కడ పీట ముడిలా బిగుసుకుంటున్నాయే తప్ప ఫలితం ఇవ్వడం లేదు.
ఉద్యోగులు తమ వాటాగా చెల్లించే మొత్తంతో పాటు ప్రభుత్వం వాటాగా చెల్లించే మొత్తాలను కూడా కలిపి వారు రిటైర్ అయ్యే నాటికి జమ అయ్యే యావత్తు సొమ్మును ప్రభుత్వానికి దఖలు పెడితేనే వారికి ఎంతో కొంత గ్యారంటీడ్ పింఛను దక్కేలాగా ఈ విధానం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే గనుక ఉద్యోగ వర్గాలు దారుణంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగుల సొమ్మునే ప్రభుత్వం తమ వద్ద ఉంచుకుని వారికి నామమాత్ర పెన్షన్ చెల్లిస్తూ పోయే వాతావరణం ఏర్పడుతుంది. పదవీ విరమణ చెందే నాటికి సదరు ఉద్యోగి వద్ద ఒక్క రూపాయి కూడా లేకుండా కేవలం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీదనే ఆధారపడి జీవించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి ఘోరమైన నిబంధనలను తయారుచేసి వాటిని ఒప్పుకోవాల్సిందిగా ఉద్యోగుల వద్దకు ఈ ప్రభుత్వం ఎలా వెళ్ళగలుగుతున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు. సిపిఎస్ ద్వారా నష్టపోతున్నామని భావిస్తున్న ఉద్యోగులు నిబంధనలకు ఒప్పుకుంటారని ఎలా అనుకున్నారో కూడా అర్థం కావడం లేదు. ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకులను ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందాలతో లోబరుచుకున్నంత మాత్రాన తాము తగ్గేది లేదని, పోరుబాట వీడమని సిపిఎస్ ఉద్యోగులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలలోగా సిపిఎస్, ఓపిఎస్, జిపిఎస్ అనే గొడవ సద్దుమణుగుతుందని.. దాని ద్వారా ఏర్పడగల ప్రజా వ్యతిరేకత నుంచి జగన్ ప్రభుత్వం తప్పించుకుంటుందని అనుకోవడం భ్రమ. జగన్ సర్కారు వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ఆ పార్టీ నాయకులే కోరుకుంటున్నారు.