బిజెపి కేంద్ర నాయకులను కోర్టుల ముందుకు తీసుకు రావడం ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా సీఎం కేసీఆర్ ఎమ్యెల్యేల కొనుగోలు కేసును నమోదు చేసి, ముగ్గురు నిందితులను ఆరెస్ట్ చేసి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తు ముందుకు సాగకుండా, న్యాయస్థానాలను ఆశ్రయించి ఈ దర్యాప్తును సిబిఐ పరిధిలోకి తీసుకురావడంలో బిజెపి విజయం సాధించడంతో కేసీఆర్ కు దిక్కుతోచడం లేదు.
తెలంగాణ హైకోర్టు ఉత్తరువులు అందగానే ఈ కేసును తమ పరిధిలోకి తెచ్చుకునేందుకు అత్యుత్సాహం చూపిస్తున్న సీబీఐకి కళ్లెం వేసేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ విషయమే ఒకే రోజు, ఒక వంక తెలంగాణ హైకోర్టును, మరోవంక సుప్రీంకోర్టును ఆశ్రయించినా చుక్కెదురైంది.
ఈ కేసును సీబీఐకి అప్పగించకుండా నిలువరించేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్రప్రభుత్వానికి బుధవారం ఒకపక్క సుప్రీం కోర్టులో, మరోపక్క హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టే/ స్టేటస్ కో ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. అంతేకాకుండా, వెంటనే శుక్రవారం విచారణ జరపాలన్న విజ్ఞప్తిని సహితం నిరాకరించింది. ఈ నెల 17న విచారణ చేపడతామని తెలిపింది.
మరోవైపు, ఈ కేసును వారం పాటు సీబీఐకి అప్పగించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు అనుమతి లభించలేదు. దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీన్ని అత్యవసరంగా విచారించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నర్సింహా, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బుధవారం ప్రస్తావించారు. కేసు ఒకసారి సీబీఐ చేతికి వెళ్తే తమ పిటిషన్‌కు విలువ ఉండదని, కాబట్టి అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశారు.
ధర్మాసనం జోక్యం చేసుకుంటూ… సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో కాకుండా డివిజన్ బెంచ్ ముందు ఎందుకు సవాల్ చేశారని ప్రశ్నించింది. ఇప్పటికే సీబీఐ ఈ కేసు ఫైల్స్ అడుగుతోందని, ఫైల్స్ ఇస్తే ఏం మిగులుతుందని లూథ్రా ప్రశ్నించినా ప్రయోజనం లేకపోయింది.
ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ జడ్జి బెంచ్ జస్టిస్ బీ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఎదుట మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. సుప్రీం కోర్టుకు వెళ్లే వరకు వారం రోజుల పాటు ఈ కేసును సీబీఐకి అప్పగించకుండా నిలిపేయాలని ఆ పిటిషన్‌లో కోరింది. ఒకసారి డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పీళ్లను కొట్టేసిన తర్వాత మళ్లీ తాము స్వీకరించవచ్చా? లేదా? అని సింగిల్ జడ్జి బెంచ్ అనుమానం వ్యక్తం చేసింది.
తాజా పిటిషన్‌ను స్వీకరించడానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతి అవసరమని తెలిపింది. దానితో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ బుధవారం చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట.. సింగిల్ జడ్జి పిటిషన్‌ను స్వీకరించేందుకు అనుమతించాలని కోరారు. అయితే, ఒక్కసారి డివిజన్ బెంచ్ తిరస్కరించిన పిటిషన్లను తర్వాత మళ్లీ సింగిల్ జడ్జి విచారించడానికి అవకాశం లేదని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని డివిజన్ స్పష్టం చేసింది. దీంతో సింగిల్ జడ్జి బెంచ్ సైతం ప్రభుత్వ దరఖాస్తును కొట్టివేసింది.
కాగా, హైకోర్టు ఆదేశానుసారం ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను అప్పగించామని తెలంగాణ ప్రభుత్వంపై సిబిఐ వత్తిడి తెస్తున్నది. ఈ విషయమై సీబీఐ అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే ఐదు సార్లు లేఖలు రాశారు. మొదటి లేఖ గతేడాది 31న రాయగా, జనవరి 5, 9, 11, ఫిబ్రవరి 6న మిగతా లేఖలు రాసింది.