కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ లో సంబరాలు!

Sunday, December 22, 2024

కర్ణాటకలో బీజేపీ చతికిలబడటం, కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ లో పండుగ వాతావరణం నెలకొంది. కర్ణాటక ఫలితాలు ప్రభావంతో మరో ఆరునెలల్లో జరిగే ఎన్నికలలో తెలంగాణాలో కూడా అధికారంలోకి వస్తామనే ధీమా వారిలో వ్యక్తం అవుతుంది.  తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను పక్కకునెట్టి తామే బిఆర్ఎస్ కు అసలైన ప్రత్యర్థిగా ఉంటామనే బిజెపి ఆశలకు గండి పడినట్లయింది.

అదేవిధంగా అక్కడ హ్యాంగ్ అసెంబ్లీ ఏర్పడితే, మరోసారి జేడీఎస్ నేత హెచ్ డి కుమారస్వామి ముఖ్యమంత్రి కాగలరని ఎదురుచూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలు తలకిందులయ్యాయి. పైగా, కుమారస్వామి తమకు బలమైన పాత మైసూర్ ప్రాంతంలోనే చతికిలపడటం, అక్కడ కాంగ్రెస్ పుంజుకోవడంతో నోటమాట రావడం లేదు.

ముఖ్యంగా తెలంగాణకు సరిహద్దులో గల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘన విజయాలు సాధించడం బిజెపి, బిఆర్ఎస్ – ఇద్దరికీ ఆందోళన కలిగిస్తుంది. వీటి ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఉండే అవకాశం ఉంది. బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేసిన నియోజకవర్గాలలో ఎక్కడ బిజెపి గెలుపొందలేదు. పైగా, బిజెపి అభ్యర్థులు మూడు, నాలుగో  స్థానాలలో నిలిచారు.

ఈ ఫలితాలు కర్ణాటకకే పరిమితం కాదని,  దేశ రాజకీయాల్లో  కూడా పెనుమార్పులు తీసుకొస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో కూడా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 125 సీట్లు వస్తాయని తాను ఇంతకు ముందే చెప్పానని అన్నారు. బిజెపి మతతత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని చెప్పారు.

కోలార్ సభలో రాహుల్ మాట్లాడిన దానికి రాహుల్‌పై అనర్హత వేటు వేయడం, ఇళ్ళు ఖాలీ చేయించడం కర్ణాటక ప్రజలకు నచ్చలేదని రేవంత్ స్పష్టం చేశారు. అదాని అవినీతిపై మాట్లాడితే రాహుల్‌పై కక్ష్య సాధించారని మండిపడ్డారు. గులాంనబీ అజాద్ ఎక్స్ ఎంపీ అయి చాలా రోజులు అయిందని.. అయినా ఇళ్ళు ఎందుకు ఖాలీ చేయించలేదని ప్రశ్నించారు.

రాహుల్ ఇళ్ళును ఇంత త్వరగా ఖాలీ చేయించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. అదానితో తమకు సంబందం లేదంటున్న బీజేపీ.. అదానిని విమర్శిస్తే బీజేపీ ఎందుకు ఉలిక్కిపడుతుందని ఎద్దేవా చేశారు.

కర్ణాటక ఎన్నికలో విజయం సాధించడంతో తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.  హైదరాబాద్‌లోని పార్టీ ప్రధానకార్యాలయం గాంధీ భవన్‌లో పార్టీ కార్యకర్తలు డ్రమ్‌బీట్స్‌ల మధ్య డ్యాన్స్ చేశారు. పైగా పార్టీ జెండా, కాంగ్రెస్ నాయకుల కటౌట్‌లు (సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) పట్టుకుని మరీ డ్యాన్స్ చేశారు. అంతేకాక పటాసులు కూడా కాల్చారు. కొందరు పార్టీ కార్యకర్తలైతే బైక్ ర్యాలీ కూడా తీశారు.

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్‌చార్జీ మాణిక్‌రావు థాక్రే, ఇతర నాయకులు గుడిలో పూజలు నిర్వహించారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ మంచి పనితీరును కనబరచనున్నదని వారు ఆశాభావంతో ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles