గంగిరెడ్డి బెయిల్ పై సుప్రీం అస‌హ‌నం

Friday, January 17, 2025

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ 1 నిందితుడుగా ఉన్నా ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు విష‌యంలో తెలంగాణ  హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై సుప్రీంకోర్టు సీజే జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. బెయిల్ ని ర‌ద్దు చేసి, మ‌ళ్లీ ఫ‌లాన రోజున బెయిల్ ఇవ్వాలంటూ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన తర్వాత విచారణను వెకేషన్ బెంచ్‌కి బదిలీ చేశారు. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చేవారం విచారణ జరపనుంది. వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డి బెయిల్ పై బయట ఉండటం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని, సహకరించేందుకు ప్రజలెవరూ ముందుకు రావడం లేదని పేర్కొంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరింది.

విచారణ జరిపిన ధర్మాసనం, ఏప్రిల్ 27న బెయిల్ రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. మే 5 లోపు లొంగిపోవాలని గంగిరెడ్డికి ఆదేశాలిచ్చింది. మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30వ తేదీ లోపు ముగించాలన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో జూన్ 30 వరకు మాత్రమే గంగిరెడ్డిని రిమాండ్ కు తరలించాలని సీబీఐ అధికారులకు స్పష్టం చేసింది.

జులై 1న గంగిరెడ్డిని బెయిల్‌పై విడుదల చేయాలని తన ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. ఈ షరతును సవాల్ చేస్తూ వివేకా కూతురు డా. సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హంతకులు బయట ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పిటిషన్ లో పేర్కొన్నారు. డీఫాల్ట్‌ బెయిల్‌పై బయట ఉన్నప్పుడు గంగిరెడ్డి తనకు కోర్టు ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేసిన ఉదంతాలు ఉన్నాయని తన పిటిషన్‌లో ఆమె పేర్కొన్నట్లు సమాచారం.

తాజాగా ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. షరతులతో కూడిన ఉత్తర్వులను హైకోర్టు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేసింది. గంగిరెడ్డి డీఫాల్ట్‌ బెయిల్‌ రద్దు చేస్తూ గత నెల 27న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవేం ఉత్తర్వులంటూ అసహనం వ్యక్తం చేస్తూ ప్రతివాదులకు సిజెఐ నోటీసులు జారీ చేశారు. ఎర్ర గంగిరెడ్డి, సిబిఐకు నోటీసులు జారీ చేస్తూ వారం రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. వెకేషన్‌ బెంచ్‌ తదుపరి విచారణ చేపడుతుందని సిజెఐ పేర్కొన్నారు.

ఇలా ఉండగా, దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని ప్రశ్నించడానికి మాజీ ఎంపి వివేకానంద వ్యక్తిగత సహాయకుడికి తగిన అర్హత ఉందా లేదా అనేది స్పష్టం చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. తనకు అర్హత ఉందంటూ దేవిరెడ్డి శంకర్‌రెడ్డి ప్రధాన పిటిషన్‌లో వివేకా పిఎ ఎంవి కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ సంజరు కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.

ఎంవి కృష్ణారెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌చౌదరి వాదనలు వినిపిస్తూ, హత్యకేసుకు సంబంధించి పిటిషనర్‌ ఫిర్యాదుతోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని తెలిపారు. తనకు ప్రశ్నించే అర్హత ఉందని దీనిపై స్పష్టత కావాలని కోరారు. అనంతరం స్పష్టత ఇస్తామని ధర్మాసనం తెలిపింది.

గతంలో ఇదే అంశంపై దేవిరెడ్డి శంకర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా, నిందితులకు ఈ అంశంపై ప్రశ్నించే హక్కు లేదని, తగిన వ్యక్తి ప్రశ్నిస్తే పరిశీలించగలమని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం విథితమే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles