గెలుపే లక్ష్యంగా చంద్రబాబు సరికొత్త వ్యూహాలు

Wednesday, January 22, 2025

రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహాలు రూపొందిస్తున్నారు.  దీని కోసం అహర్నిశలు శ్రమించడమే కాకుండా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టిన వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తాజాగా, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న చిన్ని కుమారి లక్ష్మిని మార్చేసి.. చిరంజీవిరావును రంగంలోకి దింపడంతో చంద్రబాబు రాజకీయ వ్యూహం అర్థంకాక రాజకీయ వర్గాలు తలలు పట్టుకొంటున్నాయి. కాపులను టిడిపికి దూరం చేయాలని ఒక వంక వైసీపీ వర్గం పెద్ద ఎత్తున ఎత్తుగడలు వేస్తుండగా,  బీసీ మహిళ లక్ష్మిని పోటీ నుంచి తప్పించి.. కాపు సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్‌ లెక్చరర్‌ వేపాడ చిరంజీవిరావును అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా చాణిక్య నీతి ప్రదర్శించారని భావిస్తున్నారు.

వివిధ స్థాయిలలో పార్టీలో ప్రక్షాళన చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా కొన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ నేతల పనితీరు సక్రమంగా లేని పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు.

 అలాగే కొన్ని నియోజకవర్గాలకు ప్రత్యేక పరిశీలకులను నియమిస్తూ పార్టీ పూర్తిస్థాయిలో పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని విజయం దిశగా నడిపించేందుకు కీలక నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూనే ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నారు.

చిత్తూరు, కడప, అనంతపురం, విశాఖ, గుంటూరు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రత్యేక పరిశీలకులను నియమించే దిశగా టీడీపీ అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలకు ప్రత్యేక పరిశీలకులను అధిష్టానం నియమించింది.

ఇప్పుడు అదే బాటలో కొన్ని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మరికొంతమంది పరిశీలకులను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో కేవలం ద్వితీయ శ్రేణీ నేతలే పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు.

త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు ఉన్న నియోజకవర్గాలకు కో – ఆర్డినేటర్లతో పాటు పరిశీలకుల నియామకాన్ని చేపట్టనుంది. ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించడమే కాకుండా థర్డ్‌ పార్టీతో పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకుంటూ, దానికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు.

ఇదే సమయంలో గ్రూపు విభేదాలకు స్వస్తి పెట్టేందుకు ముమ్మరమైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా యువతరాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్న టీడీపీ అధిష్టానం, ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా నాలుగు నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు ఉద్వాసన పలికిన అధిష్టానం, వారి స్థానంలో కొత్త వారిని నియమించి పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.

ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని భావిస్తున్న అధిష్టానం తాజాగా ఇన్‌చార్జిల మార్పునకు శ్రీకారం చుట్టింది. త్వరలోనే దాదాపు పది నియోజకవర్గ ఇన్‌చార్జిలకు ఆ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టమైన సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles