వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓ లెక్క పక్క లేకుండా సలహాదారులను నియమించుకున్నారు. వైసీపీలో సేవలు అందిస్తున్నవారిని, జగన్ కుటుంబం మీడియా సాక్షి కీలక పదవులలో ఉన్నవారిని సలహాదారులుగా, వివిధ అధికార పదవులలో నియమించి, వారికి భారీగా జీత, భత్యాలు చెల్లిస్తూ పనులు మాత్రం పార్టీలో, సాక్షిలో చేయించుకుంటున్నారు.
సలహాదారులుగా నియమించేందుకు నిర్దిష్ట విధానం, ప్రక్రియ లేకుండా అడ్డదిడ్డంగా నియమించడంతో ఇప్పుడు అసలు ఎంత మంది పనిచేస్తున్నారు? వారి వివరాలు ఏమిటి? వారేంపని పని చేస్తున్నారు? అని రాష్ట్ర హైకోర్టు అడిగేసరికి ప్రభుత్వం ఉలిక్కిపడింది. హైకోర్టుకు సమాధానం ఇవ్వడం కోసం ఇప్పుడు తీరుబడిగా సలహాదారుల వివరాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుల నియామకంపై హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్ నియామకాలపైనా దాఖలైన వేర్వేరు పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా వాదనలు విన్న ధర్మాసనం.. ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? అని ప్రశ్నించింది. సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని వ్యాఖ్యానించింది. దీనిపై మళ్లీ విచారణ జరగనుంది
దానితో రాష్ట్రంలో ఎందరు సలహాదారులు ఉన్నారని ప్రభుత్వం వివరాలు సేకరించడం ప్రారంభించింది. శాఖల వారీగా సలహాదారుల వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. సలహాదారుల వివరాలు వెంటనే పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు అందాయి.
సలహాదారుల పేర్లు, హోదా, ఎప్పట్నుంచి ఉన్నారనే వివరాలు పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. హైకోర్టుకు సమర్పించేందుకు సలహాదారుల ప్రభుత్వం సమాచారం కోరినట్టు తెలుస్తోంది. దీంతో శాఖ వారీగా అధికారులు వివరాలు సిద్ధం చేస్తున్నారు. అయితే వారిమేమి సలహాలు ఇస్తున్నారో, అధికారికంగా ఎటువంటి విధులు నిర్వహిస్తున్నారో హైకోర్టు వివరాలు అడిగితే మాత్రం ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.