రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎత్తుగడలను మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటివరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను కలిపి టార్గెట్ చేస్తూ వచ్చారు. అధికార పక్షాలు సాధారణంగా ప్రధాన ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటాయి. ఇప్పటివరకు వైసిపి నేతలు అదేవిధంగా చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ `వారాహి విజయ యాత్ర’ ద్వారా ప్రజల మధ్యకు వెళ్లి, వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండడంతో జగన్ నుండి వైసీపీ మంత్రులు, నేతలు మూకుమ్మడిగా ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టి ఒంటరిగా పోటీ చేసినట్లు చేయడమో లేదా సీట్ల సర్దుబాట్లలో గొంతెమ్మ కోర్కెలు కోరు పొత్తు లేకుండా జరిగేటట్లు చేయడమో లక్ష్యంగా కనిపిస్తుంది. మరోవంక, టిడిపిని పట్టించుకోకుండా, విమర్శల ధాటిని తగ్గించడం ద్వారా ఆ పార్టీకి ప్రచారాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
టిడిపిపై ఎక్కువగా విమర్శలు గుప్పిస్తే ఆ పార్టీ నేతలు సహితం అంతే ధీటుగా ఎదురు దాడులు చేస్తుంటారని, దానితో జనం నోటిలో ఆ ఆపార్టీ వారు తేలుతూ ఉంటారని గ్రహించారు. పైగా, పవన్ కళ్యాణ్ పై ఎన్ని విమర్శలు చేస్తున్నా టీడీపీ వారెవ్వరూ పట్టించుకోవడం లేదు. జనసేన వైపు నుండి కూడా పవన్ కళ్యాణ్ కాకుండా ఒకరిద్దరు తప్పా ఎవ్వరూ స్పందించడం లేదు.
టిడిపి, జనసేన పార్టీలు వేర్వేరుగా పోటీ చేయాలంటూ సవాల్ చేస్తూ టీడీపీకి సన్నిహితంగా ఉండటంతో పవన్ కళ్యాణ్ ని ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అయితే, పవన్ సహితం జగన్ కుటుంబంపై వక్తిగత విమర్శలు తానూ చేయగలనని, తాను నోరు విప్పితే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తికమక పడతారని హెచ్చరించడంతో కొంత ఖంగారు పడినట్లు కనిపిస్తుంది.
ముఖ్యంగా పవన్ పెళ్లిళ్ల వ్యవహారంపై జగన్ విమర్శలు గుప్పించగా, దీనికి జనసైనికులు కూడా అంతే ధీటుగా మీ తాతకు ఎన్ని పెళ్లిళ్లో చెప్పాలని డిమాండ్ చేయడంతో ఖంగుతిన్నట్లైంది. ఏదేమైనా పవన్ ను ఫోకస్ గా పెట్టుకొని టిడిపి ఓట్లు కొన్ని చీలే విధంగా చేయడమే లక్ష్యంగా కనిపిస్తున్నది.
పవన్ కళ్యాణ్‌న్ని విమర్శించడం వల్ల కాపు ఓట్లు దూరమైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన ఓట్లన్ని తమ పార్టీకి అండగా ఉంటాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. కాపు ఓట్లపై ఎక్కువ కాలం నమ్మకం పెట్టుకోలేమని, బీసీలతో సరైన నాయకత్వం లేదు కాబట్టి ఇప్పట్లో వారి ఓట్లు చీలిపోయో అవకాశం ఉండదనేది జగన్ భావనగా కనిపిస్తోందని చెబుతున్నారు. అందుకనే పార్టీలో కాపు నాయకులకు సైతం ప్రాధాన్యత తగ్గిపోతోందనే ప్రచారం కూడా వినిపిస్తోంది.