పొంగులేటి బీజేపీలో చేరిక, షర్మిలకు మద్దతుగా బీజేపీ!

Saturday, May 18, 2024

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికు తెలంగాణ ప్రభుత్వం భద్రతను కుదించడంతో ఆయనకు ఇక బిఆర్ఎస్ తో  తెగతెంపులు రంగం సిద్దమైన్నట్లు స్పష్టం అవుతుంది. గత ఎన్నికలలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న  ఖమ్మం సీట్ ను తనను కాదని, గతంలో తాను ఓడించిన, అప్పుడే టిడిపి నుండి వచ్చిన నామా నాగేశ్వరావుకు ఇచ్చి గెలిపించినప్పటి నుండి టిఆర్ఎస్ నాయకత్వం పట్ల విముఖంగా ఉంటూ వస్తున్నారు.

అయితే, నియోజకవర్గంపై పట్టు కోల్పోకుండా, నిత్యం ప్రజలకు సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. దానితో రాజకీయంగా ప్రభావం కోల్పోలేదు. తెలంగాణాలో పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిలకు సహితం అండగా ఉంటూ వస్తున్నారు. పొంగులేటి మద్దతుతోనే పాలేరు నుండి అసెంబ్లీకి పొత్తు చేస్తున్నట్లు ఆమె ముందుగానే ప్రకటించారు.

ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేయడానికి సమర్థులైన అభ్యర్థుల కొరతను ఎదుర్కొంటున్న బిజెపితో కొంతకాలంగా పొంగులేటి టచ్ లో ఉన్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ లో చేరినా రేణుక చౌదరి, భట్టి విక్రమార్క వంటి బలమైన నేతలున్న ఖమ్మం జిల్లాలో తనకు ప్రాధాన్యత లభించదని ఆసక్తి చూపడం లేదు. బీజేపీలో చేరితే మొత్తం ఖమ్మం జిల్లాలో ఆయన మాట చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటుంది.

ఇటీవలనే, వచ్చే ఎన్నికలలో జిల్లాలోని రిజర్వు కానీ మూడు నియోజకవర్గాలలో ఒక చోట నుండి పోటీ చేస్తానని పొంగులేటి ప్రకటించారు.  అంతేకాదు, తన మద్దతుదారులు కూడా పోటీ చేస్తారని చెప్పారు. ఆయనకే సీట్ ఖాయం చేయనప్పుడు, మద్దతు దారులకు సీట్లు యెట్లా వస్తాయి అంటూ బిఆర్ఎస్ లో గుసగుసలు వినిపించాయి.

అయితే, పార్టీ మారడానికి సిద్దపడే ఆ విధమైన ప్రకటన చేసిన్నట్లు స్పష్టం అవుతుంది.  సంక్రాంతి తర్వాత పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. జనవరి 1న కార్యకర్తలు, అభిమానులతో భారీ బల ప్రదర్శన చేసిన పొంగులేటి.. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చుతోంది. పైగా, ఆ సమ్మేళనంలో  తన సీట్ గురించి ‘‘తేలుస్తారా.. తేల్చుకోమంటారా?’’ అంటూ బీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి హెచ్చరికలు పంపారు.

పొంగులేటి ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి పోటీకి సిద్దపడుతున్నారు. సత్తుపల్లి, వైరా, ఇల్లేందు వంటి సీట్లలో సహితం తన మద్దతు దారులకే సీట్ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. కొంతకాలం క్రితం పొంగులేటి తన కుమార్తె వివాహన్ని ఇండోనేషియాలోని బాలిలో జరిపించారు. ఈ వేడుకకు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు వెళ్లడంతో పాటు అక్కడ భవిష్యత్‌ రాజకీయ చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.

 బాలిలో బీజేపీ ముఖ్య నేతలతో పొంగులేటి భేటీ అయ్యారని, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సంక్రాంతి తర్వాత పార్టీ మారడం ఖాయమని తెలుస్తున్నది. తాను బిజెపిలోకి వెళ్లినా పాలేరు నుండి షర్మిలను గెలిపించే బాధ్యతలు కూడా తీసుకోగలరని చెబుతున్నారు. కేసీఆర్ పై ఒంటెత్తు పోరాటం చేస్తున్న ఆమెకు మద్దతు ఇవ్వడానికి బిజెపి సహితం సిద్దపడే అవకాశం ఉంది.

ఇటీవల షర్మిల పాదయాత్రపై ఆంక్షలు పెట్టడంతో పాటు, హైదరాబాద్ లో అమానుషంగా ఆమెను అరెస్ట్  చేసినప్పుడు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆమెను పరామర్శించడం గమనార్హం. ఆమె భర్త అనిల్ సారధ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏపీలో భారీ ఎత్తున మతమార్పిడులు జరుగుతున్నాయని, తిరుమలలో క్రైస్తవుల ప్రాబల్యంతో క్షేత్ర పవిత్రతకు భంగం కలిగిస్తున్నారని బిజెపి,  హిందూ సంస్థలు గగ్గోలు పెట్టాయి, ఇప్పుడు అదే పార్టీ తెలంగాణాలో అధికారంలోకి రావడానికి షర్మిలతో పరోక్షంగా జతకట్టేందుకు సిద్దపడుతూ ఉండడం గమనార్హం. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles