ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక సూత్రదారుడిగా భావిస్తున్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి ఆప్రూవర్‌గా మారడం రాజకీయంగా కలకలం రేపుతోంది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ మేరకు ఆయన అభ్యర్ధన దాఖలు, శరత్ చంద్రారెడ్డి అభ్యర్ధనకు కోర్టు సైతం అనుమతి ఇవ్వడం అంతా గురువారం చకచకా జరిగిపోయాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ ఈడీ సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం సంచలనంగా మారింది. ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్‌గా మారారు.
కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణాలో పొట్టుకోల్పోతున్నామని ఆందోళన చెందుతున్న బిజెపి అగ్రనాయకత్వం ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను ఏదోవిధంగా అరెస్ట్ చేయాలని పట్టుదలగా ఉందని, అందుకు సహకరించేందుకు శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మార్చారని ప్రచారం జరుగుతుంది.
వైసిపి కీలకనేత విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు కావడమే కాకుండా వ్యాపారపరంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. గత ఆదివారం రాత్రి సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలిసిన సమయంలో ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చిన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకు ప్రతిగా శరత్ చంద్రారెడ్డికి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వై కేటగిరీ భద్రత కూడా కల్పించనున్నట్లు భావిస్తున్నారు.
ఆయన అప్రూవర్‌గా మారి కుంభకోణంలో కవిత పాత్రను వెల్లడించే అవకాశాలున్నాయని, కవిత ప్రేరణతోనే తాను మద్యం వ్యాపారంలో పాల్గొన్నానని శరత్ చంద్రా రెడ్డి చెప్పే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడిగా, నిన్నటి వరకు జైల్లో ఉండి, ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న శరత్ చంద్రారెడ్డిని గత ఏడాది నవంబర్ 11న ఈడీ అరెస్ట్ చేసింది.
లిక్కర్ లైసెన్సుల రేట్లు ఫిక్స్ చేయడంలో శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది. స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డిని కింగ్‌పిన్‌గా పేర్కొంది. ఈ కేసులో నిందితులైన విజయ్‌నాయర్, సమీర్ మహేంద్రుతో కలిసి రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఆధారాలు సేకరించింది.
శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్ గా కొనసాగుతున్న ట్రైడెంట్, ఆర్గోనామిక్స్, అవంతిక కాంట్రాక్టర్స్ కంపెనీలు ఢిల్లీలో రెండు కంటే ఎక్కువ రిటైల్ జోన్స్ నిర్వహిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో నిందితుడైన సమీర్ మహేంద్రు కంపెనీ ఇండో స్పిరిట్ లో శరత్ చంద్రారెడ్డి పెట్టుబడులు పెట్టారు.
ఐదు రిటైల్ జోన్స్ శరత్ చంద్రారెడ్డి కంట్రోల్‌లో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. తమకు అనుకూలంగా పాలసీ రూపొందించడం కోసం జరిగిన ఆర్థిక లావాదేవీల్లో 30 శాతం ట్రైడెంట్ గ్రూపు కంపెనీల నుంచే జరిగినట్లు ఆధారాలు సేకరించిందని సమాచారం. రిటైల్ వ్యాపారులకు లైసెన్సులు ఇప్పించేందుకు శరత్ చంద్రారెడ్డి దాదాపు రూ.64.35 కోట్ల మనీలాండరింగ్ కు పాల్పడ్డారని గుర్తించింది.