ఇది ఊహాజనిత విషయమే. అయితే రాజకీయాల్లో ఇలాంటి ఊహాజనితమైన విషయాలపై చర్చలకు చాలా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందనేది ఒక ఊహ. 60 రోజుల పాటు ఒక ఎమ్మెల్యే శాసనసభకు కంటిన్యువస్ గా రాకపోతే గనుక.. కనీసం సెలవు కూడా పెట్టకపోతే గనుక.. అతని మీద అనర్హత వేటు వేయవచ్చునని డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు చెప్పడం వలన ప్రజలకు ఏర్పడిన ఊహ. మరి రఘురామ చెప్పినట్టుగా పులివెందులకు ఉప ఎన్నిక వస్తే గనుక.. అక్కడ జగన్ తన భార్య వైఎస్ భారతిని పోటీచేయిస్తారనేది ఆ పార్టీలో నడుస్తున్న మరొక ఊహ. వైఎస్ భారతి పులివెందుల ఎమ్మెల్యేగా బరిలో దిగితే గనుక.. ఆమెకు పోటీగా తెలుగుదేశం ఎవరిని మోహరిస్తుందనే మాటకు ఇప్పుడు విలువ లేదు. కానీ, కాంగ్రెస్ తరఫున ఆమెతో తలపడడానికి వైఎస్ షర్మిల బరిలో ఉంటారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఏపీసీసీ సారథి హోదాలో ఉన్న వైఎస్ షర్మిల గత ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీచేసినప్పుడు కూడా.. పులివెందుల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి తమ బంధువులను, వర్గీయులను అందరినీ కలిశారు. కానీ గెలవలేకపోయారు. ఆ సానుభూతిని కూడా వర్కవుట్ చేసుకుంటూ.. ఎమ్మెల్యే బరిలోకి దిగుతారని సమాచారం. అదే జరిగితే.. పులివెందుల కు వస్తుందని భావిస్తున్న ఉప ఎన్నిక పోరు.. వదిన-ఆడబిడ్డల సమరంగా అత్యంత ఆసక్తికరంగా మారుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పులివెందుల ప్రజలు వైఎస్ రాజశేఖ రెడ్డిని అమితంగా ప్రేమిస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు పుకార్లలో వినిపిస్తున్న ప్రకారం జరిగితే.. వైఎస్ఆర్ కు అనేక పర్యాయాలు నీరాజనాలు పట్టిన ఈ నియోజకవర్గం నుంచి.. ఆయన వారసుడిగా ఆయన ఎంతగానో ప్రేమించే కన్నకూతురికి పట్టం కడతారా? లేదా కోడలిని ఎంచుకుంటారా? అనే చర్చ కూడా ప్రారంభం అవుతోంది.
వైఎస్ షర్మిల – భారతి మధ్య ఉప్పు నిప్పు అనదగ్గ యుద్ధ వాతావరణమే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే.. సూటిగా భారతిని ఉద్దేశించి తీవ్రమైన విమర్శలు చేయడానికి షర్మిల వెనుకాడే రకం కాదు. అదే సమయంలో భారతి ఎన్నికల బరిలోకి దిగినా కూడా.. ఆమె స్వయంగా విమర్శించే నేర్పు తక్కువ. పైగా షర్మిల గురించి విమర్శించడానికి వారికి పెద్దగా అంశాలు కూడా దొరకవు. జగన్ కూడా నేరుగా చెల్లెలిని విమర్శించడానికి ఇష్టపడడు. కానీ.. తన అనుచరులతో మాత్రం.. ఆమె గురించి నీచమైన వ్యాఖ్యలు చేయించడాన్ని ఎంకరేజ్ చేస్తాడు. తన అనుచరులు.. ఇతర నాయకులతో ఆమెను తిట్టిపోస్తూ తీవ్రస్థాయి ప్రచారం చేయించడానికి ఆయన సిద్ధంగా ఉంటారు.
అలాంటి నేపథ్యంలో ఒకవేళ పులివెందుల పోరు వదిన-ఆడబిడ్డల మధ్యనే జరిగినప్పటికీ.. యావత్ వైసీపీ నాయకులు ఒకవైపు- షర్మిల ఒకవైపు నిల్చుని పోరాడినట్టుగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పులివెందులలో వదిన-ఆడబిడ్డల సవాల్!
Friday, March 28, 2025
