కొండా సురేఖ బీజేపీలో చేరేందుకు సిద్ధమా!

Saturday, January 18, 2025

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకంటూ జంబో కమిటీలను ఏఐసీసీ నియమించిన24 గంటల లోపే మాజీ మంత్రి,  సీనియర్ నాయకురాలు కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. ఆ కమిటీలలో తనను కేవలం కార్యవర్గ సభ్యురాలిగా మాత్రమే నియమించడం పట్ల అవమానంగా భావిస్తున్నట్లు ప్రకటించి, ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. 

కమిటీల నియామకంలో సీనియార్టీని పరిగణలోకి తీసుకోలేదని,  న కంటే జూనియర్లకు ప్రాధాన్యత దక్కిందని చెప్పుకొస్తూ మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ లో ఉన్నా గుర్తింపు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా అంతా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సన్నిహితులకు ప్రాధాన్యత లభించిందని అసమ్మతి వ్యక్తం చేశారు. 

తాను 34 ఏళ్లుగా కాంగ్రెస్ లో పని చేస్తున్నామన్నా, 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి మంత్రిగా పని చేసిన సీనియర్ గా ఉన్న తన కంటే జూనియర్లకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో స్థానం కల్పించారని ఆమె ధ్వజమెత్తారు. పైగా,  తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్‌లో తన పేరు మాత్రమే కాకుండా, వరంగల్ జిల్లాకు సంబంధించి మరెవ్వరి పేరు కూడా లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వం పట్ల అసమ్మతితో ఉన్న ఆమె పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బీజేపీలో చేరాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి. గతంలోనే టీఆర్ఎస్ లో పోసగదని నిర్ణయించుకున్నారు. ఆమె పదవికి తన రాజీనామా లేఖను స్వయంగా రేవంత్ రెడ్డికి అందించారు. 

పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మాట్లాడి ఆమెకు తగు న్యాయం చేస్తానని రేవంత్ హామీ ఇచ్చినా ఆమె స్పందించలేదని తెలుస్తున్నది. ఇప్పుడు పిసిసి కమిటీల అంశాన్ని వివాదంగా చేయడం ద్వారా పార్టీ నుండి నిష్క్రమించడానికి ఆమె మార్గం ఏర్పాటు చేసుకొంటున్నారా? అనే అభిప్రాయం కలుగుతుంది. కుమార్తె సుష్మితా పటేల్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని కొండా దంపతులు భావిస్తున్నారు. 

పైగా, ఆమె భర్త కొండా మురళి ఎమ్యెల్సీ కావాలను కొంటున్నారు. కాంగ్రెస్ లో ఉంటూ ఈ పదవులు పొందలేమని అంచనాకు వచ్చిన్నట్లున్నది. తెలంగాణాలో కాంగ్రెస్ ను వెనుకకు నెట్టి బిజెపి ప్రాబల్యం పెరుగుతున్న దృష్ట్యా ఆ పార్టీలో  అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. 

పైగా,  పోటీకి బలమైన అభ్యర్థులకు వెదుకుతున్న బిజెపి `ఎమ్యెల్యేల కొనుగోలు కేసు’ కారణంగా టిఆర్ఎస్ నాయకులను ఆకర్షించడం తగ్గించినట్లు కనిపిస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై దృష్టి సారిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ తదితరులు  ఆమెను కలసి బీజేపీలో చేరమని ఆహ్వానించారు కూడా. 

తాను కాంగ్రెస్ లో సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మద్దతు కొనసాగుతుందని అంటూనే టిడిపి నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ, అసలు కాంగ్రెస్ వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె విమర్శలు గుప్పించడం గమనార్హం. తనకు పదవులకంటే ఆత్మాభిమానం ముఖ్యం అని ఆమె తేల్చి చెప్పారు. 

తాజాగా తనకు కొత్త కమిటీల్లో చోటు దక్కకపోవడంపై పిసిసి సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పిసిసి అధికార ప్రతినిధి పదవికి ఆయన రాజీనామా చేశారు. జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సెల్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న తనకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో స్థానం ఎందుకు కల్పించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌టి సామాజిక వర్గం నేతలపై కాంగ్రెస్ పార్టీలో చిన్న చూపు ఉందని ఆరోపించారు. 

మాజీ మంత్రి పి జనార్ధనరెడ్డి కుమారుడు, మాజీ ఎమ్యెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సహితం కమిటీలలో స్థానం లభించక పోవడంతో బిజెపి వైపు చూస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles