కవితపై లిక్కర్ అస్త్రం బిఎల్ సంతోష్ ను కాపాడుతుందా!

Sunday, December 22, 2024

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేవలం మీడియా కథనాలకు మాత్రమే పరిమితమైన కవిత పేరును తాజాగా ఈడీ అధికారికంగా ఓ రేమండ్ రిపోర్టులో కోర్టు ముందే ప్రవేశ పెట్టడం కేవలం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసమే అని స్పష్టం అవుతున్నది.  

ఈ కేసులో బీజేపీ కీలక నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తిరుగులేని ఆధారాలను ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ సేకరించడం, ఆ ఆధారాలను తెలంగాణ హైకోర్టు ముందు ఉంచడంలో సంతోష్ ను అరెస్ట్ చేయడం అనివార్యమనే  నిర్ధారణకు వచ్చినట్లు భావిస్తున్నారు. హైకోర్టు ఆదేశం కారణంగా సోమవారం వరకు సిట్ విచారణకు సహితం సంతోష్ రానవసరం లేకపోయినా, వచ్చే వారం రాక తప్పదని వెల్లడి అవుతుంది.

 విచారణకు వస్తే సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. హైకోర్టుకు సిట్ బృందం కీలక ఆధారాలు సమర్పించింది. ఢిల్లీ పెద్దలతో నిందితులు సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతి, నందకూమార్ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్స్‌ను కోర్టుకు సమర్పిం చింది.  ముగ్గురు నిందితుల కాల్ డేటా వివరాలను అందజేశారు. 

అంతేకాకుండా అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు ఢిల్లీ పెద్దలతో దిగిన ఫోటోలు, వారు ప్రయాణించిన విమాన టికెట్ల వివరాలు, వారి మధ్య జరిగిన సంభాషణల వివరాలను కోర్టుకు సిట్ అధికారులు సమర్పించారు. ఈ సందర్భంగా కోర్టుకు సిట్ సమర్పించిన ఆధారాల్లో సతీష్‌శర్మ అలియాస్ రామచంద్రభారతికి, బిఎల్ సంతోష్‌కు మధ్య ఆగస్టు 2021నుంచి జరిగిన వాట్సాప్ చాటింగ్, స్క్రీన్ షాట్‌లను సిట్ బృందం కోర్టుకు సమర్పించింది. 

వీటన్నింటిని పరిశీలిస్తే నిందితులతో సంతోష్ కు సన్నిహిత సంబంధాలు ఉండడమే  కాకుండా, ఈ మొత్తం ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్న కీలక సూత్రధారి అని కూడా భావించవలసి వస్తుంది. ఏప్రిల్ 11న బిఎల్ సంతోష్, రామచంద్రభారతిలు హరిద్వార్‌లో సమావేశమయ్యారని సిట్  పేర్కొంది. ఇదే విషయాన్ని ఎం.విజయ్ నిర్ధారించారని  తెలిపింది. ఏప్రిల్ 26,2022 తెలంగాణ ఆపరేషన్‌పై రామచంద్రభారతి బిఎల్ సంతోష్‌కు వాట్సాప్ మెసేజ్ చేశాడని పేర్కొంది. 

సింహయాజులు స్వామీజీ స్కై హై హోటల్‌లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ పార్టీ కీలక నేత దామోదర రాజనర్సింహాలతో సమావేశమయ్యారు. అదే సమయంలో ప్రస్తుతం వారు ఉన్న పార్టీ నుంచి బిజెపిలో చేరే విధంగా చర్చించారు. ఇదే విషయాన్ని ఎం.విజయ్, అడ్వకేట్ పి.ప్రతాప్‌లు నిర్ధారించారని పేర్కొంది. 

 సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 14 వరకు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు స్వామీజీ, డాక్టర్ జగ్గుస్వామి, అడ్వకేట్ బూసారపు శ్రీనివాస్, అడ్వకేట్ పి.ప్రతాప్‌లు కొనుగోలు ఎంఎల్‌ఎలతో వాట్సాప్ కన్జర్వేషన్, రెగ్యులర్ కాల్స్/మేసేజ్‌ల లిస్ట్‌ను సమర్పించింది. 

అక్టోబర్ 15, 2022న  బిఎల్ సంతోష్ (ప్రభుత్వ క్వార్టర్స్‌లో) ఇంట్లో  ఉదయం 10 గంటలకు బిఎల్ సంతోష్, తుషార్ వెల్లంపల్లి, రామచంద్రభారతి, నందకుమార్, ఎం.విజయ్‌కుమార్ కీలక సమావేశం నిర్వహించారని, అందుకు సంబంధించిన వీడియోలు, ట్రావెల్ డాక్యుమెంట్లు తదితరాలను సమర్పించింది. ఈ విషయాన్ని అడ్వకేట్ ప్రతాప్ కన్‌ఫర్మ్ చేశాడని పేర్కొంది.

అక్టోబర్ 26,2022న మొయినాబాద్ ఫాంహౌస్‌లో నలుగురు టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు స్వామీజీ బేరసారాలు కొనసాగించారని, ఇందుకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డింగ్‌లు, వాట్సాప్ గ్రూప్ కాల్స్‌తో పాటు రామచంద్ర భారతి ఇందుకు సంబంధించి బిఎల్ సంతోష్‌కు వాట్సాప్ మేసేజ్‌ని సైతం సమర్పించారు. ఇందుకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్ వాయిస్ రికార్డులను సైతం సమర్పించింది.

అలాగే ఈ సందర్భంగా బిజెపి పెద్దలతో నిందితులు దిగిన ఫోటోలను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. అందులో గతంలో బిఎల్ సంతోష్‌తో రామచంద్రభారతి కలిసిన ఫోటోలతో పాటు వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ కన్జర్వేషన్‌కు సంబంధించిన కాల్‌డేటాను సిట్ సేకరించి కోర్టుకు సమర్పించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles