గోదావరి జిల్లాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి

Monday, January 20, 2025

రాష్ట్రంలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కీలకం కానున్న ఉభయ గోదావరి జిల్లాల్లో వైసిపి గ్రాఫ్ పడిపోతూ ఉండటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు జిల్లాలో ఏ పార్టీ అయితే అత్యధికంగా సీట్లు గెల్చుకొంటుండే ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలాకాలంగా ఆనవాయితీగా వస్తోంది.

గత ఎన్నికలలో జనసేన అభ్యర్థులు కేవలం ఒకే సీట్ గెలుపొందిన భారీగా ఓట్లు సంపాదించుకోవడంతో ఆ మేరకు తెలుగు దేశం అభ్యర్థులు దెబ్బతిన్నారు. దానితో వైసిపి ప్రభంజనం సాధ్యమైంది. అయినా అప్పటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడు పర్యటనలకు వచ్చినా అనూహ్యంగా జనాస్పదన కనిపిస్తున్నది.

పైగా, వచ్చే ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేసే అవకాశం ఉండడం, వైసీపీకి ఒక సీట్ కూడా దక్కకుండా చేయాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా తిరుగుతూ ఉండడంతో సహజంగానే సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. టిడిపి, జనసేన ఎత్తుగడలను తిప్పికొట్టే విధంగా చేయాలని చూస్తున్నారు. మరోవంక, చాలా నియోజకవర్గాలలో వైసిపిలో ముఠా తగాదాలు కలకలం రేపుతున్నాయి. సీనియర్ నేతలే పార్టీ నాయకత్వం పట్ల ధిక్కార ధోరణి అనుసరిస్తున్నారు. తమకు సీట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తమ ప్రత్యర్థులకు సీట్ ఇస్తే మాత్రం పార్టీ అభ్యర్థులను ఓడిస్తామంటూ బహిరంగంగానే సవాల్ చేస్తున్నారు.

లోక్ సభలో పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వైరి వర్గాలతో వరుసగా భేటీలు జరిపి, వారిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నా ఎన్నికల సమయంకు ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగి ఈ రెండు జిల్లాలపై దృష్టి సారిస్తున్నారు. మొన్ననే పవన్ కళ్యాణ్ `వారాహి విజయ యాత్ర’ ఈ జిల్లాల్లో విజయవంతంగా జరిగింది. చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రోజెక్టుల సందర్శనకు సహితం పెద్ద ఎత్తున ప్రజాస్పందన కనిపించింది. వీటిని దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్ సోమ, మంగళ వారాలలో ఈ రెండు జిల్లాలో పర్యటనలు జరిపారు.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 35 స్థానాలు ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో కనీసం 25 సీట్లు గెల్చుకొంటే గాని రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాలేమని భావిస్తున్నారు. ఇటీవలి పవన్ వారాహి యాత్రలో ఈ రెండు జిల్లాలలో జనసేన ప్రాబల్యాన్ని పెంచుకున్నట్లు నిఘా వర్గాలు సహితం స్పష్టం చేయడంతో జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించక తప్పడం లేదు. ముఖ్యంగా వైసిపిలో పలువురు అసంతృప్తి నేతలు టిడిపి, జనసేనల వైపు చూస్తుండటం జగన్ కు సవాల్ గా పరిణమించింది.

దీనికి తోడు పలు నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు, గ్రూపువివాదాలు వైఎస్సార్‌సీపీని పట్టి పీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ రెండు జిల్లాల పర్యటనలో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించి కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన, టీడీపీల ప్రభావాన్ని తటస్థం చేసేందుకు ఆయన రానున్న నెలల్లో రెండు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉందని సమాచారం.

మరోవంక, నాలుగేళ్లు దాటినా పోలవరం ప్రాజెక్ట్ ముందడుగు వేయకపోవడం సహజంగానే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్వాసితుల పునరావాసం ప్రశ్నార్థకంగా మారింది. 
దీనిని దృష్టిలో పెట్టుకొనే ఈ నెలాఖరుకు కేంద్రం నుండి మంచి వార్త వినబోతున్నామని ప్రకటించారు. ఆ విధంగా చెప్పడం ద్వారా జగన్ పోలవరంపై చేతులెత్తేశారని, ఇక తానేమి చేయలేనని, ఏమి చేసినా కేంద్రమే చేయాలని తేల్చి చెప్పారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

కాగా, గోదావరి లంక గ్రామాలకు వరాలు కురిపిస్తూ మనుషులు ఉంటున్న లంకల్లో నదీ తీరానికి రివిట్‌మెంట్‌ లేకపోవడంతో కోతకు గురవుతున్న విషయాన్ని గుర్తించామని, ఎక్కడెక్కడ గోడ కట్టాలో పరిశీలిస్తున్నట్లు చెప్పారు.  పొట్టిలంక, తానేలంక,కూనలంక, వివేకానంద వారధి, కొండుకుదురు లంకల్లో దాదాపు మూడున్నర కిలోమీటర్ల పొడవున గోదావరికి రక్షణ గోడ కట్టడానికి రూ.150కోట్లు మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles