గందరగోళంలో తెలంగాణ బిజెపి!

Saturday, January 18, 2025

పొరుగునే ఉన్న కర్ణాటకలో మరోసారి బీజేపీ గెలుపొందితే ఆ జోష్ లో మరో ఐదారు నెలల్లో ఎన్నికలు జరుగనున్న తెలంగాణాలో కూడా పాగా వేయవచ్చని, దక్షిణాదిన రెండో రాష్ట్రంగా తెలంగాణలో బిజెపిని పటిష్టం చేసుకోవచ్చని బిజెపి నేతలు కన్న కలలు కర్ణాటకలో ఓటమితో భగ్నమయ్యాయి. దానితో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయడం నాయకులకు సమస్యగా మారింది.

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుతో జోష్ లో ఉన్న కాంగ్రెస్ నుండి బిజెపికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఇతర పార్టీల నుండి నాయకులు ఎన్నికలలో పార్టీకి బలమైన అభ్యర్థులు దొరుకుతారని ఎదురు చూస్తున్న బిజెపికి ఇప్పుడు కొత్తగా చేరేవారు లేకపోగా, చేరిన వారిలో ఎవ్వరు మిగులుతారో, మరెవ్వరి జారిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది.

మరోవంక, పార్టీ రాష్త్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ను మార్చాల్సిందే అంటూ పలువురు వలస నాయకులు ఢిల్లీ వెళ్లి పంచాయతీ పెట్టుకున్నారు. ఇటువంటి గందరగోళ మధ్య సోమవారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికలకు అవసరమైన వ్యవహాల గురించి గాని, పార్టీ నాయకత్వాన్ని పటిష్టపరిచే ఆలోచనలు గాని కనిపించలేదు.

కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతో, రాష్త్ర అధ్యక్షుడిగా సంజయ్ కు ఢోకాలేదని, మార్చే ప్రశ్న లేదనే సంకేతం పార్టీ శ్రేణులకు ఇవ్వడంపైననే ద్రుష్టి కేంద్రీకరించినట్లున్నది. ఇక కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై పడదని నచ్చచెప్పేందుకు విశేష ప్రయత్నం చేశారు. తెలంగాణాలో అధికారంలోకి రావాలనే ఆరాటమే గాని, ప్రజల ముందుకు వెళ్లేందుకు స్పష్టమైన అజెండా ఏదీ బిజెపి మదిలో ఉన్నట్లు కనిపించడం లేదు.

కర్ణాటకలో తిరస్కరించిన `డబల్ ఇంజిన్ సర్కార్’ మంత్రమే జపిస్తున్నారు. ఇక 40 శాతం అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ కర్ణాటకలో బిజెపిని ఓడించింది. ఇప్పుడు కాంగ్రెస్ నినాదాన్ని అరువు తెచ్చుకొని 60 శాతం కమీషన్ ఆరోపణలతో కేసీఆర్ ను ఎదుర్కోవాలని సంజయ్ సిద్దమవుతున్నట్లు కనిపిస్తున్నది.

“దళిత బంధులో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటే… మరో 30 శాతం కమీషన్ సీఎం కుటుంబానికి వెళుతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు భూదందాల్లోనూ 60 శాతం కమీషన్లు వెళుతున్నాయి. ఇది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు. సారు – కారు- 60 పర్సెంట్ సర్కార్” అంటూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంజయ్ చెప్పుకొచ్చారు.

కాళేశ్వరం, ఇతర ప్రాజెక్ట్ లలో అవినీతి ఆరోపణలను కొంతకాలంగా కాంగ్రెస్, బిజెపి చేస్తున్నా ప్రజలలో వాటి ప్రభావం కర్ణాటకలో మాదిరిగా ఇక్కడ కనిపించడం లేదు. కేంద్ర మంత్రులు నిత్యం మెచ్చుకుంటున్న పలు భారీ ప్రాజెక్ట్ లను నిర్మించడం, ఇతర రాష్ట్రాలు ఔరా అంటూ చూస్తున్న పలు పథకాలను అమలు చేస్తుండటంతో ప్రజలలో వాటి పట్ల ఎంతో కొంత సానుకూలత పలు సందర్భాల్లో వ్యక్తం అవుతున్నది.

అవినీతి ఆరోపణలతో పొరుగు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయిన బిజెపి తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తుంటే ఏమేరకు విశ్వసనీయత ఉంటుందో ప్రశ్నార్థకమే. ఏదేమైనా పార్టీని ఎన్నికల వైపు నడిపించడంలో బండి సంజయ్ విఫలం అవుతున్నారని ఆ పార్టీ నాయకులే స్పష్టం చేస్తున్నారు. పార్టీ నిర్మాణం గురించి పట్టించుకోకుండా నిత్యం తాను మాత్రమే మీడియాలో కనిపించాలనే ఆత్రంగా పనిచేస్తున్నారని ఆరోపణలున్నాయి.

బిజెపి నేతలే `ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీ’ అన్నట్లుగా బిజెపి, బిఆర్ఎస్ సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు. బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితపై ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్నెన్నో ఆరోపణలను సిబిఐ, ఈడీ ఛార్జ్ షీట్ లలో చేస్తున్నా ఆమెపై చర్యలు తీసుకోవడం లేదెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్త్ర బీజేపీలోని పలువురు కీలక నేతలు కేసీఆర్ కు `కోవర్ట్’లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. దానితో కేసీఆర్ పై బిజెపి పోరాటం ఆ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచలేక పోతున్నది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles