కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఏపీలోని బిజెపి నేతల దిమ్మతిరిగిన్నట్లయింది. దక్షిణాదిన తమకు ఇక దిక్కు లేదని గ్రహించినట్లున్నారు. ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి బిజెపి కొమ్ము కాయడం పట్ల కర్ణాటకలోని తెలుగు ఓటర్లను ఆగ్రహంతో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన్నట్లు తెలుసుకొని తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే తమకు ఏపీలోనే కాకుండా దేశంలోనే పుట్టగతులు లేని పరిస్థితులు ఏర్పడతాయని భయం ఏర్పడినట్లున్నది. అందుకే మొన్నటి వరకు టిడిపితో పొత్తు అంటేనే అంతెత్తున ఎగిరి `కుటుంభ పార్టీలతో పొత్తు ఉండదు’ అంటూ ఘంటాపధంగా చెప్పే జివిఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, సునీల్ దేవధర్ వంటి బిజెపి నేతలు ఇప్పుడు మూగనోము పట్టిన్నట్లున్నది.
తమ మిత్రపక్షం నేత పవన్ కళ్యాణ్ ను సహితం టిడిపితో పొత్తు పెట్టుకొంటూ జాగ్రత్త అన్నట్లు వ్యవహరిస్తున్న బిజెపి నేతలు ఇప్పుడు `ఆ విషయం పార్టీ అధిష్టానం చూసుకొంటుంది’ అంటూ మాటదాట వేస్తున్నారు. మొదటిసారిగా, టిడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదనను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకొచ్చారని, ఆయన ప్రతిపాదనను బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్ళమని అంటూ జివిఎల్ నరసింహారావు బహిరంగంగా ఒప్పుకున్నారు.
మొన్నటి వరకు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమయ్యారని అడిగితే `వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకేమి తెలుసు?’ అంటూ సోము వీర్రాజు కస్సుమంటూ వచ్చారు. ఇప్పుడేమో టీడీపీతో పొత్తు విషయంపై కేంద్ర నాయకత్వానిదే అంతిమ నిర్ణయమని చెబుతూ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని జివిఎల్ కాళ్లబేరానికి వచ్చిన్నట్లు మాట్లాడారు.
ప్రస్తుతం జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని, టీడీపీని కూడా కలుపుకోవాలని కేంద్ర నాయకత్వానికి పవన్ సూచించినట్లు జీవీఎల్ స్పష్టం చేశారు. పవన్ ప్రతిపాదనను బిజెపి అగ్ర నేతలు పరిశీలిస్తున్నట్లు జివిఎల్ చెప్పడం గమనార్హం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ప్రతిపాదన చేశారని, ఆ విషయాన్ని అగ్ర నాయకత్వానికి తెలియజేశామని అంటూ మొదటిసారి టిడిపితో పొత్తు గురించి సానుకూలంగా సంకేతం ఇచ్చారు.
పొత్తులపై కేంద్ర అధినాయకత్వం తీసుకునే నిర్ణయాన్ని తాము తప్పకుండా పాటిస్తామని జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం జాతీయ స్థాయిలో 2024లో బిజెపి ప్రయాణంపై పడే అవకాశం ఉండడంతో టిడిపి వంటి కొత్త మిత్రులను ఎంచుకోక అనివార్య పరిస్థితులు ఎదురుకాగలవనే ఆలోచన బిజెపి నేతలలో మొదలైనట్లు జివిఎల్ మాటలే స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వంకు `రక్షక కవచం’ మాదిరిగా వ్యవహరించిన బిజెపి నేతలే మునిగిపోయే ఆ నావలో కొనసాగితే తాము కూడా మునిగిపోతామనే భయంకు ఇప్పుడు గురవుతున్నట్లు జివిఎల్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
కర్ణాటక ఎన్నికలకు సంబంధించి, బీజేపీ అధికారంలోకి రాకపోయినా ప్రజాదరణ తగ్గలేదని అంటూ మేకపోతు గాంభీర్యాన్ని జివిఎల్ ప్రదర్శించారు. గత ఎన్నికల్లో తమకు వచ్చిన 36 శాతం ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో కూడా వచ్చిందని, దానిని చూస్తే తమను ప్రజలు తిరస్కరించలేదని అర్ధమవుతుందని చెప్పుకొచ్చారు. స్థానిక సమస్యలు, రాజకీయ పరిస్థితుల ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెబుతూ కర్ణాటక ఫలితాల ప్రభావం రెండు తెలుగు రాస్త్రాలలో బిజెపిపై ఉండవని సంకేతం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు.