కర్ణాటక ఫలితాలతో కేసీఆర్ అప్రమత్తం!

Sunday, December 22, 2024

పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అంచనాలకు మించి సీట్లు గెలుచుకోవడం తో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అప్రమత్తం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.   కర్ణాటక ఫలితాలు సహజంగానే తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెంచుతున్నది. అటు, ఇటు చూస్తున్న పలువురు నేతలు ఆ పార్టీలో చేరే అవకాశం ఏర్పడింది. చివరకు అధికార బిఆర్ఎస్ లో అసంతృప్తి నేతలను సహితం ఆకట్టుకొనే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది.

అప్రమత్తంగా లేని పక్షంలో వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో సహితం కాంగ్రెస్ పాగవేసే అవకాశం ఉందని కేసీర్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తున్నది. అందుకనే కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు వ్యూహరచనలో నిమగ్నమయ్యారని చెబుతున్నారు. బుధవారం జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే ప్రధాన అజెండా కానుంది.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుకు ఉపయోగించిన వ్యూహాలనే తెలంగాణాలో సహితం ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. పైగా, కర్ణాటక గెలుపులో కీలక పాత్ర వహించిన వ్యూహకర్త  సునీల్ కనుగోలు తెలంగాణ కాంగ్రెస్ కు సహితం వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. కనుగోలు బృందం హైదరాబాద్ కేంద్రంగా సాగిన సోషల్ మీడియా ఆపరే షన్లు కర్నాటకలో పార్టీని గెలిపించాయని కాంగ్రెస్ నేతలే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అందుకనే ముందుగా కనుగోలు బృందం వ్యూహాలను పసిగట్టి, వాటికి ప్రతివ్యూహాలు రూపొందించాలని భావిస్తున్నారు.

మరోవంక, యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఆఫీసుపై సైబర్ క్రైం పోలీసులు దాడి చేశారా? కీలక మైన కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారా? ఆ ల్యాప్ టాప్ లలో ఎలాంటి వ్యూహాలున్నా యి? కీలక సమాచారం ఏమైనా ఉందా..? అనే విషయంలో ఆరా తీస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

నల్లగొండ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకే దాడి చేశామని పోలీసులు చెబుతున్నారు. తనను కోవర్టు అంటూ ఓ ఫోన్ నంబర్ నుంచి ట్రోల్ చేస్తున్నారని ఉత్తం కుమార్ రెడ్డి ఈ నెల 5న ఫిర్యాదు చేశారని వారంటున్నారు. ఈ నెల 5న ఉత్తం కుమార్ రెడ్డి ఫిర్యాదు చేస్, 16వ తేదీ వరకు ఎందుకు వేచి చూశారనేది ప్రశ్నార్థకంగా మారింది. 

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతో యూత్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జ్‌ ప్రశాంత్ పై అధిష్టానం వేటు వేసింది. అతనిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ప్రశాంత్ టీమ్ పై  154, 157 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. మే 17వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 
కొద్దికాలం పాటు, ఇతర రాష్ట్రాలకు బిఆర్ఎస్ ను విస్తరించే ప్రయత్నాలకు స్వస్తి పలికి అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణపై  కేసీఆర్ దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థుల ఎంపిక, ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అభ్యర్థులను మార్చడం, ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నాలు చేయడం పట్ల దృష్టి సారించనున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles