సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పటివరకు విచారణను దాటవేసుకొంటూ వస్తున్న కేసులు ఒకేసారి వెంటాడుతున్నట్లున్నాయి. బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వరుసకు తమ్ముడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించడమే కాకుండా, తన అధికార నివాసంతో సంబంధం గల ఇద్దరికీ కూడా నోటీసులు ఇవ్వడం ఒకవంక చికాకు కలిగిస్తున్నది.
మరోవంక, 2019 ఎన్నికల సమయంలో అధికార టిడిపిపై ప్రధాన అస్త్రంగా ఉపజివోయించిన కోడి కత్తికేసు ఇప్పుడు జగన్ ను వెంటాడుతున్నది. ఇప్పటివరకు ఈ కేసులో తనను ఎవ్వరు విచారించకుండా తప్పించుకున్న ఆయన కోర్టు ముందుకు రావలసిందే అని ఎన్ఐఎ కోర్టు స్పష్టం చేసింది.
సంచలనం కలిగించిన కోడి కత్తి కేసులో బాధితుడైన వైఎస్ జగన్‌ను విచారించేందుకు ఏర్పాట్లు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్ధ ఎన్‌ఐఏను కోర్టు ఆదేశించింది. ఇందుకోసం విక్టిమ్ షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేయాలని సూచించింది.
నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడికి సంబంధించిన కేసులో విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు మంగళవారం నుంచి విచారణ ప్రారంభించింది. సంఘటన జరిగిన దాదాపు నాలుగేళ్ళు కావస్తున్నా ఈ కేసులో ఇంతవరకూ విచారణ ప్రారంభం కాలేదని నిందితుడు తరుఫు న్యాయవాది సలీం దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్ ఐఏ కోర్టు జనవరి 31వ తేదీ నుంచి విచారణ షెడ్యూల్ ఖరారు చేసింది.
దీని ప్రకారం పది మంది సాక్షులతో కూడిన జాబితాను ఎన్‌ఐఏ తరుఫు ప్రాసిక్యూషన్ గత వాయిదా రోజున కోర్టుకు సమర్పిం చింది. దీని ప్రకారం జాబితాలో మొదటి సాక్షిగా దినేష్ కుమార్‌ను పేర్కొంది. అయితే బాధితుని కూడా విచారించాల్సి ఉన్నందు న కోర్టుకు హాజరపరిచే బాధ్యత తీసుకోవాలని అప్పుడే ఎన్‌ఐఏను కోర్టు ఆదేశించింది.
ఈక్రమంలో మంగళవారం నాటి ప్రారంభ విచారణకు తొలి సాక్షిగా విశాఖ విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ హాజరు కావాల్సి ఉంది. ఘటన జరగ్గానే కేసు నమోదు చేసిన విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో దినేష్ ఫిర్యాదిగా ఉన్నారు.
ఈ కేసును ఎన్‌ఐఏ తీసుకున్నాక ఎఫ్‌ఐఆర్‌లో దినేష్‌ను మొదటి ప్రత్యక్ష సాక్షిగా పేర్కొనడం జరిగింది. అయితే ఈయన విచారణకు గౖౖెర్హాజరయ్యారు. దినేష్ తండ్రి చనిపోవడంతో కోర్టుకు హాజరు కాలేకపోయారని అతని తరపు న్యాయవాది ఎన్‌ఐఏ కోర్టుకు తెలియచేశారు. దీంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 15వ తేదీకి వాయిదా పడింది.