ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏనాడూ ఎన్డీయేలో భాగస్వామి కాదు. అవినీతి వ్యతిరేక నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మొదటి నుంచి అవినీతి కేసులలో జైలుకు వెళ్లి, బెయిల్ పై బైటకు వచ్చిన జగన్ పట్ల పుత్రవాత్సల్యం చూపిస్తున్నారు. ఆ మాటను స్వయంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ అనంతపూర్ జిల్లా పర్యటన సందర్భంగా ఒకసారి వెల్లడించారు.
2014 ఎన్నికలలో ఎన్డీయే భాగస్వామిగానే కాకుండా, కేంద్రంలో – రాష్ట్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పట్ల మొదటి నుండి `సవతి తల్లి’ ప్రేమను మాత్రమే చూపుతున్నారు. ఎన్డీయేలో బిజెపి భాగస్వామిగా ఉన్నప్పుడు కూడా ఏపీ ప్రయోజనాలకోసం ప్రధానిగా మోదీ ఎటువంటి సహకారం అందించలేదు. అయితే, వైఎస్ జగన్ కు మాత్రం ఎప్పుడు అవసరమైనా అండదండలు అందిస్తున్నారు.
తాజాగా, వైఎస్ జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని బాబాయి హత్యకేసులో కీలక అనుమానితుడిగా అరెస్ట్ చేసేందుకు కర్నూల్ వచ్చిన సిబిఐ బృందం నిస్తేజంగా వ్యవహరింపవలసి రావడం గమనార్హం. ఎనిమిది గంటలపాటు దాదాపు ప్రాధేయపడినా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సహకారం అందించడానికి నిరాకరించారు.
గతంలో `బలహీనుడు’గా పేరొందిన ప్రధాని డా. మన్మోహన్ సింగ్ హయాంలో సీబీఐ కేంద్ర మంత్రులు, అధికార కూటమికి చెందిన ఎంపిలను సహితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అరెస్ట్ చేసి, జైలుకు పంపగలిగింది. కానీ ఇప్పుడు ఎంతో బలవంతుడైన ప్రధాని ఉన్నారని ప్రచారం చేసుకొంటున్న సమయంలో రేజర్లపై లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎంపీపై సుప్రీం కోర్టు ఆదేశిస్తే గాని ఢిల్లీ పొలిసు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం గతం రెండు నెలలుగా సిబిఐ ప్రయత్నం చేస్తుంటే ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు అభ్యంతరం లేదని స్పష్టం చేసినా రాజకీయ వత్తిడుల కారణంగా ముందడుడగు వేయలేక పోతున్నది. ఇదంతా వైఎస్ జగన్ పట్ల ప్రధాని చూపుతున్న `పుత్రవాత్సల్యం’ ఫలితంగానేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
అంతేకాదు, తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న జగన్ ప్రభుత్వాన్ని ఆదుకొనేందుకు దేశంలో చివరకు బిజెపి ప్రభుత్వాల పట్ల కూడా చూపని ఔదార్యాన్ని కేంద్రం ఏపీ పట్ల చూపుతున్నది. ఉదారంగా రుణాలు తీసుకొనేందుకు అనుమతులు ఇస్తున్నది. ఆర్థికంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నా, కేంద్ర మంత్రులు పార్లమెంట్ వేదికగా పేర్కొంటున్నా జగన్ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం మాత్రం చేయడం లేదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 32 వేల కోట్లకు పైగా రుణాలకు ఏపీకి కేంద్రం అనుమతి ఇప్పటికే అనుమతిచ్చింది. ఇప్పుడు తాజాగా ప్రత్యేక ఆర్దిక సాయం కింద రూ 10,467.87 కోట్లు మంజూరు చేసింది. ఇదే నిధుల కోసం నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న సమయంలో పట్టించుకోని కేంద్రం ఇప్పుడు సీఎం జగన్ అభ్యర్ధనతో విడుదల చేయడం గమనార్హం.
విభజన చట్టం ప్రకారం 2014- 15 ఆర్దిక సంవత్సరం నాటి రెవిన్యూ లోటు కింద రూ 10,460.87 కోట్లు ఇప్పుడు విడుదల చేస్తున్నారు. 2014-15 సంవత్సరానికి ఏపీ రెవిన్యూ లోటు భర్తీపై విభజన సమయంలో నాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు చెల్లించాల్సిన రెవిన్యూ లోటు రూ 16,078 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం తేల్చింది.
ఐతే, అందులో భాగంగా కేంద్రం 2014-15 నుంచి 2016-17 వరకు విడతల వారీగా మొత్తంగా రూ 3,979.50 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఆ తరువాత మిగిలిన మొత్తం విడుదల కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించినా, కాగ్ లెక్కలను సమర్పించినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. స్వయంగా ప్రధానిని కలిసినా ప్రయోజనం లేకపోయింది.
ఇప్పుడు జగన్ అడగగానే ఆ మొత్తాన్ని ఒకేసారి కేంద్రం విడుదల చేస్తున్నది. అంత పెద్ద మొత్తాన్ని గతంలో ఎప్పుడూ కేంద్రం ఒకేసారి ఏపీకి విడుదల చేసిన దాఖలాలు లేవు.