ఇప్పటికైనా బీజేపీ పొత్తు ఆరాటం నుంచి చంద్రబాబు బైటపడతారా!

Wednesday, January 22, 2025

2024 అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్ గా స్వయంగా వైవి సుబ్బారెడ్డి వంటి వైసిపి నాయకులు విస్తృతంగా ప్రచారం చేసిన పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో మూడు చోట్ల కూడా వైసిపి పరాజయం చెందటం, టీడీపీ అనూహ్యంగా విజయం సాధించడం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం కావాలి. వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు ఈ ఫలితాలు సొంతబలమని టిడిపి మురిసిపోవాల్సిన అవసరం లేదు.

కానీ ఒక్కటిమాత్రం  నిజం. జనం వైసీపీ పట్ల ఆగ్రవేశాలతో ఉన్నారు. వైసిపిని ఓడించగల సత్తా టిడిపికి మాత్రమే ఉందని జనం గ్రహించారు. అందుకే పెద్దఎత్తున టిడిపికి మద్దతుగా నిలబడ్డారు. టిడిపి మురిసిపోవడం ఏమోగాని ఈ ఫలితాలు వైసీపీకి మాత్రం గట్టి హెచ్చరికను పంపుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనే సంకేతం ఇస్తున్నాయి.

ఈ ఎన్నికలు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు సహితం ఒక హెచ్చరిక కావాలి. రాష్ట్రంలో బిజెపికి నోటాకన్నా తక్కువగానే ఓట్లు ఉన్నాయని తెలిసిన కూడా, ఆ పార్టీ అధిష్టానం ఎంతగా ఛీత్కరించుకొంటున్నా ఆ పార్టీ పొత్తుకోసం వివిధ కారణాలతో వెంపర్లాడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అయినా బిజెపి బలం ఏమిటో గ్రహించడం అవసరం కాగలదు.

వాస్తవానికి బిజెపికి మొదటినుండి పట్టభద్రుల స్థానాలు బలమైనవిగా ఉంటూ వస్తున్నాయి. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లో మినహా రాయలసీమలోని రెండు స్థానాలలో, ఉత్తరాంధ్రలో ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం ఓటమి చెందిన బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి పివిఎన్ మాధవ్ తండ్రి పివి చలపతిరావు వరుసగా రెండుసార్లు గెలుపొందారు.

పైగా, ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విశాఖపట్నంలో బిజెపికి చెప్పుకోదగిన బలం ఉంది. 1981లో మొత్తం దక్షిణాదిలోనే మొదటిసారిగా బిజెపి అభ్యర్థి ఎన్ ఎస్ ఎన్ రెడ్డి ఇక్కడి నుండి మేయర్ గా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఎమ్యెల్యేగా కూడా గెలుపొందారు. 2014లో వైఎస్ విజయమ్మను ఓడించి డా. కె హరిబాబు బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా గెలుపొందారు. 1999లో ఆయన ఎమ్యెల్యేగా కూడా గెలుపొందారు. హరిబాబు టిడిపి మద్దతుతో గెలుపొందిన అంతకు ముందు సొంతంగానే బిజెపి గెలిచింది.

పివిఎన్ మాధవ్ గత పర్యాయం టిడిపి మద్దతుతో గెలుపొందారు. కానీ ఇప్పుడు ఆయనకు చెల్లని ఓట్లకన్నా తక్కువగా ఓట్లు,  మొత్తం ఓట్లలో 5.76 శాతం మాత్రమే వచ్చాయి. దీనిని బట్టి మొత్తం రాష్ట్రంలో బిజెపి పట్ల  ప్రజల మూడ్ అర్ధం అవుతుంది. పైపెచ్చు బిజెపి, ఆర్ఎస్ఎస్ శ్రేణులలో టిడిపి పట్ల విద్వేషం నెలకొంది. వారు టిడిపితో పోల్చితే వైసిపి పట్ల సానుకూలంగా ఉండడంతోనే 2019లో బిజెపి అభ్యర్థులు పోటీ చేసిన చోట్ల కూడా టిడిపిని ఓడించడం కోసం వైసీపీకి ఓట్లు వేశారు.

బిజెపి కేవలం వైసిపి వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా టిడిపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కోసమే పనిచేస్తున్నది. రాయలసీమలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో బిజెపికి ఓటువేసి వారిలో 60 శాతం మందికి పైగా టిడిపికి ఓటువేసినవారే ఉన్నారు. అంటే, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడంలో వారు ప్రముఖ పాత్ర వహించారు అన్నమాట.

అందుకనే బిజెపితో పొత్తు పెట్టుకోవడం అధికారంలోకి రావడానికి అవసరం అనే దురభిప్రాయాల నుండి చంద్రబాబు నాయుడు బయటపడాలి. ప్రజలను నమ్ముకుంటే, వైసిపిని ఓడించడంకోసం ఎదురుచూస్తున్న ప్రజలు  టిడిపికి ఓటువేసి సొంతబలంపై ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తారు.

ఈ సందర్భంగా బిజెపి మాజీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు చేసిన వాఖ్యలు బిజెపి శ్రేణులకు కాకుండా ఆ పార్టీతో పొత్తు కోరుకొంటున్న టిడిపి నేతలకు సహితం కనువిప్పు కలిగించాలి. ప్రజలు బిజెపి- వైసిపిని ఒకటిగానే చూస్తున్నారని ఆయన చెప్పకనే చెప్పారు. వైసీపీతో కుమ్మక్కయ్యారనే ప్రచారం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఓడిపోయినట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో బీజేపీ-వైసీపీ ఒక్కటేనన్న అభిప్రాయం ఓటర్లలో బలంగా వెళ్లడం వల్లే బీజేపీ ఓడిపోయిందని ఆయన తేల్చి చెప్పారు. ఇదే అభిప్రాయం కొనసాగితే భవిష్యత్తులో పార్టీకి మరింత నష్టం తప్పదంటూ బిజెపి ఉనికియే ప్రశ్నార్ధకరం కాగలదని సంకేతం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని విష్ణుకుమార్ రాజు విశ్లేషించారు.

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఫలితాలు ప్రతికూలంగా రావడం ప్రజల్లో వస్తున్న మార్పుకు నిదర్శమని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఏపీలో వైసీపీ, టీడీపీలకు సమాన దూరం అంటూ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న నేపథ్యంలో విష్ణు కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles