ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాల‌పై హైకోర్టు స్టే

Sunday, December 22, 2024

జ‌గ‌న్ స‌ర్కార్ కు ఎపి హైకోర్టులో మ‌రోసారి ఎదురుదెబ్బ త‌గిలింది. అమ‌రావ‌తిలోని ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాల‌కు హైకోర్టు నో చెప్పింది. వెంట‌నే అమరావతిలో 25 లే ఔట్లలో ఇళ్ల నిర్మాణాల‌ను నిలిపివేయాలంటూ త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం నేడు మ‌థ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.  ఈ జోన్ లో ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్ పదిరోజుల క్రితం భూమి పూజ చేశారు. తాజా హైకోర్టు తీర్పుతో అక్కడ నిర్మాణ పనులు నిలిచిపోనున్నాయి. 

రాజధాని అమరావతిలో ఆర్‌ 5 జోన్‌కి సంబంధించి సీఆర్డీఏ చట్టాన్ని సవరించి యాక్ట్‌ 13/2022, జీవో 45ని తీసుకొచ్చారు. మొత్తం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలు పెట్టారు. అమరావతి సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో పేదల కోసం మొత్తం 25 లే అవుట్‌లలో 50,793 మందికి ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.  అలాగే గత నెల 24న నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేశారు. 

రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐకాస హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు.  వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరిలతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ధర్మాసనం  ఇళ్ల స్థలాల కోసం 1402 ఎకరాల భూమి కేటాయింపును తప్పు పట్టింది.

గత నెల 24న రాజధాని ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వివాదాల్ని పరిష్కరించి పేదలకు ఇళ్ల స్థలాల్ని కేటాయించి ఇళ్లను నిర్మిస్తున్నామని ప్రకటించారు. పెత్తందారుల రాజధానిగా ఉన్న ప్రాంతాన్ని సామాజిక అమరావతిగా మారుస్తూ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో 1400 ఎకరాల్లో 50 వేల ఇళ్ల నిర్మాణానికి సిఎం జగన్ జులై 24న శంకు స్థాపన చేశారు. పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత, ఎన్నో అవరోధాలను అధిగమించి సాధించిన విజయంతో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఇళ్ళు కట్టించి ఇవ్వకుండా చంద్రబాబు, మీడియా సంస్థలు, దత్తపుత్రుడు అడ్డుపడ్డారని సిఎం జగన్ శంకుస్థాపన సందర్భంగా ఆరోపించారు.  అయితే, ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రోజుల వ్యవధిలోనే ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా, ప్రధాన పిటిషన్లు డిసెంబర్‌కు వాయిదా పడిన నేపథ్యంలో వాటితో కలిపి విచారణ జరగవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles