ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో కవిత ముప్పేట దాడి!

Sunday, December 22, 2024

దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత రెండోసారి గురువారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఈడీ దర్యాప్తు జరుగుతున్న తీరుపై ముప్పేట దాడికి దిగారు. విచారణకు హాజరవుతున్నాను అంటూనే బుధవారం విచారణ తీరుపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు నుండి ఆమెకు వెంటనే ఎటువంటి ఊరట లభించక పోయినప్పటికీ ఈ సందర్భంగా ఈడీ గుర్తించి ఆమె చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి.  మొత్తం 150 పేజీల పిటీషన్ లో ఆమె విచారణకు హాజరుకావాల్సిన ఒక్క రోజు ముందు ఈడీ అధికారులపైనే సుప్రీంకోర్టులో దాడికి దిగడం ఆసక్తి కలిగిస్తున్నది.

తనను అరెస్ట్ చేసేందుకు ఈడీ సిద్ధంగా ఉందని గ్రహించే ఆమె కుటుంభం రాజకీయ పోరాటానికి సిద్దమవుతున్నట్లు స్పష్టం అవుతుంది. మరోవంక,  మోదీ, ఈడీలకు తాము భయపడమని  ఆమె సోదరుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ సహితం పేర్కొనడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలని చెప్పిన కేటీఆర్ తెలంగాణపై కేంద్రం కక్ష గట్టిందని మండిపడ్దారు. తెలంగాణకు పట్టిన శని బీజేపీ అని తీవ్రంగా ధ్వజమెత్తారు.

కేంద్రంలోని అధికార పార్టీ ఆదేశాల మేరకు ఈడీ తనను వేధిస్తోందని, తన విషయంలో ఈడీ చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని కవిత తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు ఎఫ్‌ఐ‌ఆర్‌లో తన పేరు ఎక్కడ లేదని, కొద్ది మంది వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనను ఈ కేసులో ఇరికించారని కవిత తెలిపారు.

ఈడీ విచారణ సరిగా లేదని, వేధింపులకు గురి చేస్తుందంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో కవిత ఆరోపించారు. విచారణలో భాగంగా ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుందని, శారీరకంగా, మానసికంగా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆమె చందన్ రెడ్డి అనే సాక్షిని కొట్టడంను నిదర్శనంగా ఆమె  చెప్పుకొచ్చారు.

ఈడీ అధికారులు తన ఫోన్‌ను బలవంతంగా తీసుకున్నారని, చట్ట విరుద్ధంగా తన ఫోన్ సీజ్ చేశారని ఆమె ఆరోపించారు. తన ఫోన్ సీజ్ చేసిన సమయంలో తన వివరణ తీసుకోలేదని, ఎవరితో కలిపి ఎదురెదురుగా విచారణ జరపలేదని చెప్పుకొచ్చారు. సూర్యాస్తమయం దాటిన తర్వాత 8:30 వరకు విచారించారని ఆమె మార్చి 11న ఈడీ విచారణ గురించి కోర్టుకు వివరించారు.

భౌతికంగా, మానసికంగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నానని.. తన నివాసంలోనే విచారణ జరపాలని, లేదంటే ఇతర నిందితులతో కలిపి జరిపి విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని కవిత సుప్రీంను అభ్యర్థించారు. బలవంతంగా వాంగ్మూలం తీసుకుంటున్నారని, ఈడీకి కావాల్సినట్లు వాంగ్మూలం ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఈడీ అధికారులపై కవిత సంచలన ఆరోపణలు చేశారు.

ఈడీ అధికారుల విచారణ తీరు బాగోలేదని, అందర్నీ భయపెట్టి, వేధింపులకు గురి చేసి వాంగ్మూలాలు తీసుకుంటున్నారంటూ పేర్కొనడం ద్వారా ఈ పర్యాయం తనను సహితం భయపెట్టే ప్రయత్నం చేయవచ్చనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.  పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. అయితే కవిత పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 24కు వాయిదా వేసింది. దీంతో గురువారం ఈడీ విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles