కిడ్నాప్ పై సీబీఐ దర్యాప్తు కోరుతున్న విశాఖ ఎంపీ

Thursday, May 16, 2024

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంభం సభ్యుల కిడ్నప్ వ్యవహారం క్రమంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించే వైపుకు దారితీస్తుంది. కేవలం బెదిరించి డబ్బు గుంజటం కోసమే ఈ కిడ్నాప్ జరిగిందని ఒక వైపు పోలీసులు, మరోవైపు స్వయంగా ఎంపీ సత్యనారాయణ కూడా చెబుతూ వచ్చారు. అయితే వారం రోజులు అవుతున్నా అసలేమీ జరిగిందో పోలీసులు వెల్లడించే ప్రయత్నం చేయడం లేదు.

అయితే, జరిగిన తీరు, ఈ విషయమై పోలీసుల వ్యవహారం చూస్తుంటే కడప లేదా కర్నూల్ గ్యాంగ్ ప్రమేయం ఉండి ఉంటుందని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. తాజాగా, ఎంపీ కూడా ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయడం గమనిస్తే ఆయనకు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏపీ పోలీసులపై నమ్మకం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పటికే తన వ్యాపారాలను క్రమంగా హైదరాబాద్ కు మారుస్తానని ప్రకటించడంతో అధికార పార్టీలోని కీలక వ్యక్తుల ప్రేమయంతో, పోలీసుల సహకారంతోనే ఈ వ్యవహారం జరిగి ఉండవచ్చనే అనుమానాలతో ఆయన ఉన్నారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. సీబీఐతో విచారణ చేయిస్తే కిడ్నాపర్లు ఇంట్లోకి ఎలా వచ్చారో తెలుస్తుందని ఆయన చెప్పడం గమనిస్తే ఏపీ పోలీసుల దర్యాప్తు సరిగ్గా జరగడంలేదని ఆయన నిర్ధారణకు వచ్చిన్నట్లు వెల్లడవుతుంది.

కిడ్నాపర్లు తన కుటుంబ సభ్యులను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారి నెంబర్లు అడిగారని ఎంపీ చెప్పడం గమనిస్తే భూసంబంధ వ్యవహారాల కారణంగానే కిడ్నప్ జరిగిన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కిడ్నాపర్లు గంజాయి తాగుతూ చాలా దారుణంగా ప్రవర్తించారని, హేమంత్, రాజేష్ ఇద్దరూ రౌడీ షీటర్‌లు అన్న ఎంవీవీ, పక్కా ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్ జరిగిందని తెలిపారు.

ఇప్పటి వరకు కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు మీడియాకు పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో ఒక విధంగా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు అభిప్రాయం కలుగుతుంది. ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి.. కుటుంబ సభ్యులను క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారని తెలిపారు. మూడు రోజులు రెక్కీ నిర్వహించి కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు చెప్పారన్నారు.

అయితే, ఈ ఘటనలో ఏ పార్టీకి, ఎవరికి, ఎలాంటి సంబంధం లేదని ఎంపీ  స్పష్టం చేశారు. కేవలం డబ్బులు కోసమే ఇదంతా చేశారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మరోసారి వెల్లడించారు. అందరూ కోరుతున్నారు కాబట్టి ఘటనపై సీబీఐ, ఎన్ఐఏ దర్యాప్తు జరపాలని తానే స్వయంగా కోరుతున్నట్లు తెలిపారు.

పైగా, విశాఖను వదిలిపెట్టి తెలంగాణాలో వ్యాపారాలు చేయాలని తాను అనుకోవడానికి విశాఖపట్నంలో వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు లేవని కాదని అంటూ వివరణ ఇచ్చారు. ఆ విధంగా చెప్పడం ద్వారా తనను కొందరు టార్గెట్ చేస్తుండడం కారణంగా పరోక్షంగా సూచించారు.

 కాగా, ఈ కిడ్నాప్ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ లోతుగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ నరసాపురం ఎంపీ రామకృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ వ్రాసారు. మరోవంక, కేంద్ర ఏజెన్సీల ద్వారా దర్యాప్తు జరిపించాలని కోరుతూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు లేఖ వ్రాసారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles