ఈడీ మూడో చార్జ్ షీట్లో కవిత భర్త అనిల్ కుమార్

Sunday, December 22, 2024

తెలంగాణాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే  బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలిగా నిర్ధారించి, అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వేగంగా కదులుతున్నట్లు స్పష్టం అవుతుండగా, తాజాగా దాఖలు చేసిన మూడో చార్జ్ షీట్ లో సంచలన విషయాలను ఈడీ వెల్లడించింది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేసింది.

ఆర్థిక లావాదేవీలపై కీలక అభియోగాలు మోపిన ఈడీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే ముడుపులు ఇచ్చారని స్పష్టంగా ఆరోపించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత తమ బినామీల ద్వారా వ్యాపారం చేశారని తెలిపింది. లిక్కర్ లాభాలతో  అరుణ్ పిళ్లై ద్వారా కవిత భూములు కొనుగోలు చేశారని చెప్పింది.

ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణను ఎదుర్కొన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఛార్జిషీట్‌లో ఈడీ పలుమార్లు ప్రస్తావించింది. నిందితుల లావాదేవీలకు సంబంధించిన వాట్సాప్ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ను ఛార్జిషీట్‌లో ఈడీ జత చేసింది.

తనకున్న పలుకుబడితో హైదరాబాద్ లో తక్కువ ధరకే కవిత భూములు కొన్నారని తెలిపింది. భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది. చార్జ్ షీట్ లో కవిత భర్త అనిల్ కుమార్ తో  పాటు, ఆమె సన్నిహితుల పేర్లను చేర్చింది ఈడీ. తొలిసారిగా కవిత భర్త పేరు ప్రస్తావనకు రావడం గమనార్హం.

చార్జి షీట్ లో ఫినిక్స్ శ్రీహరి పేరు,  కవిత సన్నిహితులు వి. శ్రీనివాస రావు, సృజన్ రెడ్డి  పేర్లను చేర్చింది ఈడీ. ఇండో స్పిరిట్ కు తన వాటాను అరుణ్ పిళ్లై ద్వారా కవితనే డబ్బులు ఇచ్చినట్లు పేర్కొంది.  కవిత బినామీగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మార్చి 6న అరెస్ట్ చేసింది.

మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, రాఘవ, కవిత, శరత్‌చంద్రారెడ్డితో కూడిన సౌత్‌గ్రూప్‌ రూ.100 కోట్లను హవాలా రూపంలోనే ఇచ్చారని ఈడీ ఆరోపించింది. లిక్కర్‌ పాలసీ తమకు అనుకూలంగా ఉండేలా ముడుపుల ద్వారా సౌత్‌గ్రూప్ భారీగా లబ్ధి పొందిందని, హవాలా, ముడుపులు, భూముల కొనుగోళ్లను మూడో ఛార్జిషీట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా ప్రస్తావించింది.

బినామీలతో మాగుంట, కవిత వ్యాపారం చేశారని ఈడీ ఆరోపించింది. ప్రేమ్‌రాహుల్ మాగుంట బినామీ అని, పిళ్లై కవిత బినామీ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్‌లో తెలిపింది. ఇండోస్పిరిట్‌లో మాగుంట, కవిత ప్రతినిధులుగా ప్రేమ్‌రాహుల్, పిళ్లై ఉన్నారని, ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఇండోస్పిరిట్‌ రూ.192 కోట్ల లాభాలు ఆర్జించిందని ఈడీ పేర్కొంది.

కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో  రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని, హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని, ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున  కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది ఈడీ.

కాగా, లిక్కర్ పాలసీకి సంబంధించి హైదరాబాద్‌లోని కవిత నివాసంలో సౌత్ గ్రూపుకు చెందినవారు జరిపిన  సమావేశంలో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు ఇదివరకే ఈడీ దృష్టికి వచ్చింది. విచారణకు హాజరు కావాలని కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ లకు త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles