పవన్ కళ్యాణ్ ప్రారంభించిన జనసేన పార్టీని తమ పార్టీగా ఆంధ్ర ప్రదేశ్ లోని కాపు సామాజిక వర్గంకు చెందిన వారు మొదటి నుంచి భావిస్తూ వస్తున్నప్పటికీ ఆయన ఎప్పుడు కేవలం ఆ సామాజిక వర్గంకు చెందిన నాయకుడిగా గుర్తింపు పొందే ప్రయత్నం చేయలేదు. పలు అట్టడుగు, అణగారిన వర్గాల మద్దతు కూడదీసుకొనేందుకు విశేష ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
గత ఎన్నికలలో ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో సహితం కాపు ఓటర్లు గణనీయంగా ఉన్నప్పటికీ, కాపుల ప్రాబల్యం గల నియోజకవర్గాలలోని ఆయన పార్టీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చిన్నప్పటికీ పార్టీ పరిధిని పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చారు.
కేవలం `కాపు ఐడెంటిటీ’తో రాజకీయాలు చేస్తూవస్తున్న ముద్రగడ పద్మనాభం వంటి వారికి దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, మొదటిసారిగా 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఆయన `కాపు ఐడెంటిటీ’ కోసం ప్రయత్నం చేస్తున్నారా? తాజాగా ఆయన మాటలు వింటుంటే ఇటువంటి అనుమానమే కలుగుతుంది.
ఒక వంక పొత్తుల విషయం తేల్చుకోలేకపోవడం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేకపోవడంతో 2024 ఎన్నికలలో తన ఉనికిని బలంగా చాటుకోనిదే రాజకీయంగా భవిష్యత్ ఉండదనే అబద్రతాభావంకు గురవుతున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే, అందరూ కాపు కాపు అంటారు.. కానీ కాపులు తనను కాపుగా గుర్తించట్లేదని ఒక విధంగా ఆవేదన వ్యక్తం చేశారు.
కాపులు తన వెంట నిలబడితే కచ్చితంగా అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాపులు గోదావరి జిల్లాల్లో మాత్రమే లేరు.. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉన్నారని అంటూ అందరూ కలిసి ఉంటే దక్షిణ భారతదేశంలో అతి పెద్ద సమాజం కాపు సమాజం అవుతుందని చెప్పడం ద్వారా కాపులను బలమైన రాజకీయ భూమికగా తనవెంట సమీకరించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, వాస్తవానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల అందరికన్నా ఎక్కువగా కాపులలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవ్వరు కాపు నేతలని కాకుండా ఎవ్వరు జగన్ ను ఓడిస్తారని చూస్తున్నట్లు స్పష్టం అవుతుంది. అందుకనే బీజేపీ గత ఐదారేళ్లుగా కాపులకు రాష్ట్ర అధ్యక్షులుగా నీయమిస్తున్నా ఆ పార్టీ పట్ల ఆకర్షితులు కావడం లేదు. బిజెపిని జగన్ ఏజెంట్ గా మాత్రమే చూస్తుండటం అందుకు ప్రధాన కారణం.
మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిపిన కాపు సంక్షేమ సేన సమావేశంలో అదే సమయంలో కాపుల ఒక్కరి వల్ల అధికారం రాదని, కాపులు ఇతర వర్గాలను కలుపుకుపోతే కచ్చితంగా అధికారం సాధించగలమని పేర్కొనడం గమనార్హం.
`కాపు ఐడెంటిటీ’కి మించిన మద్దతు అవసరమనే అవగాహనతో మొదటి నుండి వ్యవహరిస్తున్నారు. అయినా ఇప్పుడు `కాపు ఐడెంటిటీ’ ద్వారానే రాజకీయ పొత్తులకు గాని, వచ్చే ఎన్నికలలో కొన్ని సీట్లు పొందేందుకు గాని మార్గం ఏర్పడదనే నిర్ణయానికి వచ్చినట్లు కనబడుతున్నది.
సంఖ్యాబలం ఎంత ఉన్నా కూడా రాజకీయ బలం లేకపోతే అధికారం చేజిక్కిచ్చుకొలేని హెచ్చరిస్తూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ఇంత సంఖ్యాబలం ఉండి కూడా రిజర్వేషన్ అడుక్కునే పరిస్థితి ఉందంటూ ఒకింత నిష్టూరంగా కూడా మట్లాడారు. పరోక్షంగా కాపులంతా తనవంటి నాయకులకు మద్దతుగా ఉంటె వారి పరిస్థితి రాజకీయంగా మరో విధంగా ఉండేదని సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు.
కాపు సమాజం బిసి వర్గాలను, దళితులను కలుపుకుని నడవగలిగితే రాజ్యాధికారం ఎప్పటికీ చేజారదని పేర్కొంటూ రాజ్యాధికారానికి స్పష్టమైన మార్గం ఉంచే ప్రయత్నం చేశారు. ఇంత సంఖ్యాబలం ఉండి ఎందుకు కలిసి నడవలేక పోతున్నారంటూ రాజకీయంగా కాపులలో లోపించిన ఐక్యతను ప్రస్తావించారు.
“తెలుగుదేశంతో 20 సీట్లకు పోటీ కుదిరింది అన్నట్లుగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. నేను లోపాయికారీ ఒప్పందాలు చేసుకోను. అలా మన గౌరవం తగ్గించే పొత్తులకు వెళ్లను. ఏ ఒక్క జనసైనికుడి ఆత్మగౌరవం తగ్గించే పని నేను చెయ్యను.. ఏ పార్టీ అజెండా కోసం మేము పనిచేయ్యం” అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొనడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. తన పార్టీ బలంపై కాకుండా, తన సామాజిక వర్గం బలాన్ని పెట్టుబడిగా పెడుతూ పొత్తులలో ప్రయోజనం పొందాలనే ఎత్తుగడ కూడా కనిపిస్తుంది.