అవినాష్ రెడ్డి హైకోర్టు ద్వారా అరెస్ట్ తప్పించుకోగలరా!

Saturday, May 18, 2024

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలకమైన అనుమానితుడిగా సిబిఐ భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం మూడోసారి విచారణకు సిబిఐ ముందు హాజరైన సందర్భంగా అరెస్ట్ కాబోతున్నట్లు సర్వత్రా భావించారు. ఆయన కూడా తనను అరెస్ట్ చేయవచ్చంటూ నేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

 తెలంగాణ హైకోర్టు నుండి ప్రస్తుతం అరెస్ట్ కాకుండా తాత్కాలిక ఊరట లభించింది. గతంలో ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో సహితం తెలంగాణ పోలీసుల సిట్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయబోయే సమయంలో కేసు హైకోర్టుకు చేరడం, అక్కడి నుండి అరెస్టు కాకుండా ఆయన తప్పించుకో గలగడం తెలిసిందే.

చివరకు కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయమై తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లగా, ప్రస్తుతం కేసు అక్కడ పెండింగ్ లో ఉంది. అదేరీతిలో హైకోర్టులో అవినాష్ రెడ్డి కేసును పక్కదారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది.

కాగా అవినాష్ రెడ్డి నిందితుడా ? సాక్షి నా? అని న్యాయస్థానం ప్రశ్నించగా160 సీఆర్‌పీసీ కింద అవినాష్ రెడ్డికి నోటీసుల ఇచ్చామని, సాక్షిగా పరిగణించిన ఈకేసులో అవసరమైతే అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ ఎస్పీ రాంసింగ్ స్పష్టం చేయడం ద్వారా అరెస్ట్ చేయబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.

హత్యాస్థలిలో దొరికిన లేఖ తమ వద్దే ఉందని హైకోర్టుకు సీబీఐ చెప్పింది. లేఖపై సీఎఫ్‌ఎస్‌ఎల్‌ అభిప్రాయం తీసుకున్నామని, తీవ్ర ఒత్తిడిలో లేఖ రాసినట్లు సీఎఫ్ఎస్ఎల్ తెలిపిందని పేర్కొనడం ద్వారా అవినాష్ రెడ్డి, ఆయన తండ్రిలకు ఈ కేసులో గల ప్రమేయం గురించి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నట్లు కూడా తెలిపినట్లయింది.

సోమవారం వరకూ ఆయనను అరెస్ట్ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సోమవారం విచారణ సమయంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని దర్యాప్తు సంస్థను న్యాయస్థానం ఆదేశించింది. అదే సమయంలో, హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన లెటర్‌ను, అవినాష్ రెడ్డి కేసు వివరాలు మొత్తం సమర్పించాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 సీబీఐ ఎస్పీ శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు కోర్టుకు వచ్చి అవినాష్ రిట్ ఫిటిషన్‌పై కౌంటర్ ధాఖలు చేశారు. అనంతరం హైకోర్టు సోమవారం వరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఎంపీ అవినాష్‌రెడ్డికి స్వల్ప ఊరట లభించినట్లైంది.

సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తీవ్రమైన చర్యలంటే ఏంటని న్యాయస్థానం ఆయన్ను ప్రశ్నించింది. అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోరుతున్నారా? అని అడిగింది. దీనికి అవినాష్ తరఫున న్యాయవాది స్పందిస్తూ.. సీబీఐ అధికారులు వాంగ్ములం నమోదు చేస్తున్న తీరు పట్ల అనుమానం వ్యక్తం చేశారు. చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నారనే నమ్మకం తమకు లేదన్నారు

దీనికి సీబీఐ తరఫున న్యాయవాది స్పందిస్తూ విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నామని చెప్పారు. వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందని న్యాయస్థానం ప్రశ్నించగాఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను ఇప్పుడే కోర్టుకు ఇస్తామని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తెలిపారు.

దీనికి న్యాయస్థానం స్పందిస్తూ సోమవారం సీల్డ్ కవర్‌లో హార్డ్ డిస్క్‌తోపాటు అవిష్ రెడ్డి వివరాలు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. అప్పటి వరకూ ఎంపీని అరెస్ట్ చేయొద్దని ఆయన తరఫున న్యాయవాది కోర్టును కోరారు.

ఈ కేసులో అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ సోమవారం వరకు ఎంపీని అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. అవసరమైతే ఆయన మంగళవారం మరోసారి కోర్టు ముందు హాజరవుతారని తెలిపింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles