మార్గదర్శిలో ప్రత్యేక ఆడిటింగ్ కోసం స్పెషల్ ఆడిటర్ ఎందుకు!

Thursday, April 25, 2024

దేశంలోనే సుదీర్ఘకాలంగా, విశ్వసనీయతతో కొనసాగుతున్న మార్గదర్శి చిట్స్ ను మూయించడం ద్వారా రాజకీయంగా తమకు వ్యతిరేకంగా వార్తలు ఇస్తున్న అత్యధిక సర్క్యూలేషన్ గల ఈనాడు దినపత్రికను దారిలోకి తెచ్చుకోవాలని గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పట్లో సాధ్యం కాలేదు.

ఇప్పుడు తాజాగా ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టు విచారణలో ఉన్న పిటీషన్ లో ఏపీ ప్రభుత్వం గత ఏడాది ఇంప్లీడ్ అయింది. అంతటితో ఆగకుండా గత నెలరోజులుగా మార్గదర్శి కార్యాలయాలపై సిఐడి పోలీసులు వరుసగా సోదాలు చేస్తున్నారు.

ఈ సంస్థలో మోసాలకు జరిగిన్నట్లు గాని, తమకు సకాలంలో చిట్ మొత్తాలను చెల్లించలేదని గాని బాధితులైన వారెవ్వరూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనే లేదు. ఫిర్యాదులు లేకపోయినా తమంతట తామే నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇదే క్రమంలో మార్గదర్శి కార్యాలయాలపై దాడులు చేస్తోంది.

మార్గదర్శి కార్యాలయాల్లో తాజాగా నిర్వహించిన దాడుల్లో ఎనో ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. మరోవంక విచారణకు సహకరించడం లేదని  స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నత అధికారులు మీడియా సమావేశాలలో చెబుతున్నారు. సహకరించకపోతే రాష్ట్రంలో మార్గదర్శి కార్యాలయాలను మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు.

అంటే, వారనుకున్న విధంగా అక్రమాలు జరిగిన్నట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని స్పష్టం అవుతుంది. ఆధారాలు లభించి ఉంటె వాటిపై చర్యలకు ఉపక్రమించి ఉండేవారు. తాజాగా,
మార్గదర్శిపై స్టాంప్స్&రిజిస్టేషన్‍ శాఖ తీసుకున్న కీలక నిర్ణయం ఈ అంశాన్ని స్పష్టం చేస్తుంది.

మార్గదర్శిలో ప్రత్యేక ఆడిటింగ్ కోసం స్పెషల్ ఆడిటర్ ను ప్రభుత్వం నియమించింది. మార్గదర్శి చిట్ ఫండ్‍లో నిధుల మళ్లింపు, అక్రమ డిపాజిట్ల సేకరణ నేపథ్యంలో ప్రత్యేక ఆడిటర్ నియామకం జరిగినట్లు తెలుస్తోంది. మార్గదర్శికి చెందిన 37 బ్రాంచ్‍లలో ఆడిటింగ్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.

అక్రమాలు తేలితే సంస్ధను మూసేస్తామని కూడా తాజాగా మరోసారి హెచ్చరికలు చేశారు. ఓవైపు సీఐడీ, మరోవైపు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ దాడులతో మార్గదర్శిని  ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. స్పెషల్ ఆడిటర్ ను నియమించి, లోతుగా ఆడిటింగ్ జరపాలని నిర్ణయించారంటే అక్కడ పెద్ద ఎత్తున లోపాలు, అక్రమాలు జరిగిన్నట్లు తగిన సాక్ష్యాధారాల కోసం విఫల ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడి అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles