`కోవర్ట్’ దాసోజు శ్రవణ్‌ కు కేసీఆర్ రివార్డ్!

Tuesday, November 5, 2024

సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తుంది. పలు పార్టీలు మారిన ఆయనకు `కేసీఆర్ కోవర్ట్’గా బీజేపీలో పనిచేసినందుకు కేసీఆర్ ఇచ్చిన రివార్డ్ గా ప్రచారం జరుగుతుంది.

అలాగే మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ ను సైతం ఎమ్మెల్సీ గా ప్రకటించారు. ఎమ్మెల్సీలు ఫారూక్‌ హుస్సేన్‌, రాజేశ్వరరావు పదవీకాలం ముగియడంతో వారి స్థానాల్లో వీరిని ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఎంపిక చేసిన ఇద్దరూ ఒకే సామజిక వర్గంకు చెందిన వారు కావడంతో పాటు బిజెపి నుండి బిఆర్ఎస్ లో చేరినవారు కావడం గమనార్హం.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ బీసీ వర్గాల బలమైన గొంతుకగా ఎదిగారు. మంచి వాక్చాతుర్యం, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడం, జాతీయ మీడియాతో మాట్లాడే, తెలుగు, జాతీయ మీడియా డిబేట్‌లో సైతం పాల్గొని పార్టీ గళం వినిపించే వారిలో దాసోజు ముందు వరుసలో ఉంటారు. 

ప్రజారాజ్యంలో కొంతకాలంపాటు పనిచేసిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో  చేరి పలు హో దాల్లో పనిచేశారు. తెలంగాణ కోసం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి బీఆర్‌ఎస్‌ సమర్పించిన చారిత్రక నివేదిక రూపకల్పన బృందం లో సభ్యుడిగా పనిచేశారు.

అయితే తెలంగాణాలో కాంగ్రెస్ చకిలపడుతున్నదని గ్రహించి బీజేపీలో చేరారు. ఆయనకు నాటి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంచి ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా గత ఏడాది బయటపడిన బిఆర్ఎస్ ఎమ్యెల్యేల కొనుగోలకు బిజెపి ఎత్తుగడను ఛేదించడంలో కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరుగుతుంది.

బీజేపీలో ఉంటూనే అక్కడి ఎత్తుగడలను ఎప్పటికప్పుడు బిఆర్ఎస్ కు చేరవేస్తుండేవారని, అదే తరహాలో ఆ పార్టీ ఎమ్యెల్యేల కొనుగోలుకు జరుగుతున్న ఎత్తుగడలను ముందుగానే లీక్ చేయడంతో కేసీఆర్ జాగ్రత్త పడి `రెడ్ హ్యాండ్’గా పట్టుకోగలిగారని చెబుతున్నారు. ఈ సందర్భంగా నమోదైన కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ ను కూడా నిందితునిగా చేర్చారు.

ఢిల్లీ నుండి బిజెపి దూతలుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. జాతీయ స్థాయిలో కలకలం రేపడంతో పాటు బిజెపి ఎమ్యెల్యేలు ఎవ్వరు చేజారి పోకుండా కేసీఆర్ కట్టడి చేసేందుకు దోహదపడింది. ఒక విధంగా తెలంగాణాలో పాగా వేయాలనే బీజేపీ కేంద్ర నాయకుల ఎత్తుగడలకు గండి కొట్టినట్లయింది.

ఆ తర్వాత కొద్దీ రోజులకు శ్రవణ్‌ బిఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుండి ఆయనకు పార్టీలో తగు గుర్తింపు ఇస్తున్నారు.  బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి పోటీచేయాలని భావించారు. ఇక్కడ్నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లి 2018 ఎన్నికల్లో పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రవణ్ పై గెలుపొందారు.

తాజాగా ఎమ్యెల్సీ గా నామినేట్ చేయడం ద్వారా కేసీఆర్ శ్రవణ్ కు తగు రివార్డ్ ఇవ్వడంతో పాటు దానం నాగేందర్ కు తిరిగి అసెంబ్లీ సీటు ఖరారు అయినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles