కుప్పం నుండి వరుసగా ఏడు సార్లు గెలుపొందిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అక్కడి నుండి ఓడించడం ద్వారా రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవచ్చని, ప్రతిపక్షం అంటూ లేకుండా చేయవచ్చని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసుకున్న అంచనాలకు, ఎత్తుగడలకు అక్కడి నుండే ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తనకు రాజకీయంగా తిరుగులేని విధంగా చేసుకోవడం కుప్పం నుండి ప్రారంభించాలనుకున్న జగన్ కు ఇప్పుడు రాజకీయ పతనం అక్కడి నుండే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడును తన నియోజకవర్గంలో పర్యటించకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది.
ఏపీ ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల సభలకు భారీ సంఖ్యలో జనం వస్తుండడంతో తట్టుకోలేక రోడ్ షోలు, సభలు నిషేధించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ప్రభుత్వం తీరుపై విపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యంగా బుధవారం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కుప్పంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలతో పరిస్థితి రాజకీయ రణరంగాన్ని తలపించింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. రోడ్ షోలకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు నిలిపివేయడంతో దాదాపు ఆయన గంటపాటు రోడ్డుపైనే ఉన్నారు. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబును అడ్డుకున్నారనే వార్త వ్యాపించడంతో.. ఊహించని స్థాయిలో టీడీపీ కార్యకర్తలు పార్టీ నేతలు సునామీలో పోటెత్తారు.
‘ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. జగన్ అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. అతనో ఫెయిల్డ్ సీఎం’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
‘కుప్పంలో జరుగుతున్న అరాచకాలను బుధవారం నుంచి రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచంలోని తెలుగువారంతా చూస్తున్నారు. నేను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ పాదయాత్ర చేస్తే అడ్డుకోలేదు. షర్మిల పాదయాత్ర చేసినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాలు సహకరించాయి. జగన్ తల్లి విజయలక్ష్మి ఎన్నోచోట్ల సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. జగన్ పాదయాత్ర చేసినా సహకరించాను. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయలేదు. ఇప్పుడు నన్ను నా సొంత నియోజకవర్గంలో తిరగకుండా చేసేందుకు జగన్ జీవో తీసుకొచ్చాడు. జగన్ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి’ అని దుయ్యబట్టారు.
ఈ సంఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు బాసటగా నిలబడ్డారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై ముఖ్యమంత్రిని నిలదీస్తూ ఆయన వైఎస్ జగన్ కు ఓ లేఖ వ్రాసారు. ” ఓదార్పు యాత్ర పేరుతో మీరు దశాబ్ద కాలం పాటు యాత్రలు, రోడ్ షోలు చేయవచ్చు కానీ… ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్షాలు జనాల్లో తిరగొద్దా?” అని ప్రశ్నించారు.
ప్రతిపక్షాలు జనాల్లో తిరగడానికి అనుమతించకపోతే ఎలాగని ప్రశ్నించారు. మీరు అధికారంలో లేనప్పుడు ఒక రూలు, అధికారంలోకి వచ్చాక మరో రూలా? అని ప్రశ్నించారు. అంతే కాకుండా పింఛన్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ బహిరంగలేఖ రాశారు.
ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు.. ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో 1 తీసుకువచ్చారని పవన్ విమర్శించారు. ఇలాంటి జీవో గతంలో ఉండి ఉంటే జగన్ రెడ్డి.. ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా..? అని పవన్ ప్రశ్నించారు.
రాష్ట్రంలోప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజా పక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా తమపై పూర్తి బాధ్యత ఉంది అన్నారు. ఇప్పటికే పలు మార్లు జగన్ నియంతలా వ్యవహించారు.. అయినా ప్రతిపక్షాలు శాంతియుతంగానే ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నాయి. అయినా ఇలాంటి చీకటి ఉత్త్వరులు ఇవ్వడం ఏంటిని ప్రశ్నించారు.
చివరకు టిడిపికి బద్ద వ్యతిరేకిగా పేరొందిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహితం చంద్రబాబును అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడును ఆంక్షలు పేరుతో అడ్డుకోవడం ఏ విధంగానూ సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల హర్షించే విధంగా వారు వ్యవరించాలని, అలా కాకుండా దురుద్దేశంతో వ్యవహరించటం మంచిది కాదని హితవు చెప్పారు.