జగన్ తో బిజెపి బంధంకు కిరణ్ తట్టుకోగలరా!

Friday, April 19, 2024

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, సమైక్యవాదం కోసం చిట్టచివరి వరకు పట్టుబడుతూ, ఆ వాదంపైననే ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ కు రాజీనామా చేసి సొంతంగా సమైక్యాంధ్ర పార్టీ అంటూ పెట్టుకొని, 2014 ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టిన నల్లారి కిరణ్‌కుమార్‌ అనుకున్నట్లు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇక బీజేపీలో చేరడమే మిగిలివుంది.

అయితే రాష్ట్రవిభజనకు తామే కారణం అని చెప్పుకొంటున్న బీజేపీలో ఆయన ఏవిధంగా ఇమడగలరో, రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలకు ఏవిధంగా సర్దుకు పోగలరో అన్నది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తుంది. తెలంగాణాలో బిజెపి ప్రచారంపై వెడితే ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజనను ఏ విధంగా అడ్డుకున్నారో గుర్తుచేయడం ద్వారా బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేయవచ్చు.

ప్రస్తుతం నోటాకన్నా తక్కువ ఓట్లున్న ఆంధ్రప్రదేశ్ లో ఆయన బీజేపీకి ఏవిధంగా తోడ్పడగలరో చూడవలసి ఉంది. పైగా, ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొండంత అండగా ఉంటున్నది. 2019లో ఆయన గెలుపొంది, ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ శ్రేణులు నిర్ణయాత్మక పాత్ర వహించాయి.

ఒకవంక, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం క్రైస్తవ ప్రభుత్వం అంటూ, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు చేస్తున్న బిజెపి నేతలు రాజకీయంగా జగన్ తో అంటకాగుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వంటి బలమైన నాయకుడు ముఖ్యమంత్రిగా తిరిగి రాకుండా అడ్డుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పట్టుదలగా ఉన్నట్టు స్పష్టం అవుతున్నది.

కానీ, కిరణ్ కుమార్ రెడ్డి మొదటినుండి జగన్ మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సిబిఐ కేసులలో ఆయన అరెస్ట్ కావడానికి సహితం కిరణ్ కుమార్ రెడ్డి కారకుడిగా పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్ లో కీలక నేత అయినా అమరనాథ్ రెడ్డి మృతి తర్వాత, ఆయన కుమారుడిగా రాజకీయ ప్రవేశం చేసిన చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందారు.

అయితే, 2019లో ఎన్నికల అనంతరం ఆర్ధిక మంత్రిగా రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చేరడంకోసం ఎదురు చూస్తున్న ఆయన తన రాజకీయ ప్రత్యర్థి, ఎన్నికలలో తనను ఓడించడంకోసం విశేషంగా కృషి చేసిన డా. రామచంద్రారెడ్డిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వత్తిడితో రాజశేఖరరెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకోవడంతో తట్టుకోలేక పోయారు. స్పీకర్ పదవి ఇచ్చిన కూడా అవమానకరంగా భావించారు.

అప్పటి నుండి జగన్ మోహన్ రెడ్డికి దూరంగా ఉంటూ వస్తున్నారు. పైగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా వ్యవహరిస్తూ జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై జగన్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే, ఓటింగ్ కు గైహాజరు  కావడం ద్వారా చంద్రబాబు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా అడ్డుకున్నారు.

అందుకనే బీజేపీలో చేరినా జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగానే కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles