10న పంచాయతీ నిధులపై ఆందోళనకు పురందేశ్వరి పిలుపు

Thursday, May 2, 2024

పంచాయతీ నిధుల కోసం 10న బీజేపీ కలెక్టరేట్ల ముట్టడిబిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత సుమారు నెల రోజుల్లో పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమ కార్యక్రమాన్ని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. పంచాయతీలకు కేంద్రం విడుదల చేస్తున్న నిధులను స్వాహా చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, సర్పంచుల హక్కుల సాధన కోసం పోరుబాట పడుతున్నామని ఆమె వెల్లడించారు.

కేంద్రం విడుదల చేసిన తమ నిధులను వైఎస్ జగన్ ప్రభుత్వం `దొంగతనం’ చేసిందని ఆరోపిస్తూ, సైబర్ నేరం క్రింద కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని ఒక వంక సర్పంచులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీస్తుండగా, వారికి బాసటగా నిలబడుతూ ఈ నెల 10న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి పురందేశ్వరి పిలుపు ఇచ్చారు.

రాష్ట్ర ప్రభత్వం గ్రామ పంచాయితీల నిర్వహణకు కేంద్రం ఇచ్చిన నిధులు మళ్ళించి సర్పంచ్ లు ఆత్మహత్యకు పాల్పడే స్థాయికి కారణభూతమైనటువంటి పరిస్థితులు, వేలాదిమంది కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కోరుకుపోయి ప్రభుత్వ నిధులు రాక తిప్పలు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర బిజెపి ఈనెల 10న కలెక్టరేట్ల ముందు ఆందోళనకు దిగుతున్నట్లు ఆమె ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఈ ఆందోళనకు ఆమె ప్రజలు సంఘీభావం తెలపాలని పిలుపిచ్చారు. 

పంచాయితీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాహా చేస్తే గ్రామాలు ఎలా అభివృద్ది చెందుతాయని ఆమె ప్రశ్నిస్తూ  గ్రామ స్వరాజ్యం రావాలని కేంద్రం నేరుగా గ్రామ పంచాయితీలకు నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు మోకాలొడ్డుతోందని ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయితీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్ధితిలు ఏర్పడుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

బిజెపి రాష్త్ర అధ్యక్షురాలిగా ఆమె చేపట్టిన మొదటి ఆందోళనా కార్యక్రమం కావడంతో ప్రతిష్టాకరంగా తీసుకొని భారీ ఎత్తున జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  అందుకోసం ఆమె ఇప్పటికే రాష్ట్ర నేతలు, కోర్ కమిటీ సభ్యలుతో ఆడియో, వీడియో కాన్ఫెరెన్సులు నిర్వహించారు. జోన్ల వారీగా అంటే రాష్ట్రాన్ని నాలుగు జోన్ లు గా విభజించి ఆడియో కాన్పెరెన్సులు నిర్వహించారు.  జిల్లా కేంద్రాల్లో జరిగే ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు గ్రామ పంచాయితీల్లో నిధులు స్వాహా చేస్తు ఒక రకమైన ఆర్థిక నేరానికి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల విషయంలో వ్యవహరిస్తున్న విషయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి బిజెపి రాష్ట్ర వ్యాప్త ఉధ్యమానికి శ్రీకారం చుట్టుతున్నట్లు ప్రకటించారు.

జిల్లా పార్టీ నేతలు మండల స్థాయిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి ఈ నెల 10 వ తేదీన నిర్వహించే ఆందోళన కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఆమె కార్యక్రమాన్ని రూపొందించారు. ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఒకొక్క రాష్త్ర స్థాయి నేత ఈ ఆందోళనలకు నేతృత్వం వహించే విధంగా ఆమె కార్యక్రమం రూపొందించారు. ఆమె స్వయంగా ఈనెల 10న ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనకు నేతృత్వం వహిస్తారు. మరో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి విజయవాడలో జరిగే కార్యక్రమానికి సారధ్యం వహిస్తారు. అరకులో మాజీ ఎంపి కొత్తపల్లి గీత, విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పాల్గొంటారు. 

అనకాపల్లిలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, కాకినాడలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మచిలీపట్నంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుసాంబశివరావు, గుంటూరులో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పాలగొంటారు. నెల్లూరులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, తిరుపతిలొ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, హిందుపూర్ లో ఏపీ సహ ఇంఛార్జి సునీల్ దేవదర్, కర్నూల్ లో మాజీ ఎంపీ టిజి వెంకటేష్, నంద్యాల లో మాజీ ఎమ్మెల్యే ఎం ఎస్ పార్ధసారధి హాజరు కానున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles