మరో నాలుగైదు నెలల్లో కర్ణాటకలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా తాము కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్దపడుతున్నారని ఒకవంక కధనాలు వెలువడుతుండగా, మరో వంక ఇద్దరు కర్ణాటక ఎన్నికల పట్ల కూడా ఆసక్తి చూపుతూ ఉండడం ఆసక్తి కలిగిస్తోంది.
టిఆర్ఎస్ ను జాతీయ పార్టీగా బిఆర్ఎస్ పేరుతో మార్చిన కేసీఆర్ రాష్ట్రం వెలుపల మొదటగా కర్ణాటకలో అభ్యర్థులను పోటీకి దింపుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జేడీఎస్ తో కలసి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పూర్వం నిజం రాజ్యంలో కలసి ఉన్న, తెలుగు వారి ప్రాబల్యం గల కర్ణాటకలోని సరిహద్దు జిల్లాలతో పాటు, తెలుగు వారు ఎక్కువగా ఉన్న బెంగళూరు నగరంపై దృష్టి సారిస్తున్నారు.
మరోవంక వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సహితం రాయలసీమకు సరిహద్దులో ఉన్న కర్ణాటక ప్రాంతంలో, బెంగుళూరు నగరంలో రాయలసీమ నుండి వెళ్లి స్థిరనివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్న వారి మద్దతుతో పోటీ చేసేందుకు సిద్దపడుతున్నారు.
ఓబుళాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఒకప్పుడు తాను చక్రం తిప్పిన బిజెపితో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోన్న గాలి జనార్ధనరెడ్డి మద్దతుతో అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బళ్లారితో పాటు అనంతపురం, కర్నూలు, చిత్తూరుకు ఆనుకుని ఉన్న రాయచూరు, చిక్‌బళ్లాపుర, కోలార్ జిల్లాల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికైన మల్లికార్జున ఖర్గె సొంత రాష్ట్రం కావడమే కాకుండా, కర్ణాటకలో ఆ పార్టీకి గట్టి నాయకత్వం, మద్దతు కూడా ఉంది. మరోవంక బిజెపి ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో, ముఠా కొట్లాటలతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది.
2024 లోక్ సభ ఎన్నికలలో కేంద్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి రావాలంటే కర్ణాటకలో పట్టు నిలబెట్టుకోవడం ఆ పార్టీకి తప్పనిసరి కాగలదు. సహజంగా తెలుగు ప్రజలలో, ముఖ్యంగా ఏపీకి చెందిన వారిలో బిజెపి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.
దానితో వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపకుండా, వారి ఓట్లను చీల్చి, బిజెపికి మేలు చేయడమే జగన్ ఉద్దేశ్యమా? అనే అనుమానాలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి. కనీసం 20 నియోజకవర్గాలలో జగన్ అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయం నుండి గాలి జనార్ధనరెడ్డితో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ బెంగళూరు కేంద్రంగానే తన కార్యకలాపాలు సాగిస్తూ ఉండేవారు.