దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తాను బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితకు బినామీగా వ్యవహరించానని అరెస్ట్ అయిన హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రామచంద్రా పిళ్ళై విచారణ సందర్భంగా చెప్పారని పేర్కొంటూ, దాని ఆధారంగా ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్న ఈడీకి దిమ్మతిరిగే ఎదురుదెబ్బ తగిలింది.
ఈ వాంగ్మూలం ఆధారంగానే శనివారం కవితను విచారణకు ఈడీ పిలిచింది. ఈ సందర్భంగా ఆమెను అరెస్ట్ చేయవచ్చనే సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ కేసులో ఈ లోగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇంతలోనే, ఐదు రోజులుగా ఐదు రోజులుగా ఈడీ కస్టడీలో ఉండగానే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు వ్యతిరేకంగా హైదరాబాదీ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై కోర్టును ఆశ్రయించారు.
ఈడీకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని తెలిపాడు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో తన లాయర్ ద్వారా పిటిషన్ వేశాడు. పిళ్లై పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది.
దీంతో పిళ్లై పిటిషన్ పై స్పందించాలంటూ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది.
అరుణ్ పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు స్పందిస్తూ రేపు విచారణకు కూడా హాజరుకానున్నట్టు తెలిపింది. ఈ విచారణలో.. అరుణ్ పిళ్లై, కవితను ఇద్దరినీ కలిపి అధికారులు ప్రశ్నించనున్నట్టు తెలిస్తోంది. ఈ క్రమంలోనే.. పిళ్లై ఈ పిటిషన్ వేయటం ఊహించని పరిణామంగా భావిస్తున్నారు.
అంతకు ముందు 29 సార్లు అరుణ్ పిళ్లై ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే 11 సార్లు పిళ్లై వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు. ఆ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకునే.. ఈడీ అధికారులు కవితకు నోటీసులిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చేపట్టిన ధర్నా కోసం కవిత కూడా ఢిల్లీలోనే ఉండగా ఈ పరిణామం చోటుచేసుకుంది.
నిజానికి 9వ తేదీనే ఆమెను విచారించాల్సి ఉంది. అయితే ఆమె ముందుగానే ఖరారైన షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. 11న విచారణకు హాజరవుతానని ఈడీకి తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు అరుణ్ రామచంద్ర పిళ్లై ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
శనివారం ఉదయం ఆమె ఈడీ ఆఫీసులో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలోనే ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో శనివారం కవిత విచారణ ఏ మలుపు తీసుకోనుందనే ఉత్కంఠ నెలకొంది.