పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతుందిట. తాను పాలు తాగడం ఎవ్వరూ చూడడం లేదని అనుకుంటుందిట. అది కళ్లు మూసుకుంటుంది గనుక.. దానికి అలా అనిపించవచ్చు. కానీ ఆ పిల్లి చేస్తున్న దొంగపనిని ప్రపంచం మొత్తం గమనిస్తూనే ఉంటుంది. ఆ సంగతే దానికి తెలియదు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ ఒక డైలాగు చెబుతాడు.. ‘ఫ్లడ్ లైట్లు వేసి ఉన్న స్టేడియంలో దాగుడుమూతలు ఆడినట్టుగా ఉంది నా పరిస్థితి.. అని! జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా పాపం అలాగే ఉంది. ఆయన పాపం.. తాను చేస్తున్న దోపిడీని, దొంగచాటుగా దోచుకుంటున్న వ్యవహారాన్ని భూప్రపంచంలో ఎవ్వరూ గుర్తించడం లేదు అని అనుకుంటూ సీఎంగా ఉన్నప్పుడు లిక్కర్ దందాలను నడిపించారు. తాను చేస్తున్నది మహత్కార్యం అని సర్కారు ఖజానా రాబడి పెంచడానికి ఎంతో ముందుచూపుతో ప్రభుత్వం ద్వారానే దుకాణాలు నిర్వహిస్తూ ఆదర్శవంగా నిలుస్తున్నానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఆ ఆట ఆడుతున్న సమయంలో ఆయన చుట్టూ ఫ్లడ్ లైట్లు లేకపోవచ్చు.. కానీ హిడెన్ కెమెరాలు ఉన్నాయ్.. అన్నట్టుగా ఇప్పుడు లిక్కర్ దోపిడీకి సంబంధించిన సకల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.
తన తప్పుల్ని ఎవ్వరూ గుర్తించడం లేదనే భ్రమలో జగన్ చాలా అతిశయమైన డైలాగులు కూడా పలుకుతూ వచ్చారు.
కానీ జగన్మోహన్ రెడ్డి అక్రమాల ఆట ఆడిన రోజుల్లో ఫ్లడ్ లైట్లు ఆన్ అయ్యే ఉన్నాయనే సంగతి ఇప్పుడు బయటకు వస్తోంది జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ వ్యాపారం గురించి.. సీఐడీ చేసిన దర్యాప్తులో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని అడ్డు పెట్టుకుని, అతనికి ప్రోటోకాల్ గౌరవాల కోసం సలహాదారుగా ఒక పదవిని కట్టబెట్టి.. మిధున్ రెడ్డిని పర్యవేక్షకుడిగా నియమించుకుని.. రాష్ట్రంలోని డిస్టిలరీలను అన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని వారు ఎలా దందా సాగించారో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తను చేస్తున్న వినూత్నమైన పద్ధతి ఎవరూ చూడడం లేదులే.. ఎవ్వరికీ దొరికే అవకాశం లేదులే అని జగన్ భ్రమిస్తూ వచ్చారేమో కానీ.. ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. లికర్కర్ వ్యాపారం ముసుగులో ఎలాంటి పద్ధతుల్లో దాదాపు మూడువేల కోట్ల రూపాయలకు పైగా జగన్ అండ్ కో దోచుకున్నారో సీఐడీ విచారణలో పూసగుచ్చినట్టుగా తేల్చారు.
ఈ లిక్కర్ వ్యవహారంలో విచారణలు ఎప్పటికి మొదలవుతాయో.. తెలియదు. కానీ ఇప్పటికే వార్తల రూపంలో బయటకు వచ్చిన వివరాలను గమనిస్తోంటే.. శిక్షల నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదని అనిపిస్తోంది. కాకపోతే.. ఆ పర్వం మొదలు పెట్టేలోగా సమాధానం చెప్పడానికి కూడా నిందితుల వద్ద ఎలాంటి లాజిక్ లేకుండా ఉండేలా మరింత పక్కాగా ఆధారాలను సేకరించిన తర్వాతే ముందుకు వెళ్లాలని సీఐడీ పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. రాజ్ కసిరెడ్డి పాత్రను తేల్చడం చిన్న విషయం అయింది. మిధున్ రెడ్డి పాత్ర, అంతిమ లబ్ధిదారుగా జగన్ రెడ్డి పాత్రలను తేల్చి.. వారికి ఎలా ముడుపుల మొత్తం అందినదో నిరూపించగల ఆధారాలసేకరణలో ప్రస్తుతం సీఐడీ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతా పూర్తయిన తర్వాతే తర్వాతి దశకు వెళతారని సమాచారం.
కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి జగన్!
Friday, March 14, 2025
