పార్లమెంట్ లో రేవంత్ ప్రశ్నకు నిర్మలమ్మ అసహనం!

Thursday, May 2, 2024

రూపాయి విలువ పడిపోవడాన్ని ప్రస్తావిస్తూ బిజెపి ప్ర‌భుత్వం దేశాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేసిందని  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో అసహనానికి గురయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉంటే పార్లమెంటులో కొందరికి అసూయగా ఉందని అంటూ ఎదురు దాడికి దిగారు. అమెరికా డాలర్‌తో పోల్చితే మన దేశ కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకూ తగ్గిపోతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించిందా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

అయితే నేరుగా సమాధానం  చెప్పకుండా,భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, ఇది ప్రతిపక్షాలకు సమస్యగా మారిందని సోమవారం సమాధానం చెబుతూ నిర్మల సీతారామన్ వాపోయారు.

పైగా,  భారత దేశ అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ గర్వపడాలని ఆమె హితవు చెప్పారు. అయితే కొందరు మాత్రం దీనిని ఓ పరిహాసంగా, జోక్‌గా తీసుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. ‘‘భారత దేశ కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకూ క్షీణిస్తోంది. ఒక డాలర్‌కు రూ.83 స్థాయికి పతనమైంది. ఇంత క్షీణత నమోదు కావడం ఇదే మొదటిసారి. దీనిని ప్రభుత్వం గమనించిందా? ఈ పతనాన్ని నిలువరించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలేమిటి? ప్రభుత్వం వద్ద ఓ కార్యాచరణ ప్రణాళిక ఉందా?” అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 
మరోవంక, 

తాను మాట్లాడిన హిందీ భాషను ఉద్దేశించి నిర్మల చేసిన కామెంట్స్ పై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.  ‘‘నేను శూద్రుడిని, నాకు స్వచ్ఛమైన హిందీ రాదు.. నిర్మలగారు బ్రాహ్మణవాది, మంచి హిందీ మాట్లాడుతారు”అని రేవంత్ ఎద్దేవా చేశారు. దానితో కులం, మతానికి సంబంధించిన వ్యాఖ్యలు ఎవరూ సభలో చేయకూడదని స్పీకర్  ఓం బిర్లా వారించారు. 

గతంలో రూపాయి విలువ  69కి పడిపోయినప్పుడు 2013లో అప్పటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ‘‘నేడు రూపాయి ఐసీయూలో ఉంది. తమిళులు ఈ వ్యక్తిని ఢిల్లీకి ఎందుకు పంపించారో నాకు అర్థం కావడం లేదు’’ అని మోదీ 2013 అక్టోబరులో ట్వీట్ చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు

అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారని చెబుతూ, కానీ ఇప్పుడు రూపాయి విలువ 82ను దాటిపోయిందని, రూపాయిని ఐసీయూ నుంచి తిరిగి ఇంటికి తీసుకురావడానికి ప్రభుత్వం వద్ద కార్యాచరణ ప్రణాళిక ఏదైనా ఉందా? అని రేవంత్ చురకలు అంటించారు. 

ఈ ఏడాది మొత్తం రూపాయి ప‌త‌నం కొన‌సాగుత‌నే ఉంద‌ని, 2021 డిసెంబ‌ర్ నుంచి రూపాయి విలువ క్షీణించ‌డం మిన‌హా బ‌ల‌ప‌డింది లేద‌ని రేవంత్ తెలిపారు. బిజెపి అధికారం చేప‌ట్టిన 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రూపాయి విలువ భారీగా ప‌త‌నం చెందింద‌ని పేర్కొన్నారు. 

ఈ ఎనిమిదేళ్ల‌లో ప్ర‌పంచ ప్ర‌ధాన క‌రెన్సీల కంటే భార‌త్ క‌రెన్సీ ప‌త‌న‌మే ఎక్కువగా ఉంద‌ని తెలియజేశారు. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు 11.75 శాతం దేశీయ క‌రెన్సీ ప‌త‌న‌మ‌య్యింద‌ని, ఒకే ఏడాదిలో ఇంత‌గా క్షీణించ‌డం ఇదే తొలిసారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ప్రశ్నకు నిర్మల సీతారామన్ సమాధానం చెప్తూ, ప్రతి కరెన్సీతోనూ భారతీయ రూపాయి బలంగా ఉందని చెబుతూ రిజర్వు బ్యాంకు విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించిందని, డాలర్-రూపాయి హెచ్చుతగ్గులు మితిమీరకుండా చూసేందుకు మార్కెట్లో జోక్యం చేసుకోవాలని చెప్పారు. కాగా, ఆమె సమాధానం చెప్పిన రోజుననే భారతీయ కరెన్సీ రూపాయి సోమవారం ప్రారంభంలో అమెరికా డాలర్‌తో పోల్చితే 35 పైసలు తగ్గి, రూ.82.63 స్థాయికి దిగజారడం గమనార్హం. 

 కాగా, బిజెపి ప్ర‌భుత్వం దేశాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేసిందని రేవంత్  దుయ్యబ్టటారు. స్వాతంత్య్రం త‌రువాత నుంచి 2014 వ‌ర‌కు కేంద్రంలో ఉన్న ప్ర‌భుత్వాలు దేశం కోసం చేసిన అప్పులు రూ. 55,87,149 కోట్లుగా ఉందని 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఎనిమిదేళ్ల‌లో మోదీ ప్ర‌భుత్వం చేసిన అప్పు రూ.80,00,744 కోట్లు చేసిందని ధ్వజమెత్తారు. 67ఏళ్ల‌లో దేశాన్ని పాలించిన ప్ర‌భుత్వాల‌న్నీ క‌లిపి చేసిన అప్పుల కంటే.. కేవ‌లం ఎనిమిదేళ్ల‌లో మోదీ ప్ర‌భుత్వం చేసిన అప్పులే ఎక్కువ అని మండిప‌డ్డారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles