సంవత్సరంకు పైగా తెలంగాణాలో పాదయాత్ర చేస్తున్నా ఇప్పటి వరకు ఎవ్వరు పెద్దగాటించుకోక పోయినప్పటికీ, అకస్మాత్తుగా అధికార పక్షం నుండి దాడులు ఎదురు కావడం, రెండు సార్లు పోలీసులు అరెస్ట్ చేయడంతో వైఎస్ఆర్టీపీ చీఫ్ వై ఎస్ షర్మిల ఇప్పుడు వార్తలలో నిలిచారు. పైగా, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గుండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించడంతో ఒక విధంగా రాజకీయ కలకలం రేగుతున్నది.
తెలంగాణాలో కేసీఆర్ ను ఓడించడం కోసం తామంటే తామని బిజెపి, కాంగ్రెస్ ఒక ప్రక్క పోటీ పడుతూ ఉంటే, ఇప్పటి వరకు ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయని షర్మిల కేసీఆర్ కు తానే అసలు పోటీ అని ప్రకటించడం, అందుకే తనను లక్ష్యంగా చేసుకొని తన పాదయాత్రకు ఆటంకాలు కల్పిస్తున్నారని చెప్పడం ఒకింత వింతగా కూడా కనిపిస్తుంది.
తానంటే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని, తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించారు. తన పాదయాత్ర.. కేసీఆర్‌కు అంతిమ యాత్ర కాబోతుందని హెచ్చరించారు. ఇప్పటికే మూడు సార్లు పాదయాత్రను అడ్డుకొనే కుట్ర చేశారని, హైకోర్టు అనుమతి ఇచ్చినా పోలీసులు అడ్డుకొనే యత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
కేఏ పాల్ మాటలకు వల్లే ఆమె మాటలను జనం వినోదంగా తీసుకోనప్పటికీ, ఆమె మాటల వెనుక ఏదో నిగూఢ ఎత్తుగడ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా, ఆమె నేరుగా కేసీఆర్ కుమార్తె కవితను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.
లిక్కర్ స్కామ్లో మహిళ ఉండొచ్చు కానీ.. తాను మాత్రం రాజకీయాలు చేయెద్దట అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతున్నప్పుడు, తన పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించడం ద్వారా బిజెపితో సమ ఉజ్జిగా చెప్పుకొనే ప్రయత్నం చేశారు. పైగా, ప్రతిపక్షాల పైన కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు జరిగాయని, విపక్ష నేతలు ప్రశ్నించకుండా ఉండేందుకు వారిని కొనేశారని ఆమె ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలకు దమ్ముంటే వారి నియోజకవర్గాల్లో పబ్లిక్ ఫోరం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వారిపై చేసిన ఆరోపణలను అక్కడే బయటపెడతానని ఆమె సవాల్ చేశారు.
పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా పోలీసులు అడ్డుకుంటూ, అనుమతి ఇవ్వకపోవడంపై ఆమె మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం, పోలీసులు ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. పర్మిషన్ కోసం వరంగల్ సీపీ దగ్గర శనివారం రాత్రి 11.30 గంటల వరకు తమ పార్టీ నేతలు వెయిట్ చేసినా, అనుమతి ఇవ్వకుండా తనకు షోకాజ్ నోటీసు జారీ చేశారని షర్మిల గుర్తు చేశారు.
ఆ నోటీసుకు జవాబు ఇచ్చామని చెబుతూ రెండు రోజులు ఎదురు చూసి తన యాత్రకు పర్మిషన్ ఇవ్వకపోతే మళ్ళీ హైకోర్టుకు వెళ్తామని ఆమె ప్రకటించారు. హైదరాబాద్ లో తనను అరెస్ట్ చేసి మహిళ అని కూడా చూడకుండా 8 గంటలు పోలీసు స్టేషన్లో ఉంచారని, రిమాండ్ కు పంపాలని ట్రై చేశారని ఆమె మండిపడ్డారు.
ఇదంతా చూస్తుంటే పోలీసులను తన సొంత జీతగాళ్లలా, టీఆర్ఎస్ కార్యకర్తల్లా కేసీఆర్ ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టమవుతోందని షర్మిల స్పష్టం చేశారు. రుణమాఫీ, నిరుద్యోగభృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి లాంటి హామీలు అమలు చేయనందుకు రాష్ట్ర ప్రజలే సీఎం కేసీఆర్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆమె చెప్పారు.
బస్సును కాలబెట్టిన, కార్ల అద్దాలు పగలగొట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయలేదని, అరెస్ట్ చేయలేదని ఆమె విమర్శించారు. కాగా, పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కడా తాము రూల్స్ బ్రేక్ చేయలేదని వైఎస్ఆర్టీపీ లీగల్ సెల్ చైర్మన్, సుప్రీం కోర్టు అడ్వకేట్ వరప్రసాద్ తెలిపారు. సర్కారు వైఫల్యాలు ఎత్తి చూపటం నేరం కాదని అంటూ, యాత్రలో జాగ్రత్తలు తీసుకుంటామని కోర్టుకు తెలిపినా పోలీసులు నిరాకరించారని పేర్కొన్నారు.