జాతీయ పార్టీగా బిఆర్ఎస్ ను ప్రకటించిన తర్వాత మొదటిసారిగా మరో మూడు, నాలుగు నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి పొరుగున ఉన్న కర్ణాటక జిల్లాలు బీదర్, రాయచూర్, గుల్భర్గా, యాద్గిర్, కలబురగి, సింధనూర్, కొప్పల్‌తో పాటు తెలుగు మాట్లాడేవారు అత్యధికంగా గల ప్రాంతాలు బళ్లారి, విజయనగరలలో 20 నుండి 25 సీట్లలో పొతే చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
మరోవంక, బెంగళూరు మహానగరంలో తెలుగు వారు ఎక్కువ గల రెండు లేదా మూడు నియోజకవర్గాలలో పోటీ చేయాలని చూస్తున్నారు. మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఈ ప్రాంతాలలో కేసీఆర్ పర్యటిస్తారని, ఆ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో బలమైన కాంగ్రెస్, బిజెపి నాయకులు పలువురు బిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా సరిహద్దులోని ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలపై కూడా కేసీఆర్ కన్ను వేస్తున్నారు. చిత్తూర్, కర్నూల్, అనంతపురం జిల్లా సరిహద్దు జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్, టిడిపి, వైసిపిలలో ఉన్న అసంతృప్త నేతలకు గాలం వేసి వచ్చే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సరిహద్దు నియోజకవర్గాల తెలుగు ప్రజలను ప్రభావితం చేసే విధంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు.
కర్ణాటకలో అనుసరించే ఎన్నికల వ్యూహంపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామితో తరచూ కేసీఆర్ టెలిఫోన్ సమాలోచనలు జరుపుతున్నారని, నియోజకవర్గాల ఎంపికలో సహితం కుమారస్వామి సూచనలపై ఆధారపడి అవకాశం ఉందని బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ పర్యటన సమయంలో ప్రముఖ జేడీఎస్ నేతలు సహితం పాల్గొనే విధంగా చూస్తామని హామీ కూడా ఇచ్చారని తెలుస్తున్నది.
ఇప్పటికే కొందరు బిఆర్ఎస్ నేతలు కర్ణాటకలో తెలుగువారు ఎక్కువగా ఉన్న జిల్లాలో పర్యటనలు జరిపి వచ్చారు. వివిధ పార్టీల నుంచి చేరేందుకు సానుకూలంగా నాయకులతో మంతనాలు కూడా జరిపారు. వారిచ్చిన నివేదికల ఆధారంగానే కేసీఆర్ కర్ణాటక ఎన్నికల వ్యూహంకు పదును పెడుతున్నారు. జాతీయ స్థాయిలో బిఆర్ఎస్ ను సీరియస్ గా తీసుకొనే విధంగా కర్ణాటకలో ఫలితాలు సాధించాలని వ్యూహాత్మకంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనబడుతున్నది.