కలకలం రేపుతున్న ఈటెల, పొంగులేటి, జూపల్లి భేటీ!

Friday, November 22, 2024

బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల  రాజేందర్, బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం హైదరాబాద్ శివారులో ఐదు గంటలకు పైగా రహస్య భేటీ జరపడం తెలంగాణ రాజకీయాలలో కలకలం రేపుతోంది. 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆ పదవి నుండి ఎన్నికల ముందు మార్చే అవకాశం లేదని, ఆ పదవి తనకు ఇచ్చే ఆలోచన కూడా పార్టీ నాయకత్వంకు లేదని మీడియా ముందు వెల్లడించిన మరుసటి రోజే ఈటెల ఇటువంటి భేటీ జరపడం బిజెపి  వర్గాలలో ఉత్కంఠ కలిగిస్తున్నది.

మరోవంక, కర్ణాటక ఎన్నికలలో బిజెపి పరాజయంకు గురవడంతో పొంగులేటి, జూపల్లి ఆ పార్టీలో చేరే ఆలోచనకు స్వస్తి పలికి, తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని భావిస్తున్న తరుణంలో ఇటువంటి భేటీ జరపడం కాంగ్రెస్ నేతలకు సహితం ఆందోళన కలిగిస్తున్నది. తమ వ్యక్తిగత సిబ్బందిని, గాన్ మెన్ లను సహితం పంపించివేసి హైదరాబాద్ శివార్లలో ఫామ్‌హౌస్‌లో రహస్య భేటీ జరపడం రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించే అని స్పష్టం అవుతుంది.

గత వారమే ఢిల్లీ వెళ్లి అమిత్ షా, జెపి నడ్డా వంటి నేతలను కలిసి, `హిందుత్వ’ అజెండాతో వెడుతున్న బండి సంజయ్ నాయకత్వంలో బిజెపి తెలంగాణాలో ఎటువంటి ప్రభావం చూపదని ఈటెల స్పష్టం చేసి వచ్చారు. ఆ మరుసటి రోజే సంజయ్ ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. అప్పటి నుండి సంజయ్ ను మార్చే ప్రసక్తి లేదంటూ కిషన్ రెడ్డి నుండి పార్టీ నేతలో కోరస్ గా మాట్లాడుతున్నారు.

మరోవంక, సంవత్సరంకు పైగా బిజెపి చేరికల కమిటీ అధ్యక్షునిగా చెప్పుకోదగిన పెద్ద నాయకులు ఎవ్వరిని పార్టీలోకి తీసుకు రాలేకపోయారని ఈటెల పట్ల అమిత్ షా వంటి నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సంజయ్ అధ్యక్షునిగా ఉన్నంతకాలం ఎవ్వరూ పార్టీలో చేరారని ఆయన స్పష్టం చేశారని కూడా చెబుతున్నారు.
ఒక విధంగా ఆయన బిజెపి నాయకత్వం పట్ల విసుగు చెందారని ప్రచారం జరుగుతుంది.

బిజెపిలో తాను ఇమడలేకపోతున్నానని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఏ పార్టీలోనైనా కొత్త నాయకుడు చేరినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురు కావడం సహజమేనని, కొత్త, పాత నేతలు సర్దుకోవడానికి సమయం పడుతుందని ఆయన బుధవారం చెప్పడం గమనార్హం.

పొంగులేటి, జూపల్లిలను బీజేపీలో చేరేటట్లు చేయమని బిజెపి అధిష్టానం నుండి వత్తిడులు వస్తుండగా, వారిద్దరి అనుచరులు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. బిజెపికి గ్రామాలలో బలం లేదని, ఆ పార్టీలో చేరినందువల్లన ప్రయోజనం ఉండదని వారి మద్దతుదారులు నిరాసక్త వ్యక్తం చేస్తున్నారు.  మరోవంక, కాంగ్రెస్ వర్గాల నుండి కూడా వారికి భారీ ఆఫర్లు వస్తున్నాయి.

ఎట్లాగైనా వారిద్దరిని బీజేపీలో చేరమని ఒప్పించేందుకు ఈటెల ఈ భేటీ జరిపారా? లేదా ఏపార్టీలో చేరకుండా అందరం కలిసి ఓ ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసుకొని, తెలంగాణాలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేయాలనే ప్రణాళికతో కలిసారా? అనే అనుమానాలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి.

ప్రాంతీయ పార్టీ పెడితే కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ లనుండి పలువురు కీలక నేతలు కూడా చేరతారని, 40 నుండి 50 నియోజకవర్గాలలో బలమైన ప్రభావం చూపవచ్చని, అప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారవచ్చని అంచనాలు వేస్తున్నట్లు చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles