కాంగ్రెస్ కు ఊపిరిపోసిన వ్యూహకర్త సునీల్ కార్యాలయంలో దాడులు 

Wednesday, January 22, 2025

జంబో పిసిసి కమిటీల ఏర్పాటుపై పలువురు సీనియర్ నేతల నుండి ఆగ్రవేశాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకత్వానికి పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు  దాడులు జరపడం ఊపిరి పోసినట్లయింది. అంతర్గత కుమ్ములాటలు నుండి కేసీఆర్ ప్రభుత్వంపై దాడులకు అవకాశం కల్పించినట్లయింది. 

ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు.సునీల్‌ కార్యాలయాన్ని కుట్రపూరితంగా సీజ్‌ చేశారని ఆరోపించారు. ప్రభుత్వ, పోలీసు చర్యలకు నిరసనగా బుధవారం నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో పాటు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. 

దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్ బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభిస్తున్న సమయంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తుండటం గమనార్హం. నాంపల్లిలోని గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది.పలుచోట్ల కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రగతి భవన్‌ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్‌పై పోలీసులు దాడి చేయటంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేయటమే అవుతుందని  పేర్కొంటూ అధికారం కోసం సీఎం కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడి చేసి సిబ్బంది‌ని అక్రమంగా అరెస్ట్ చేశారని, వార్‌ రూమ్‌లో ఉన్న 50 కంప్యూటర్‌లను పోలీసులు దొంగిలించారని రేవంత్ ఆరోపించారు.

ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్ఐఆర్  వారెంట్ ఏమీ చూపించకుండా సునీల్ కనుగోలును అరెస్ట్ చేసేందుకు వచ్చామని సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సేకరించిన తమ డేటాను పోలీసులు ఎత్తుకుపోయారని ఆరోపించారు. టీఆర్ఎస్ అల్లరి మూకల మాదిరిగా, కిరాయి గూండాల్లాగా పోలీసులు దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర పోలీసులు ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటోందన్న విషయం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే అని, కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ ఉందని ఒక ఫేస్ బుక్ పోస్ట్ పెట్టామని..ఆ పోస్టు వల్ల పోలీసులకు కలిగిన ఇబ్బంది ఏంటో అర్థం కాలేదని విస్మయం వ్యక్తం చేశారు. 

అయితే పోలీసులు తమ చర్యలను సమర్ధించుకొంటూ మహిళలను కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్నారని, మహిళలపై చాలా సందర్భాల్లో మీమ్స్ పెడుతున్నారని పేర్కొన్నారు. మహిళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా విధంగా పోస్టులు పెడుతున్నారని వెల్లడించారు. సునీల్   కార్యాలయం నుంచే పోస్టింగ్‌లు వస్తున్నాయని స్పష్టం చేస్తూ రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలకు తావిచ్చే విధంగా పోస్టులు పెడుతున్నారని జాయింట్ సీపీ అన్నారు. మహిళ ప్రతిష్టకు భంగం కలిగించారనే కేసులు పెట్టామని చెప్పుకొచ్చారు.

ఈ కేసులకు సంబంధించి ముగ్గురిని కస్టడీకి తీసుకుని నోటీసులు ఇచ్చామని, వారి నుంచి పది లాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశామని సీసీఎస్ సైబర్ క్రైమ్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ తెలిపారు.  టెక్నాలజీ సాయంతో లోకేషన్ ను కనుక్కున్నామని చెప్పారు. ఇన్ని రోజులు రహస్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వెల్లడించారు. 

అయితే, కుట్రలు,కుతంత్రాల్లో భాగంగానే వార్ రూమ్ పై రైడ్ జరిగిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.   జాతీయస్థాయిలో కాంగ్రెస్ వ్యవహారాలను నిర్వహించడానికి 8 మందికి టాస్క్ ఫోర్స్ టీంలో చోటు కల్పించారు. అందులో ప్రియాంక గాంధీ, సునీల్ కనుగోలుతో పాటు  చిదంబరం, ముఖుల్ వాస్నిక్, జైరామ్ రమేష్, కేసీ వేణు గోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సుర్జేవాలాను కమిటీలో సభ్యులుగా నియమించారు. 

 ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తూ రాహుల్ పాదయాత్రకు సంబంధించిన విషయాలు, యాత్రలో ప్రస్తావించే అంశాలను హైదరాబాద్ లో కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి పర్యవేక్షించి సమాచారం సేకరించి రాహుల్ చేత మాట్లాడిస్తున్నారనే అక్కసుతో సునీల్ కనుగోలును అరెస్ట్ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం  ప్రయత్నం చేస్తుందని రేవంత్ ఆరోపించారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles