నిత్యం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన సన్నిహితులను విమర్శిస్తూ వార్తలలో ఉంటున్న వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయ ప్రయాణం ఎటు తెలియని సందిగ్ధతలో పడింది. కేంద్రంలో బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు, రాష్ట్రంలో టీడీపీ, జనసేన అధినేతలతో సహితం అంతే సాన్నిహిత్యం గడుపుతున్నారు.
రాష్ట్రంలో జగన్ పాలనకు ముగింపు పలకాలని అందరికన్నా ఎక్కువగా కోరుకొంటున్నది ఆయనే. టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేయాలని మొదటగా ప్రతిపాదించింది కూడా ఆయనే. అయితే ఆయన ప్రతిపాదనల పట్ల ఎవ్వరు బహిరంగంగా సుముఖత వ్యక్తం చేయడం లేదు.
గత జూన్ లోనే ఎంపీగా రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని, తనకు టిడిపి, జనసేన మద్దతు ఇవ్వడం ద్వారా సరికొత్త కూటమి ఏర్పాటుకు తన ఎన్నిక భూమిక ఏర్పాటు చేస్తుందని అంచనాలు వేసుకున్నారు. రాజీనామా చేయడానికి హోమ్ అమిత్ షా నిర్ణయించే ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా ప్రకటించారు.
ఉపఎన్నిక జరిగి, వైసిపిని ఓడిస్తే, ఆ పార్టీ క్రమంగా ముక్కలవుతుందని కూడా అంచనా వేశారు. అయితే ఇప్పట్లో వైసిపి ప్రభుత్వాన్ని బలహీన పరచడం పట్ల బిజెపి కేంద్ర నాయకత్వం ఆసక్తిగా లేన్నట్లు అనేక సందర్భాలలో స్పష్టం అయింది. అందుకనే ఆయనను ఎంపీగా రాజీనామా చేయకుండా అడ్డుకొంటున్నట్లు తెలుస్తున్నది.
దానితో ఇప్పుడు రాజీనామా అంశం గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. అయితే ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు చివరి రోజైన డిసెంబర్ 29న ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంకు నిధులు అంశంపై మొత్తం 22 మంది ఎంపీలతో రాజీనామా చేయించామని జగన్ కు బహిరంగ ప్రతిపాదన చేశారు. అప్పుడు టిడిపి ఎంపీలతో కూడా చేయిస్తానని కూడా ప్రకటించారు.
అయితే ఆయన చేసే ప్రతిపాదనలకు వైసీపీ సానుకూలంగా స్పందించే పరిస్థితులు లేవు. ఇప్పటివరకు టిడిపితో పొత్తుకు బిజెపి నాయకత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఆ విధంగా చేసి, తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదుగుతారని భయపడటమే అందుకు కారణం.
జాతీయ స్థాయిలో ఏ పార్టీ నుండి కూడా పేరున్న, అందరిని కలుపుకుపోగల నాయకులు లేకుండా బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తూ వస్తోంది. అందుకనే ఏపీలో తిరిగి జగన్ ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపి పరోక్షంగా సహకారం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే, జగన్ పరిపాలన లొసుగులను తీవ్రంగా ప్రతిరోజూ బైటపెడుతున్న రఘురామ కృష్ణరాజును తమ పార్టీలో చేర్చుకొని, ఎన్నికలలో బిజెపి సీట్ ఇచ్చే అవకాశమే ఉండకపోవచ్చు.
పైగా, టిడిపితో పొత్తు లేకుండా బిజెపి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన సిద్దపడే అవకాశాలు కూడా ఉండవు. నోటా కన్నా తక్కువ ఓట్లున్న పార్టీ అభ్యర్థిగా పోటీచేసి, ఓటమికి సిద్దపడే అవకాశాలు ఉండవు.అందుకనే టిడిపితో బిజెపి పొత్తుకు సిద్దపడక పోతే, టిడిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. అందుకనే తన రాజకీయ ఎత్తుగడల గురించి రఘురామ కృష్ణరాజు ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు.
పైగా, రెండు రాష్ట్రాలలోని బిజెపి నాయకులలో సహితం అనేకమంది జగన్ కు సన్నిహితులే ఉన్నారు. ఏపీ బీజేపీలో పలువురు వైసిపి పెయిడ్ జాబితాలో ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహితం సీఎం జగన్ కు సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. అందుకనే ఇప్పుడే బీజేపీలో చేరితే `వెన్నుపోటు’ ఖాయం అని రఘురామ కృష్ణరాజుకు తెలుసు.