కేసీఆర్, కేజ్రీవాల్ లకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్!

Wednesday, December 25, 2024

కర్ణాటకలో బీజేపీ ఎత్తుగడలను చిత్తుచేసి, ఆ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించి, అనూహ్యమైన ఆధిక్యతతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పర్చబోవడాన్ని దేశంలోని పలు ప్రతిపక్షాలు ఒక విధంగా పండుగ చేసుకొంటున్నాయి. 2024 ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు లభించిన అపూర్వమైన విజయంగా భావిస్తున్నాయి. మమతా బెనర్జీ నుండి ఎంకే స్టాలిన్ వరకు, శరద్ పవార్ నుండి నితీష్ కుమార్ వరకు అందరూ అభినందనలు తెలిపారు.

శనివారం ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య బెంగళూరులో ప్రమాణస్వీకారం చేయడాన్ని ఉమ్మడి ప్రతిపక్షాల వేదికగా మార్చే ప్రయత్నంగా కాంగ్రెస్ చేస్తున్నది.  బీజేపీయేతర పక్షాలకు చెందిన అతిరథమహారధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇద్దరు ప్రముఖులకు ఆహ్వానాలు పంపలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వారిద్దరూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.

ఇంకా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవ్వరో అధికారికంగా ప్రకటించకుండానే కేసీఆర్ ను కూడా సిద్దరామయ్య ప్రమాణస్వీకారంకు ఆహ్వానించారని అంటూ హైదరాబాద్ లో మీడియాకు `లీక్’ ఇచ్చారు. దానికి కేసీఆర్ హాజరవుతారా? హాజరుకారా? అంటూ ప్రశ్నలు కూడా మీడియాలో వచ్చాయి. అయితే తాము కేసీఆర్ ను ఆహ్వానించడం లేదని కాంగ్రెస్ శుక్రవారం స్పష్టం చేయడంతో ఈ `మీడియా లీక్’ బిఆర్ఎస్ వర్గాల నుండే వచ్చినట్లు స్పష్టం అవుతుంది.

కేసీఆర్, కేజ్రీవాల్ తాము బిజెపిపై పోరాడుతున్నామని ఎన్ని మాటలు చెబుతున్నప్పటికీ వారిద్దరూ ప్రతిపక్ష ఐక్యతను దెబ్బతీసి, బిజెపికి పరోక్షంగా సహకరించే ప్రయత్నం చేస్తున్నారని పలు ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అందుకనే వారితో చేతులు కలిపేందుకు వెనుకాడుతున్నారు. ఈ విషయం ఇప్పుడు మరోసారి రుజువయింది.

పైగా, మరో కొద్దీ నెలల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణాలో బిఆర్ఎస్ – కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు కావడంతో సిద్దరామయ్య ప్రమాణస్వీకారంకు కేసీఆర్ ను కాంగ్రెస్ ఆహ్వానించినా, కేసీఆర్ అందులో పాల్గొన్నా తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుంది. పైగా, వారిద్దరూ ఒకటే అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారంకు బలం చేకూరినట్లవుతుంది.

 పైగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడినట్లుగానే కేసీఆర్ కూడా మాట్లాడారని అంటూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించడం గమనార్హం. కేసీఆర్ ను ఆహ్వానించలేదని కాంగ్రెస్ ప్రకటించడంతో బిఆర్ఎస్ ఒకింత అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది.

తన అసహనాన్ని, దశాబ్దాల కాలం పాటు పాలించిన కాంగ్రెస్ దేశానికి  ఏమి చేసిందని ప్రశ్నించడం ద్వారా సీఎం కేసీఆర్ వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో  రెండురోజులపాటు జరగనున్న పార్టీ శిక్షణా కార్యక్రమాన్ని  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తూ చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా అభివృద్ది చెందాయని పేర్కొన్నారు. భారతదేశం అభివృద్ధిలో వెనుకబడి ఉండేందుకు కాంగ్రెస్ కారణం అని స్పష్టం చేశారు.

మరోవంక, కర్ణాటక ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించి కేసీఆర్ వెనుకడుగు వేయడం కూడా పరోక్షంగా బిజెపికి మేలు చేసేందుకైనా? అనే ప్రశ్నలను కాంగ్రెస్ నేతలు వేస్తున్నారు.  ఏదేమైనా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం కేసీఆర్ కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చికాకుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles