దెందులూరు శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన చింతమనేని ప్రభాకర్ 2019 ఎన్నికల్లో 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. నియోజకవర్గ ప్రజలలో మాస్ లీడర్‌గా చాలా పేరున్న చింతమనేనికి ఈ ఓటమి చిన్నదేమీ కాదు. అయితే 2024 లో జరగబోయే ఎన్నికలలో చింతమనేని విజయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పూచీ తీసుకుంటున్నారా? ఆయనను గెలిపించడానికి కంకణం కట్టుకోబోతున్నారా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు, పార్టీ పుట్టి ముంచేలా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా కొటారు అబ్బయ్య చౌదరి గెలుపొందారు. అయితే ఆయన ఎన్నికైన నాటి నుంచి తన కోటరీకి చెందిన నాయకులకు మాత్రమే పనులు చేసి పెడుతున్నారని, పార్టీలోని అందరినీ కలుపుకుపోవడం లేదనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే స్థానికంగా ఉండాలని సంగతి మరిచిపోయి విదేశాలలో ఉంటూ తన మనుషుల ద్వారా ఇక్కడ అధికారం చెలాయిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే బజారున పడి ఆరోపిస్తున్నారు.
ఆ పార్టీకి చెందిన జిల్లా అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే వలన సీనియర్ నాయకులు ఎవరూ పార్టీలో కొనసాగే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో అబ్బయ్య చౌదరి 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని కూడా ఆయన జోస్యం చెప్పారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కోడిపందాలు, జూదశిబిరాలు, మట్టి, ఇసుక మాఫియాలన్నీ ఎమ్మెల్యే కోటరీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని ఆరోపించారు.
ఈ నరసింహమూర్తి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు- పనిలో పనిగా పార్టీ అధినాయకత్వానికి కూడా చురకలంటించడం విశేషం. పార్టీ పెద్దల దృష్టికి ఎమ్మెల్యే అవినీతి గురించి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని ఆయన అంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికే మళ్లీ అభ్యర్థిత్వం దక్కితే గనుక తామే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఓడిస్తామని సొంత పార్టీ నాయకుడే అంటుండడం గమనార్హం.
వైసీపీలోని ఈ లుకలుకలు చింతమనేని ప్రభాకర్ విజయానికి రెడ్ కార్పెట్ పరిచే లాగా కనిపిస్తున్నాయి. దెందులూరు లో మహా తగాదాల వ్యవహారం ఇప్పుడు బయటపడింది గానీ.. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చికాకుల్ని ఎదుర్కొంటూ ఉన్నదనే మాట నిజం. అసంతృప్తులను బుజ్జగించి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఏరకంగా ఎన్నికలకు సిద్ధం చేస్తారో వేచి చూడాలి.