టీడీపీ బీజేపీ మైత్రిపై నీలినీడలు!

Saturday, April 20, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిమీదకు రావాలనే ప్రయత్నం సఫలం అవుతుందా? లేదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. తెలుగుదేశంతో పొత్తు ఖాయం అని కూడా ప్రకటించేశారు. బిజెపి కూడా తమతో పొత్తుల్లో కలిసి ఉంటుందని కూడా అన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర బిజెపి ఇన్చార్జి సునీల్ డియోధర్ మాటలను గమనిస్తే.. జనసేన-టీడీపీ పొత్తుల్లోకి బిజెపి వచ్చి చేరడం సాధ్యమయ్యే పనేనా అనే అనుమానం కలుగుతోంది.
సునీల్ డియోధర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని.. టీడీపీతో తమకు పొత్తు ఉండదని అంటున్నారు. ఈ మాటల్లో తెలుగుదేశానికి సంబంధించినంతవరకు రెండు ప్రమాద సంకేతాలు ఉన్నాయి. బిజెపి విడిగా పోటీచేస్తే కనీసం ఒక్కశాతం ఓటుబ్యాంకునైనా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తుందనేది తొలి భయం. అదే సమయంలో.. జనసేనతో పొత్తు ఉంటుందని అనడం ద్వారా.. పవన్ కల్యాణ్ ను కూడా చంద్రబాబు దరికి చేరనివ్వరా? అనే అనుమానం కూడా కలుగుతోంది. అదే జరిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి.. జగన్మోహన్ రెడ్డికే లబ్ధి కలుగుతుంది.
పవన్ కల్యాణ్ మాత్రం.. తెలుగుదేశంతో కలిసి.. జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడం, ఆయన ప్రభుత్వాన్ని మట్టి కరిపించడం మాత్రమే లక్ష్యాలుగా.. తన రాజకీయ ప్రణాళికను ప్లాన్ చేసుకున్నారు. ఈ కూటమిలో బిజెపి కూడా తప్పకుండా ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు. పవన్ ఆ మాట చెప్పినప్పటినుంచి ఏపీ బిజెపి నాయకులు పొత్తుల గురించి తమ ఆమోదం తెలియజేయకుండా, అలాగని పవన్ ప్రకటనను ఖండించకుండా..జాగ్రత్త పాటిస్తున్నారు. రాష్ట్ర బిజెపి నాయకుల వద్ద విలేకర్లు ఈ విషయాలను ప్రస్తావించినప్పుడెల్లా.. పొత్తుల సంగతి అధిష్ఠానం చూసుకుంటుంది అనే మాట మాత్రమే చెబుతున్నారు. అయితే ‘‘టీడీపీతో పొత్తు ఉండదు’’ అని మొదటిసారిగా సునీల్ డియోధర్ తొలిసారిగా ప్రకటించారు.
అయితే సునీల్ చెబుతున్న కారణల్లో స్పష్టత లేదు. చంద్రబాబునాయుడు గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నారని, ఇప్పటిదాకా ఆ పొత్తును రద్దు చేసుకున్నట్టుగా చెప్పలేదని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ – టీడీపీ పొత్తు మంటగలిసిపోయి చాలాకాలం అయింది. అయినా సునీల్ దానిని కుంటిసాకుగా చెబుతున్నారు. కర్నాటక ఎన్నికల్లో తమ వల్లనే కాంగ్రెస్ గెలిచిందని ఆ రాష్ట్ర టీడీపీ నాయకుడు చెప్పారట. అది కూడా టీడీపీ పట్ల వైరభావానికి కారణంగా సునీల్ చెబుతున్నారు. ఇవన్నీ టీడీపీని దూరం పెట్టడానికి.. సునీల్ డియోధర్ చెబుతున్న కుంటిసాకుల్లాగా ఉన్నాయి.
మరి, జగన్ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ప్రతిజ్ఞ చేస్తున్న పవన్ కల్యాణ్.. సునీల్ డియోధర్ మాటలను ఎలా అర్థం చేసుకుంటారో, కేంద్రంలోని బిజెపి వద్ద తన మాటను ఎలా నెగ్గించుకుంటారో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles